logo

దుకాణాలను మింగిన రహదారి

మండల కేంద్రమైన రుద్రంగి ప్రధాన రహదారి గుట్టను ఆనుకొని ఎత్తు ప్రదేశంలో ఉంటుంది. ఇలాంటి రహదారిని ఎత్తుగా నిర్మించే క్రమంలో పాత రహదారిపై ఉన్న మట్టిని తొలగించకుండానే కొత్తగా వేయడంతో మరింత ఎత్తు పెరిగి దాని వెంబడి దుకాణాలు నిండా మునిగాయి.

Published : 17 Jun 2024 03:01 IST

రుద్రంగిలో లబోదిబోమంటున్న వ్యాపారులు
న్యూస్‌టుడే, వేములవాడ 

మండల కేంద్రమైన రుద్రంగి ప్రధాన రహదారి గుట్టను ఆనుకొని ఎత్తు ప్రదేశంలో ఉంటుంది. ఇలాంటి రహదారిని ఎత్తుగా నిర్మించే క్రమంలో పాత రహదారిపై ఉన్న మట్టిని తొలగించకుండానే కొత్తగా వేయడంతో మరింత ఎత్తు పెరిగి దాని వెంబడి దుకాణాలు నిండా మునిగాయి. వాటి షట్టర్ల ఎత్తులో సగం వరకు రోడ్డు పెరగడంతో షాపులను తిరిగి నిర్మించుకోవాల్సిన దుస్థితి ఆయా వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అధికారులు నష్టంపై అంచనాలు వేయకపోవడం, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి దుకాణదారుల పాలిట శాపంగా మారింది. 
రుద్రంగిలోని అంబేడ్కర్‌ కూడలి నుంచి ఇందిరాచౌక్‌ మీదుగా నందివాగు వరకు దాదాపు రూ.8 కోట్ల నిధులతో రహదారితో పాటు ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణ పనులు చేపట్టారు. గత నాలుగేళ్లుగా ఈ రహదారి పనులు ఆగుతూ, సాగుతూ గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేశారు. రహదారి వెంబడి దాదాపు రెండు వందలకు పైగా దుకాణాలు ఉంటాయి. ఎత్తుగా నిర్మించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. రహదారి నుంచి షాపుల లోపలికి వెళ్లలేని పరిస్థితి ఇటు వ్యాపారులను, అటు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రహదారికి ఇరువైపులా మురుగు కాలువలు కట్టినప్పటికీ షాపులు ఎత్తు తగ్గిపోయి వరద వాటిలోకి ప్రవహించే పరిస్థితి  ఏర్పడింది. దీంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మట్టి తొలగిస్తే...

రుద్రంగిలోని ప్రధాన రహదారి ఎత్తును తగ్గించాలని, పాత రహదారిపై మట్టిని తొలగించి కొత్తగా నిర్మాణం చేపట్టాలని స్థానికులు అధికారులకు విన్నవించినా, నిరసన తెలిపినా పట్టించుకున్న నాథుడు లేడు. మట్టి తొలగిస్తే షిప్టింగ్‌ ఛార్జి అవుతుందని, దీనిని ఎవరు భరించాలని గుత్తేదారు ఉన్న రహదారిపైనే నూతనంగా రోడ్డు నిర్మించారని స్థానికులు వాపోతున్నారు. అధికారులు, గుత్తేదారు చేసిన పొరపాటుకు తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి ఎత్తు పెంచడంతో దాని వెంబడి పాత భవనాలు, షట్టర్లతో పాటు నూతనంగా నిర్మించిన దుకాణాలు ఆకారాలు కోల్పోయాయని వాపోయారు. బస్టాండ్‌లోని శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం ముందు నుంచి గ్రామం లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, చెరువు కట్టను తలపిస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో చాలా మంది వాహనదారులు వీధిలో నుంచి కాకుండా చుట్టూ స్తూపం నుంచి ప్రధాన రహదారికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


లోపలికి వెళ్లలేని పరిస్థితి 

- కాసోజి రమేశ్, రుద్రంగి

రహదారిని బాగా ఎత్తుగా నిర్మించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా దుకాణం సగం కిందకు అయింది. షట్టర్‌ తీసి లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉంది. వర్షపు నీరు దుకాణంలోకి వస్తోంది. మురుగు కాలువపై చెక్కలు వేసుకొని షాపులోకి దిగుతున్నాం.


ఇబ్బందిగా మారింది

- గట్ల రాహుల్, రుద్రంగి

గతంలో ఉన్న రోడ్డుపై మట్టిని తొలగించి నిర్మాణం చేస్తే దుకాణాలకు ఇబ్బందిగా ఉండేది కాదు. గతంలోనే రహదారి ఎత్తుగా ఉంది. దాన్ని మరింత ఎత్తుగా నిర్మించడంతో వ్యాపారులందరికీ ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం షాపులు పనికి రాకుండా పోయాయి.


నిబంధనల ప్రకారమే...

- శాంతయ్య, డీఈఈ, ఆర్‌అండ్‌బీ, వేములవాడ 

రుద్రంగిలోని ప్రధాన రహదారి నిర్మాణం నిబంధనల మేరకు చేశాం. ఫోర్‌లైన్‌ స్టాండర్ట్స్‌ ప్రకారం రహదారి ఎత్తు పెంచి నాణ్యతగా నిర్మించాం. దానికి ఇరువైపులా దుకాణాలు చాలా వరకు పాతవే ఉన్నాయి. ఎవరికీ పెద్ద నష్టం ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని