logo

సాగులో సస్యరక్షణ చర్యలే కీలకం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పత్తి, ఇతర పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కొద్దిపాటి వర్షానికే ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు విత్తుకున్నారు. వరి సాగుకు నారును సిద్ధం చేశారు. తీరా వర్షం కురవకపోవటంతో ఆందోళన చెందుతున్నారు.

Published : 17 Jun 2024 03:22 IST

జమ్మికుంట కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త వెంకటేశ్వర్‌రావు
న్యూస్‌టుడే, జమ్మికుంట

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పత్తి, ఇతర పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కొద్దిపాటి వర్షానికే ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు విత్తుకున్నారు. వరి సాగుకు నారును సిద్ధం చేశారు. తీరా వర్షం కురవకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వర్షం పడడం లేదని, అదను దాటిందని అన్నదాతలు ఆందోళన పడొద్దని జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్‌ శాస్త్రవేత్త ఎన్‌.వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సాగుకు సమాయత్తమైన రైతులు పత్తి, వరి, ఆరుతడి, ఇతర పంటల సాగులో తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో వెల్లడించారు.  

ప్రశ్న: కొద్దిపాటి వర్షానికే పలువురు రైతులు విత్తనాలు నాటారు. కొన్ని చోట్ల మొలకెత్తలేదని ఆందోళన చెందుతున్నారు. వారు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

సమాధానం: సాధారణంగా 50 మి.మీ. వర్షపాతం నమోదైనప్పుడు విత్తనాలను నాటితే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు నీటి సౌకర్యం ఉంటే తడిని అందించాలి. మొక్క మొలకెత్తని చోట సరైన వర్షం పడిన తర్వాత మళ్లీ విత్తనం విత్తుకోవాలి. ఇంకా పత్తి సాగు చేపట్టని రైతులు దుక్కులు దున్నలేదని, విత్తనాలు నాటలేదని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జులై 17 వరకు పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. 

ప్ర: వరి నాట్లకు ఎంత సమయం ఉంది? 

స: వరిలో దొడ్డురకాలైనా, సన్నరకాలైనా జులై 31లోగా నారును పోసుకోవాలి. ఆగస్టు 31లోగా నాట్లు పూర్తి చేసుకోవాలి. వరిలో విత్తే విధానాన్ని పాటిస్తే పంట కాలం వారం రోజులు తగ్గుతుంది.  

ప్ర: పండ్ల తోటల్లో ఏ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి?   

జ: డ్రాగన్‌ ఫ్రూట్, ఇతర పండ్ల తోటల సాగు చేపడుతున్న రైతులు మొక్కలకు తేలికపాటి నీటి తడి అందేలా చూసుకోవాలి. మామిడి రైతులు చెట్ల ఎండు కొమ్మలను కత్తిరించుకోవాలి. వర్షం పడితే పచ్చిరొట్ట ఎరువులు, జనుము, పెసర, పిల్లి పెసర చల్లుకుంటే సత్ఫలితం ఉంటుంది.   

ప్ర: వరిలో తెగుళ్ల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?

స: సాగులో సస్యరక్షణ చర్యలు పాటించడం ముఖ్యం. వరి నారు పెరుగుదలకు జింక్‌ సల్ఫైట్‌ 2 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా నత్రజని, భాస్వరం, పొటాష్‌ 19:19:19 అయిదు గ్రాములను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగిపురుగు నివారణకు నారు పోసిన 12-15 రోజుల తర్వాత ఎకరానికి వేప నూనె 1500 పీపీఎం, 5 మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారు తీసే వారం ముందు ఎకరం నారుమడికి ఎకరానికి కార్పొక్యూరాన్‌ గుళికలు 800 గ్రాముల నుంచి కిలో వరకు చల్లుకుంటే మొగిపురుగు రాకుండా ఉంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్‌ జీవన ఎరువులను ఎకరానికి 400 మి.లీ.ను 10 కిలోల పశువుల పేడలో కలిపి చల్లుకుంటే 25 శాతం వరకు రసాయనిక ఎరువులను తగ్గించుకోవచ్చు. 

ప్ర: పప్పు దినుసులు, కూరగాయలు, ఇతర పంటల సాగుపై సూచనలు?  

స: జూన్‌ 30 వరకు పెసర, మినుము.. ఆగస్టు చివరి వారంలోగా కంది విత్తనాలు విత్తుకోవచ్చు. కందిని పత్తి, వేరుసెనగ, పెసర, మినుములో అంతరపంటలుగా సాగు చేయవచ్చు. ఆయిల్‌ ఫామ్‌లో అంతర పంటల సాగు చేపట్టిన రైతులు.. వర్షాలు లేకుంటే డ్రిప్‌ ద్వారా అయినా నీటి తడిని అందించేలా చూడాలి. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసే రైతులు ప్రధానంగా నీటి సౌకర్యం, మార్కెటింగ్‌ తీరును బట్టి ముందడుగు వేస్తే లాభాలు పొందవచ్చు. మిరప సాగు చేపట్టే రైతులు సెప్టెంబర్‌లో మెరపనారును నాటుకోవచ్చు. మొక్కజొన్న సాగుకు జులై 10లోపు సమయం ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని