logo

సిబ్బంది కొరత.. శిథిల భవనం

గంగాధరలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమస్యలు వేధిస్తున్నాయి. సరిపడా సిబ్బంది లేక.. శిథిల భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కనీస వసతులు లేక కార్యాలయానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 17 Jun 2024 03:31 IST

గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమస్యల తిష్ఠ
న్యూస్‌టుడే, గంగాధర

గంగాధరలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమస్యలు వేధిస్తున్నాయి. సరిపడా సిబ్బంది లేక.. శిథిల భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కనీస వసతులు లేక కార్యాలయానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి మండలాల్లోని ఆయా రెవెన్యూ గ్రామాలతోపాటు కొత్తపల్లి, చొప్పదండి పురపాలికల పరిధిలోని వాణిజ్య (కమర్షియల్‌) భూముల క్రయవిక్రయాలతో గంగాధరలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కిక్కిరిసిపోతుంది. రోజువారీగా రూ.లక్షల్లో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న ఈ కార్యాలయంపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

గంటల తరబడి నిరీక్షణ

కొత్తపల్లి, రేకుర్తి, సీతారాంపూర్, ఇతర ప్రాంతాలకు సంబంధించి ప్రతిరోజు సాధారణంగా 30 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేక ఒక్కో డాక్యుమెంట్‌ పూర్తవడానికి కనీసం గంటన్నర సమయం పడుతోంది. కార్యాలయానికి వచ్చినవారు గంటల తరబడి చెట్ల కింద, పక్కనున్న ప్రభుత్వ కార్యాలయాల్లోని వరండాల్లో నిరీక్షిస్తున్నారు. కేవలం ఇద్దరు జూనియర్‌ సహాయకులు, అటెండర్, ఎస్సార్వో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పని చేసిన శ్రీధర్‌ ఇటీవల అనిశా అధికారులకు చిక్కగా మరో జూనియర్‌ అసిస్టెంట్‌ డిప్యుటేషన్‌ రద్దు చేసుకుని వెళ్లిపోయారు. కాంట్రాక్టు ఉద్యోగి అనారోగ్యంతో సెలవుపై వెళ్లగా పని భారమంతా అటెండర్‌పైనే పడుతోంది. కనీసం ఆరుగురు సిబ్బంది పని చేయాల్సిన చోట ఇద్దరితో వెళ్లదీస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఫొటోలు తీయడం, చెక్‌స్లిప్‌ రాయడం, ఎండార్స్‌మెంట్‌ ప్రింట్‌ తీయడం, రెగ్యులర్‌ నంబర్‌ వేయడం, ధ్రువీకరణ పత్రాలు స్కాన్‌ చేయడం, మ్యుటేషన్‌ ఆన్‌లైన్‌ చేయడం వంటి పనులకు ఇబ్బందిగా మారింది. వీటికి తోడు స్టాంపులు అమ్మాల్సి ఉంటుంది. 


సొంత భవనం లేక.. అవస్థలు తప్పక

రూ.లక్షల్లో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న ఆ కార్యాలయానికి దశాబ్దాలుగా సొంత భవనం లేదు. ప్రభుత్వ భవనం (క్వార్టర్‌)లో అరకొర వసతుల మధ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో గోడలు తడిసి రికార్డులు ముద్దవుతుండగా స్లాబ్‌ పెచ్చులూడటంతో అధికారులు, సిబ్బంది, వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు మండలాలు, 62 రెవెన్యూ గ్రామాలు, రెండు పురపాలికల పరిధిలో వాణిజ్య భూములకు సంబంధించి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు గంగాధరలోనే జరుగుతాయి. రోజుకు దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. వేసవిలో ఉక్కపోత, వర్షాకాలంలో భవనం స్లాబ్‌ ఉరుస్తుండటంతో రికార్డులు తడిసి ముద్దవుతున్నాయని కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు. ఇక మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక.. వచ్చేవారు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి.


పని చేయని యంత్రం...

బ్యాంకులో వ్యవసాయ, గృహ, ఏదైనా తాకట్టు ఉంచి రుణం పొందే సమయంలో స్టాంపులు వేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కేటాయించిన ప్రాంక్లింగ్‌ మిషన్‌ మూడు నెలలుగా నిరుపయోగంగా ఉంది. కరీంనగర్‌లోని ప్రైవేటు వ్యక్తి లేదా జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఇదే అదనుగా ప్రైవేటు వ్యక్తి స్టాంపుల కోసం అదనంగా వసూలు చేస్తున్నారు. యంత్రం కేటాయించిన ప్రభుత్వం దానికి సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా ఉన్నట్లు తెలుస్తోంది. మండల కేంద్రంలోనే 8 గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించి ఏళ్లు గడిచినా భవనం నిర్మించడం లేదు. గతంలోనే రూ.63 లక్షల నిధులు కూడా మంజూరు చేశారు. రీ మోడలింగు పేరుతో ప్రభుత్వం నిధులు వెనక్కి తీసుకుంది. నూతన భవన నిర్మాణం, సిబ్బంది కొరతపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సబ్‌ రిజిస్ట్రార్‌ పద్మ వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని