logo

సృజన ఆవిష్కృతం.. విజ్ఞాన సమ్మిళితం

ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Published : 17 Jun 2024 03:20 IST

జేఎన్టీయూ మంథని కళాశాలలో ఆలోచింపజేసిన ఫెస్ట్‌
న్యూస్‌టుడే, కమాన్‌పూర్‌(సెంటినరీకాలనీ)

ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనుబంధ కళాశాలల్లో ‘ఆవిష్కృత్‌’ పేరిట మార్చిలో రెండు రోజుల పాటు విజ్ఞాన మేళా జరుపుతున్నారు. ఈసారి ఎన్నికల కోడ్‌ కారణంగా మూడు నెలలు ఆలస్యంగా నిర్వహించారు. రామగిరి మండలం పన్నూరులోని మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 11, 12 తేదీల్లో అట్టహాసంగా నిర్వహించిన ‘ఆవిష్కృత్‌’లో రెండు, మూడో సంవత్సరం విద్యార్థుల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. 2013 నుంచి ఏటా ఇక్కడి విద్యార్థులు తయారు చేస్తున్న ఆవిష్కరణలు యూనివర్సిటీ స్థాయిలో అవార్డులు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకట్టుకున్న పలు ప్రాజెక్టులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

బొగ్గు వెలికితీతపై ప్రత్యక్ష అవగాహన

మూడో సంవత్సరం మైనింగ్‌ బ్రాంచ్‌ విద్యార్థులు దీన్ని రూపొందించారు. సీహెచ్‌.పెంటాజీ, రాథిన్‌లు రూ.17 వేలు వెచ్చించి 15 రోజులు కష్టపడి ఈ ప్రాజెక్టును తయారు చేశారు. వంగవిల్లి పద్ధతిలో మైనింగ్‌ రంగంలో బొగ్గు వెలికితీత ప్రక్రియను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా దీన్ని తీర్చిదిద్దారు.


మర మనిషి బహుళ సేవలు

ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం విద్యార్థులు తేజ, రూపక్, కల్పన, సౌందర్య సొంతంగా నడిచే రోబోను తయారు చేశారు. అధ్యాపకులు తిరుపతి, శ్రీధర్‌ల సహకారంతో రూ.2 వేలతో దీన్ని రూపొందించారు. మిలిటరీలో సైన్యానికి తోడ్పాటు అందించడంతో పాటు మానవ రహితంగా సైనికులు నిర్వహించే ఆపరేషన్లలో వీటిని ఎలా వాడతారో వివరించారు. మనుషుల అవసరం లేకుండా వస్తు రవాణాకు ఈ రోబో ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. 


విమానాలకు ఉపయుక్తంగా జెట్‌ శక్తి

మూడో సంవత్సరం విద్యార్థులు నితిన్‌కుమార్, గణేశ్‌కృష్ణ, రేవంత్, శ్రీవాత్సవ్‌ వర్కింగ్‌ మోడల్‌ ఆఫ్‌ రాంజెట్ ఇంజిన్‌ను రూపొందించారు. ఈ జెట్ ఇంజిన్‌ ఫీచర్లు, దాని పనితీరును తెలుసుకోవడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 8 రోజులు కష్టపడి దీనిని తయారు చేసినట్లు విద్యార్థులు వివరించారు. విపరీతమైన థ్రస్ట్‌(నెట్టడం) ద్వారా ఉత్పత్తి అయిన శక్తితో విమానాన్ని పని చేయిస్తే అది చాలా వేగంగా ఎగురగలుగుతుందని చూపించారు. 


తక్కువ ఖర్చుతో కటింగ్‌ యంత్రం

చెక్కను, లోహాలను వివిధ ఆకృతుల్లోకి మార్చడానికి ప్రధానంగా ఉపయోగించే స్థిర కటింగ్‌ యంత్రాన్ని పోలిన నమూనాను రెండో సంవత్సరం విద్యార్థులు అజయ్, అక్షిత్, చరణ్, సన్నీ, సూర్యప్రకాశ్‌ తయారు చేశారు. పుస్తకంలోని పాఠాల్లో ఈ యంత్రం గురించి చదువుకునే విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేలా అతి తక్కువగా రూ.500తో దీన్ని రూపొందించారు.


ఉత్తమ ప్రాజెక్టులకు అవార్డులు

- చెరుకు శ్రీధర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ 

సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు తయారు చేస్తుండగా వాటిని యూనివర్సిటీ ప్రోత్సహిస్తోంది. ఈ ప్రాజెక్టులను యూనివర్సిటీకి పంపిస్తాం. గతంలో పలు ఆవిష్కరణలకు అవార్డులు వచ్చాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని