logo

సంస్కరణల అమలుతోనే అభివృద్ధి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రధాన ఆలయాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురిలో రానున్న రోజుల్లో పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Published : 17 Jun 2024 03:10 IST

న్యూస్‌టుడే, ధర్మపురి

మ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రధాన ఆలయాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురిలో రానున్న రోజుల్లో పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కమిషనర్‌ హనుమంతరావుతో పాటు ఉన్నతాధికారులు హాజరై పలు విషయాలను చర్చించారు. ఇప్పటి వరకు భక్తులకు అందుతున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి? ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఏ విధంగా తీర్చిదిద్దాలనే విషయాలపై ఉన్నతాధికారులు, ప్రతినిధులతో చర్చించారు. ప్రధానంగా వసతులు, రవాణా, సేవలు, ఆలయాల్లో సిబ్బంది పనితీరు, పార్కింగ్‌ సమస్యలు తదితర అంశాలపై దృష్టిసారించాలని భక్తులు కోరుతున్నారు.

సరైన వసతి లేక...

ధర్మపురి, కొండగట్టు క్షేత్రాల్లో వేములవాడలో ఉన్నట్లు పెద్ద ఎత్తున వసతి గృహాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ధర్మపురిలో ఒకే ధర్మశాల ఉంది. సరిపడా సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఆలయం ఎదుటే రాత్రి సమయంలో నిద్రిస్తున్నారు. పలువురు ప్రైవేటు వసతి గృహాలపై ఆధార పడుతున్నారు. ఈ క్షేత్రంలో భక్తులకు సరిపడా గదుల నిర్మాణంపై అధికారులు, పాలకులు దృష్టి సారించాల్సి ఉంది. ప్రతి శనివారం ధర్మపురికి, సోమ, మంగళవారాల్లో కొండగట్టుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఈ క్షేత్రాల్లో గదులు అందుబాటులో లేవు.

తాగునీటికి ఎప్పుడూ కటకటే

ధర్మపురి క్షేత్రంలో తాగు నీటి సౌకర్యం లేక భక్తులు నానా ఇబ్బంది పడుతున్నారు. తలాపునే గోదావరినది ఉన్నా దేవస్థానానికి పూర్తి స్థాయిలో తాగు నీటి పథకం లేదు. వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకుని వచ్చి సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంటోంది. నదిలో పుణ్య స్నానాలు చేసిన భక్తులకు తీర ప్రాంతంలో కనీస వసతులు కరవయ్యాయి. దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలికషెడ్లను దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేయాలి.

బస్సు సదుపాయం అంతంతే..

ధర్మపురి నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రధాన పట్టణాలకు నేరుగా ఆర్టీసీ బస్సు సదుపాయం లేదు. ఈ కారణంగా భక్తులు ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు. ఆలయాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఒక పుణ్యక్షేత్రం నుంచి మరో పుణ్యక్షేత్రానికి నేరుగా ఆర్టీసీ సదుపాయం లేదు.


పార్కింగ్‌కు తప్పని ఇక్కట్లు 

ర్మపురిలో వాహనాల పార్కింగ్‌ పెద్ద సమస్యగా మారుతోంది. రూ.50 ప్రతీ వాహనానికి వసూలు చేస్తుండగా నిలిపేందుకు స్థలాలను చూపడం లేదు. వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియక భక్తులు అయోమయానికి గురవుతున్నారు. ఉత్సవాల సమయంలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. వేములవాడలో ఉన్నట్లుగా ధర్మపురిలో శాశ్వత ప్రాతిపదికన స్థలాలను కొనుగోలు చేసి పార్కింగ్‌ ఏర్పాటు చేయాలి. పెద్ద, చిన్న హనుమాన్‌ జయంతి వేడుకల సమయంలో కొండగట్టు, ధర్మపురి క్షేత్రాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రైవేట్‌ స్థలాలను అద్దెప్రాతిపదికన సేకరించి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. 


దేవాదాయ శాఖ ప్రణాళిక

-సంకటాల శ్రీనివాస్, ఈవో, ధర్మపురి దేవస్థానం

ధర్మపురి క్షేత్రంలో భక్తులకు వసతుల కల్పన కోసం ఇటీవల హైదరాబాద్‌లో ఉన్నత స్థాయిలో సమావేశం నిర్వహించి చర్చించారు. ఉమ్మడి జిల్లాలోని క్షేత్రాల్లో భక్తులకు వసతుల కల్పన, అభివృద్ధి పనులపై ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని