logo

బల్దియా అక్రమాలపై నజర్

కరీంనగర్‌ నగరపాలక సంస్థ కార్యకలాపాలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల అభివృద్ధి పనులు, పట్టణ ప్రణాళికపై వరుస ఫిర్యాదులు వస్తుండటంతో ఆ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు.

Published : 17 Jun 2024 03:38 IST

18న రాష్ట్ర మంత్రి పొన్నం సమీక్ష?
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

రీంనగర్‌ నగరపాలక సంస్థ కార్యకలాపాలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల అభివృద్ధి పనులు, పట్టణ ప్రణాళికపై వరుస ఫిర్యాదులు వస్తుండటంతో ఆ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు.  అధికారుల పనితీరు, పాలన వ్యవహారాలు, పురపాలికల్లో ఏం జరుగుతుందనే విషయాలపై తెలుసుకునే విధంగా సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 18న కరీంనగర్‌లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగానికి ప్రాథమిక సమాచారం అందింది. ఆ రోజు నిర్వహిస్తారా? లేదా అనేదీ మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

అభివృద్ధి పనులపైనే దృష్టి

నగరాభివృద్ధిలో భాగంగా స్మార్ట్‌సిటీ, సీఎంఏ, సాధారణ నిధులు వంటి పనులు చేపట్టారు. స్మార్ట్‌సిటీలో రహదారులు, మురుగుకాలువలు, ఫుట్‌పాత్‌ టైల్స్‌ తదితర పనులు పూర్తి చేశారు. పలు డివిజన్లలో ఈ పనులు అసంపూర్తిగా ఉండటం, టవర్‌సర్కిల్‌లో పనులు పూర్తయినా మళ్లీ తవ్వి పనులు చేస్తుండటం, నడకదారి టైల్స్‌ ఊడిపోతుండటం, కూడళ్ల సుందరీకరణ, సమీకృత మార్కెట్ల నిర్మాణాలపై అంచనాలు భారీగా పెంచారనే విషయాలపై ఇప్పటికే విజిలెన్స్‌తోపాటు పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై విచారణ కూడా జరుగుతోంది. అదేవిధంగా పట్టణ ప్రణాళిక విభాగంలో పదేళ్లుగా అక్రమ నిర్మాణాలు, అదనపు అంతస్తులపై సీఎంవో కార్యాలయం నుంచి ఫిర్యాదు రాగా వాటిపై కూడా విచారణ జరిపించి నివేదిక అందించేందుకు చర్యలు చేపట్టారు.

తొమ్మిది అంశాలపై నివేదిక తయారు

కరీంనగర్‌లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు.  మొత్తం తొమ్మిది అంశాలపై ఎజెండా తయారు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మానేరు రివర్‌ ఫ్రంట్, సీఎంఏ ప్లాన్‌ గ్రాంట్స్, స్మార్ట్‌సిటీ, జనరల్‌ ఫండ్‌ వర్క్స్, మెప్మా, 24 గంటల తాగునీటి సరఫరా, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ ఇంప్రూవ్‌మెంట్, ఇంజినీరింగ్‌ పనులతోపాటు ఇతర అంశాలపై చర్చించనున్నారని ఆయా విభాగాల అధికారులకు సమాచారం అందించారు. నగరపాలికలో అధికారులు సెలవులో వెళ్లడం, బదిలీకి ప్రయత్నాలు చేసుకోవడంపై ఆరా తీస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నగరంలో ఇప్పటికే జరిగిన అభివృద్ధి పనుల నాణ్యతపై తనిఖీ చేసే అవకాశమున్నట్లు తెలిసింది. మొత్తానికి కొత్త ప్రభుత్వంలో మొదటిసారి సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశానికి ప్రజాప్రతినిధులు ఎవరెవరు హాజరవుతారనే విషయంపై చర్చ జరుగుతుండటం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని