logo

ధరణి సమస్యలకు పరిష్కారం లభించేనా!

ధరణి సమస్యల పరిష్కారంపై కదలిక వచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Published : 17 Jun 2024 03:03 IST

పెండింగ్‌లో ఉన్న వాటిపై ప్రత్యేక పరిశీలన
నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశాలు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌ 

రణి సమస్యల పరిష్కారంపై కదలిక వచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెలాఖరులోపు జీఎల్‌ఎం, టీఎం-33లతో పాటు స్పెషల్‌ డ్రైవ్‌ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు పాత రికార్డులను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి దరఖాస్తు పెండింగ్‌కు గల కారణాలను నివేదించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఆర్డీవో, తహసీల్దార్లకు లాగిన్‌ ఇవ్వడంతో రైతుల ఇబ్బందులు తొలగనున్నాయి. 

వీడని చిక్కుముడి

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో జీఎల్‌ఎం, టీఎం-33 అర్జీలను పరిష్కరించే ప్రక్రియ వాయిదా పడింది. దీంతో ప్రతిరోజు కలెక్టరేట్‌లోని ధరణి సహాయ కేంద్రానికి రైతులు పరుగు తీశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎన్నికల క్రతువులో భాగస్వాములుకావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్నారు. కాగా చిన్న చిన్న సమస్యలతో పట్టా హక్కులతో పాటు రైతుబంధు, రైతుబీమా, పంట రుణం ఇతర పథకాలకు దూరమవుతున్నారు. 

ఆర్డీవో, తహసీల్దార్‌లకు లాగిన్‌

గతంలో ధరణి సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకు మాత్రమే ఉండేది. వేల సంఖ్యలో అర్జీలు వస్తుండటంతో ఇటీవల ఆర్డీవోలతో పాటు తహసీల్దార్‌లకు లాగిన్‌ సౌకర్యం కల్పించారు. ఆర్డీవోలకు పట్టాదారు పాసు పుస్తకం లేకుండా నాలా కన్వర్షన్, ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, ఏన్నారైలకు (ప్రవాస భారతీయులు) సంబంధించిన భూముల సమస్యలతో పాటు కోర్టు కేసుల పరిష్కారం తదితరాలను పరిష్కరించే అధికారం కేటాయించారు. తహసీల్దార్‌లకు జీఎల్‌ఎంలోని కుల, జెండర్, తండ్రి పేరు మార్పిడి బాధ్యతలు అప్పజెప్పారు.


ప్రత్యేక బృందాల పరిశీలన

జిల్లాలో ధరణి పోర్టల్‌లో 43,862 దరఖాస్తులు నమోదయ్యాయి. వీటిలో 24,771 పరిష్కరించగా పలు కారణాలతో 13,542 తిరస్కరించారు. మిగిలిన 5,549 దరఖాస్తుల్లో తహసీల్దార్‌ లాగిన్‌లో 4,440, ఆర్డీవో 376, అదనపు కలెక్టర్‌ 80, కలెక్టర్‌ లాగిన్‌లో 653 చొప్పున పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం మండలాల్లో బృందాలను నియమిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పెద్దపల్లిలో 1,514, ధర్మారంలో 559 దరఖాస్తులున్నాయి. పోర్టల్‌లో కొందరి రైతులకు చిన్నచిన్న తప్పిదాలు ఉన్నప్పటికీ అధికారులు కావాలనే తిరస్కరిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని