logo

ఆడపిల్లలపై వీడని వివక్ష

జిల్లాలో బాలికల సంఖ్య తగ్గుతోంది. ఆడపిల్ల అంటేనే కొందరు తల్లిదండ్రులు నిరాసక్తత చూపడంతో వారి సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది.

Published : 17 Jun 2024 03:36 IST

రోజురోజుకు తగ్గుతున్న సంఖ్య
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

జిల్లాలో బాలికల సంఖ్య తగ్గుతోంది. ఆడపిల్ల అంటేనే కొందరు తల్లిదండ్రులు నిరాసక్తత చూపడంతో వారి సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సేకరించిన లెక్కల ప్రకారం బాలబాలికల నిష్పత్తి సమానంగా లేదని స్పష్టమైంది. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మున్ముందు సమస్యలు తప్పవు.

అన్నింటా ముందున్నా....

పరిపాలన వ్యవస్థ మొదలుకొని అధికార యంత్రాంగంలో సైతం పురుషులతో సమానంగా తమదైన ముద్ర వేసుకుంటున్నారు మహిళలు. ప్రభుత్వం కూడా విద్యాపరంగా, సంక్షేమ పథకాలలో తగిన ప్రాధాన్యమిస్తోంది. అన్ని రంగాల్లో వారు రాణిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సైతం అనేక కార్యక్రమాలు మహిళా సంఘాలకే అప్పగిస్తోంది.

చాటుగా పరీక్షలు...

ఇంత జరుగుతున్నా కొందరు విద్యావంతులు మొదటి కాన్పు, రెండో కాన్పు అని చూడకుండా చాటుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడపిల్ల అని తెలిస్తే వేలు వెచ్చించి ఆబార్షన్‌ చేయిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో కొందరు అత్తింటి వారు హేళనగా చూడటం, బయటకు పంపిస్తున్న ఘటనలూ ఉన్నాయి. గర్భం దాల్చగానే పుట్టబోయేది ఎవరు అనేది లింగనిర్ధారణ చేయడం  నేరమని ప్రభుత్వం చట్టం రూపొందించినా జిల్లాలో కొందరు రహస్యంగా స్కానింగ్‌లు చేయిస్తున్నారు. ఇందుకు అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ కొందరు వైద్యులు అనుమతించకపోవడంతో పక్కన ఉన్న వరంగల్, తదితర జిల్లాలకు వెళ్లి వేల రూపాయలు కుమ్మరించి లింగ నిర్ధారణ చేయించి ఆడపిల్ల అని తెలియగానే చిదిమేస్తున్నారు. 

మొక్కుబడిగా తనిఖీలు..

జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మొక్కుబడిగా తనిఖీలు చేస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప యంత్రాంగం కదలడం లేదు. కదిలినా తూతూమంత్రంగా వ్యవహరిస్తోందని ఆరోపణలున్నాయి. లింగ నిర్ధారణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన గల కమిటీ నిర్ణయించినా ఆశించిన మేర ఫలితం లేదు.


కేసులు నమోదు చేస్తాం

- డాక్టర్‌ సుజాత, డీఎంహెచ్‌వో 

జిల్లాలో బాలికల నిష్పత్తి తగ్గుతున్న మాట వాస్తవమే. మేము స్కానింగ్‌ కేంద్రాలపై తనిఖీలు చేస్తున్నాం. ఎప్పటికపుపడు వివరాలు సమర్పించాలని ఆదేశించాం. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని