logo

ఆలయ మాన్యాలకు శఠగోపం

దేవుడి మాన్యాలకూ రక్షణ కరవైంది. రూ.కోట్ల ఆస్తులున్నప్పటికీ ఆదాయం లేక ఆలయాల నిర్వహణ భారంగా మారింది.

Published : 17 Jun 2024 03:29 IST

ఆక్రమణల్లో వందలాది ఎకరాలు 
మంత్రి ఆదేశాలతోనైనా గుర్తింపు కొలిక్కి వచ్చేనా!
ఈనాడు, పెద్దపల్లి 

దేవుడి మాన్యాలకూ రక్షణ కరవైంది. రూ.కోట్ల ఆస్తులున్నప్పటికీ ఆదాయం లేక ఆలయాల నిర్వహణ భారంగా మారింది. దేవాదాయ శాఖకు చెందిన భూములన్నింటికీ పాసుపుస్తకాలు ఉండాలని మంత్రి కొండా సురేఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దేవాదాయ, ధర్మదాయ శాఖాధికారులు అన్యాక్రాంతమైన ఆలయ మాన్యాల గుర్తింపునకు కసరత్తు చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 3,634.65 ఎకరాల భూములున్నట్లు గుర్తించారు. ఇందులో 1,932.46 ఎకరాలు మాత్రమే ఆలయాల పేరిట ధరణిలో నమోదయ్యాయి. మొత్తం 423 ఆలయాల్లో 55 ఆలయాలకు చెందిన 572.29 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాలున్నాయి. మరో 368 ఆలయాలకు సంబంధించి 3062.36 ఎకరాలకు జారీ చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్‌ రాక ముందు ఆలయ మాన్యాలు రికార్డుల్లో మిగులు భూములుగా ఉండేవి. గత ప్రభుత్వం పోర్టల్‌ ప్రవేశపెట్టిన అనంతరం సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయించింది. సమస్యాత్మకంగా ఉన్న భూములు, అధికారులు అందుబాటులో లేని చోట మాత్రం ఏర్పాటు చేయలేదు. ఆలయ భూములన్నింటికీ పాసుపుస్తకాలు ఇవ్వాలని మంత్రి ఆదేశించినప్పటికీ ఆక్రమణదారులు, కబ్జాదారుల చెరలో ఉన్న వాటిని తిరిగి ఎలా స్వాధీనం చేసుకోవాలో అధికారులకు అంతుచిక్కడం లేదు.

ట్రైబ్యునల్‌ ఆదేశాలూ బేఖాతరు

క్రమణలను నియంత్రించేందుకు దేవాదాయ శాఖ భూములన్నింటికీ పాసుపుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా కోర్టు కేసులతో ఈ ప్రక్రియ ముందుకు సాగేలా కనిపించడం లేదు. ఆలయ భూములకు హద్దులు ఏర్పాటు చేయకపోవడం చాలా చోట్ల ఆక్రమణదారులకు వరంగా మారింది. కోర్టు కేసుల్లో ఆలయాలకు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో కొర్రీలు పెడుతున్నారు. ఆక్రమణదారుల చెరలో ఉన్న వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలని దేవాదాయ శాఖ  ట్రైబ్యునల్‌ పలుమార్లు ఆదేశించినా ఫలితం ఉండటం లేదు. ఉమ్మడి జిల్లాలో 50 శాతం ఆలయ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా తీసుకోలేదని గతంలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. 


దర్జాగా స్థిరాస్తి వెంచర్ల ఏర్పాటు

అంగ, అర్థ బలంతో దొంగ పట్టాలు సృష్టించి గుడి మాన్యాలను దర్జాగా కబ్జా చేయడంతో పాటు ప్లాట్లు, వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. పలు చోట్ల ఏకంగా భవనాలు నిర్మిస్తున్నా అధికారులు మిన్నకుండిపోతున్నారు. వేములవాడ, కొండగట్టు, కోటిలింగాల, ధర్మపురి, ఓదెల మల్లికార్జున ఆలయం, కమాన్‌పూర్‌ ఆదివరాహస్వామి, మంథని లక్ష్మీనారాయణస్వామి ఆలయాలకు చెందిన వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మాబాద్‌లోని శ్రీరంగనాథ ఆలయానికి చెందిన భూములను కాసులపల్లిలో కొందరు రాజకీయ కబ్జా చేసి దొంగ పట్టాలతో సాగు చేస్తున్నారు. దీనిపై దేవాదాయ శాఖ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టులో కేసు కొనసాగుతున్నా అక్రమార్కులు యథేచ్ఛగా పంటలు పండిస్తున్నారు. 


పూర్తి స్థాయి సర్వే నిర్వహిస్తాం

-చంద్రశేఖర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌

కోర్టు కేసులున్న భూములు మినహా మిగిలిన ఆలయ మాన్యాలకు సంబంధించి సర్వేలు నిర్వహిస్తాం. కబ్జాలు తొలగించిన అనంతరం రికార్డుల్లో తనిఖీ చేసి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తాం. ఆలయ భూములను సమగ్రంగా గుర్తించిన తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని