logo

శాశ్వత చర్యలు ఎక్కడ?

వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఏటా వరదలు సంభవించి కాలనీలు జలమయమవడం, ఇళ్ల నుంచి ప్రజలు బయటకురాని పరిస్థితులు నెలకొన్నా ముప్పు నివారణకు పాలకులు శాశ్వత చర్యలు చేపట్టడం లేదు.

Published : 17 Jun 2024 03:14 IST

కోరుట్లలో ఏటా మునుగుతున్న కాలనీలు
న్యూస్‌టుడే, కోరుట్ల

వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఏటా వరదలు సంభవించి కాలనీలు జలమయమవడం, ఇళ్ల నుంచి ప్రజలు బయటకురాని పరిస్థితులు నెలకొన్నా ముప్పు నివారణకు పాలకులు శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. వరదలు కాలనీలను ముంచెత్తితే మున్సిపల్‌ కౌన్సిలర్లు, అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు.  

  • అయిలాపూర్‌ కిందున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం పక్కనున్న కాలనీలు బ్యాక్‌ వాటర్‌తో చుట్టుముట్టుతున్నాయి. మద్దుల చెరువు కాలువ నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో కాలనీల గుండా వెళ్లే మురుగు, కాలువలో వరద నీరు వెనకకు వచ్చి ఇళ్లలోకి చేరుతున్నాయి. కాలనీలన్నీ బురదమయంగా మారి కంపుకొడుతున్నాయి. దోమలు వృద్ధిచెంది ప్రజలు అనారోగ్యం భారీనపడుతుంటారు.
  • ఏటా వర్షాకాలంలో భారీ వర్షం కురిసినప్పుడల్లా ముత్యాలవాడ పూర్తిగా జలమయమవుతుంది. ముత్యాలవాడ పైనున్న దేశాయినగర్, రాంనగర్, బీలాల్‌పుర, ఏసుకొనిగుట్ట ప్రాంతంలో భారీగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అక్కడి వరద ముత్యాలవాడ గుండా దాని కిందున్న మద్దుల చెరువులో కలుస్తుంది. ముత్యాలవాడలో మురుగు కాలువలు చిన్నవిగా నిర్మించడంతో అందులో వరదనీరు వెళ్లకు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. .
  • రతాలపంపు, ఎల్‌ఐసీ కాలనీ, టీచర్స్‌క్లబ్‌రోడ్‌లలో మురుగు కాలువలు సక్రమంగా నిర్మించకపోవడంతో పట్టణంలో కురిసిన కొద్దిపాటి వర్షానికే మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. భారీ వర్షాల వల్ల దుకాణాలు, ఇళ్లలోకి మురుగు నీరు చేరుతోంది. రోడ్లపై బురద చేరడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
  • ఫుల్‌వాగు స్థలాన్ని ఆక్రమించుకొని గంగంపేట ప్రాతంలో పలుకాలనీలు వెలిశాయి. ఏటా వాగులో వరదనీరు ప్రవహించినప్పుడల్లా కాలనీలు పూర్తిగా జలమయమవుతున్నాయి. ప్రమాదం అని తెలిసినా వాగు స్థలంలో అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గతేడాది వరదల వల్ల వాగు స్థలం ఆక్రమించుకొని నిర్మించుకున్న 15 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తినష్టం వాటిళ్లింది.

ఇళ్లు విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు

 - గుంటుక లింగమూర్తి, ప్రకాశంరోడ్‌ 

పట్టణంలోని ప్రకాశంరోడ్‌లో ఏటా వరదలు సంభవించి కాలనీలను రోజుల తరబడి ముంచెత్తుతున్నాయి. రోడ్లపై రెండు, మూడు అడుగులమేర నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వస్తువులు చెడిపోతున్నాయి. వరదలు వచ్చినప్పుడల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సాయం చేస్తున్నారే తప్పా శాశ్వతంగా వరద ముప్పును నివారించడం లేదు.


రాకపోకలు బంద్‌

- కట్కురి రమేశ్, రవీంద్రరోడ్‌ 

తాళ్ల చెరవు మత్తడి దూకినప్పుడల్లా దాని కిందున్న కాలనీలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకురాని పరిస్థితులు నెలకొంటున్నాయి. మత్తడి కిందున్న కాలువను పూర్తిగా ఆక్రమించి రోడ్డు నిర్మించడంతో వరదలు సంభవించినప్పుడల్లా రోడ్డుపై ఉద్ధృతంగా వరదనీరు ప్రవహిస్తుంది. వరదల వల్ల ప్రమాదాలు నెలకొంటున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదు. వరద నీరు వెళ్లేలా అధికారులు ఫుల్‌వాగు వరకు ప్రత్యేక కాలువను నిర్మించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని