logo

పేద విద్యార్థుల ప్రతిభకు పట్టం

వారంతా పేద విద్యార్థులు.. అయినా వారిలో ప్రతిభకు కొదవలేదు. చదివేది ప్రభుత్వ పాఠశాలలోనైనా పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని జాతీయ ప్రతిభ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు.

Published : 17 Jun 2024 03:25 IST

జాతీయ ఉపకార వేతనాలకు 228 మంది ఎంపిక
న్యూస్‌టుడే, చొప్పదండి

వారంతా పేద విద్యార్థులు.. అయినా వారిలో ప్రతిభకు కొదవలేదు. చదివేది ప్రభుత్వ పాఠశాలలోనైనా పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని జాతీయ ప్రతిభ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. పాఠశాల స్థాయిలోనే భవితకు బాటలు వేసుకున్నారు. ప్రతిభ గల పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షను 2006 నుంచి ఏటా నిర్వహిస్తోంది. ఈ పరీక్ష రాయడానికి ప్రభుత్వ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.12000 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.48,000 అందించనున్నారు. 

ఉమ్మడి జిల్లాలో..

ఈ ఏడాది జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 7 వేలకు పైగా ఎనిమిదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 228 మంది ఎంపికయ్యారు. వీరికి 9వ తరగతి నుంచి ఏటా రూ.12 వేల చొప్పున ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే వరకు ఉపకార వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. వారు ఆ నాలుగేళ్లు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివితేనే డబ్బులు పడతాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేస్తే నగదు జమ కావు.


ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో..

- ప్రియదర్శిని, రాగంపేట జడ్పీ పాఠశాల

మా అమ్మ రేణుక కూలీ పని చేస్తుండగా.. నాన్న ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లార[ు. మా పాఠశాల నుంచి ఏటా కనీసం ఒక్కరైనా ఈ ఉపకార వేతనానికి ఎంపికవుతున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని నేను సన్నద్ధమయ్యా. ఉపాధ్యాయులు మాదిరి ప్రశ్నపత్రాలు ఇవ్వడంతోపాటు చక్కగా సన్నద్ధం చేయించారు. ఇలాగే చదువుకొని మా తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తా.


ఉన్నత చదువులకు ఉపయోగకరం

- కడారి అభినవేష్, కాట్నపల్లి జడ్పీ పాఠశాల  

జాతీయ ఉపకార వేతనానికి ఎంపికవ్వడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా తల్లిదండ్రులు శ్యామల, అంజయ్యలు కూలీ పని చేసి నన్ను చదివిస్తున్నారు. ఈ డబ్బులను ఉన్నత చదువులకు ఉపయోగించుకుంటాను. ఇలాంటి ప్రోత్సాహకాలతో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని