logo

నీరు పారదు.. పంట తడవదు

కాల్వల్లో పెరిగిన చెట్లు.. పూడికతో నిండిన మట్టి.. పగుళ్లు బారిన లైనింగ్, ధ్వంసమైన డిస్ట్రిబ్యూటరీలు. కొన్ని చోట్ల అసలు కాల్వల నామరూపాల్లేకుండా పోయాయి.

Published : 17 Jun 2024 02:58 IST

పూడికతీత, మరమ్మతులకు నోచుకోని కాల్వలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల

కాల్వల్లో పెరిగిన చెట్లు.. పూడికతో నిండిన మట్టి.. పగుళ్లు బారిన లైనింగ్, ధ్వంసమైన డిస్ట్రిబ్యూటరీలు. కొన్ని చోట్ల అసలు కాల్వల నామరూపాల్లేకుండా పోయాయి. ఇవి జిల్లాలోని చిన్న, మధ్యతరహా జలాశయాల పరిధిలోని కాల్వల పరిస్థితి. మెట్టప్రాంతమైన జిల్లాలో నీటి వనరులు బాగుంటేనే పంటలకు సాగునీరందడంతోపాటు భూగర్భ జలాలు నిలకడగా ఉంటాయి. జూన్, జులైలో కురిసిన వర్షాల ఆధారంగా ఆగస్టు నుంచి ఆయకట్టుకు నీరిచ్చేందుకు ప్రణాళికలు చేస్తారు. ఈలోపు కాల్వల్లో పూడిక తీయడం, డిస్ట్రిబ్యూటరీలు మరమ్మతులు వంటివి చేయించాలి. మిషన్‌ కాకతీయలో జరిగిన పనులు మినహా ఇప్పటికీ చిన్ననీటి వనరులను చక్కబెట్టిన పరిస్థితి లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీలో కేటాయించిన బడ్జెట్‌కు మించి ఈ ఏడాది పనులు చేశారని నాలుగు రోజుల క్రితం పూడికతీత పనులు నిలిపేశారు. ఈ పరిస్థితి ఆయకట్టు రైతులకు శాపంగా మారింది.

ఆరేళ్లుగా... 

ఎగువమానేరు జలాశయం కుడి, ఎడమ ప్రధాన కాల్వలు, వాటి పరిధిలోని డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులకు ఆరేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఏటా వర్షాలు, వరదలకు కాల్వలకు గండ్లు పడినచోట తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. ఈ జలాశయం పరిధిలో గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మండలాల్లో 40 వేల ఎకరాలపైగా ఆయకట్టు ఉంది. నిర్వహణ లేక ఆయకట్టు పరిధిలో వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. తంగళ్లపల్లి మండలంలోని నక్కవాగు జలాశయం సుమారు టీఎంసీ సామర్థ్యంతో ఉంది. నాలుగేళ్ల క్రితం ప్రధాన కాల్వలో పూడిక తీశారు. వర్షాలకు జిల్లెల్ల, సారంపల్లి, దేశాయిపల్లిలోని గొసుకట్టు చెరువులను నింపే ఉప కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు పూడికతో నిండిపోయాయి. కోనరావుపేట మండలం నిమ్మపల్లిలోని మూలవాగు (నిమ్మపల్లి) జలాశయం మిషన్‌కాకతీయలో చేసిన మరమ్మతులు మినహా తర్వాత పట్టించుకున్న నాథుడు లేడు. ఇక ప్రధాన కాల్వలు, ఉప కాల్వలు చాలా చోట్ల నామరూపాల్లేకుండా పోయాయి.

పనులు చేయాల్సిందిలా..

జిల్లాలోని చిన్న, మధ్యతరహా జలాశయాలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 9, 10, 11, 12 ప్యాకేజీల్లోకి వెళ్లాయి. వీటి ప్రధాన కాల్వల నిర్మాణమే అసంపూర్తిగా ఉంది. ఈ నిర్మాణాలు పూర్తయితే గొలుసుకట్టు చెరువులను కలిపే కాల్వల నిర్వహణ చేపట్టే అవకాశం ఉంది. నిమ్మపల్లి జలాశయం అదనపు ఎత్తిపోతల పరిధిలో ఉంది. పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తయితే ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల సీసీ లైనింగ్‌ పనులను గుత్తేదారు సంస్థ చేపడుతుంది. పంపుహౌస్‌ల నిర్మాణమే ముందుకు సాగడం లేదు. సింగసముద్రం వరకు 9వ ప్యాకేజీ నీళ్లు విడుదలకు సిద్ధంగా ఉంది. పురాతనమైన సింగసముద్రం ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్‌కు ప్రతిపాదనలను నీటిపారుదలశాఖ అధికారులు  ప్రభుత్వానికి పంపించారు. 9 ప్యాకేజీలో నీటివిడుదల ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. 


రైతులకు ఇబ్బందులు రానీయం

- అమరేందర్‌రెడ్డి, జిల్లా నీటిపారులశాఖ అధికారి

కాల్వల పూడికతీత ఉపాధి హామీలో చేపట్టాలి. దీనికోసం గ్రామాల వారీగా ముందే పనులు గుర్తిస్తారు. అధ్వానంగా మారిన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులు చేపడతాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరందేలా చర్యలు తీసుకుంటాం. 


చందాలతో పూడిక తీయిస్తున్నాం  

- గోగు ప్రతాప్‌రెడ్డి, మూలవాగు జలాశయం మాజీ ఛైర్మన్‌

జలాశయం కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులను పట్టించుకోండం లేదు. కుడి కాల్వ పూడికతో పూర్తి అధ్వానంగా మారింది. ఉపాధి హామీలో తీయమంటే లోతు ఎక్కువగా ఉందని ముందుకు రావడంలేదు. పంటలకు నీళ్లు వదిలే ముందు ఆయకట్టు రైతులంతా కలిసి చందాలు పోగుచేసి పొక్లెయిన్‌తో పూడిక తీయిస్తున్నాం. అధికారులు జలాశయంపై దృష్టి సారిస్తే అయిదు గ్రామాల రైతులకు రెండు పంటలకు సాగునీటి ఇబ్బందులు రావు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని