logo

డీసీసీబీ ఏర్పాటులో జాప్యం

కరీంనగర్‌లో ఉమ్మడి జిల్లా కేంద్రంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) సేవలను కొత్త జిల్లాలకు విస్తరించేలా రెండేళ్ల కిందట ఏర్పాటుచేయ తలపెట్టిన ప్రాంతీయ కార్యాలయాలను కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా నెలకొల్పాల్సి ఉంది.

Published : 18 Jun 2024 06:05 IST

జగిత్యాలలోని కేడీసీసీబీ పరిధి ప్యాక్స్‌ బ్యాంకు   

న్యూస్‌టుడే, జగిత్యాల వాణిజ్యం: కరీంనగర్‌లో ఉమ్మడి జిల్లా కేంద్రంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) సేవలను కొత్త జిల్లాలకు విస్తరించేలా రెండేళ్ల కిందట ఏర్పాటుచేయ తలపెట్టిన ప్రాంతీయ కార్యాలయాలను కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా నెలకొల్పాల్సి ఉంది. ముందుగా ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటుచేసి తర్వాత కొత్త జిల్లాలవారీగా డీసీసీబీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు జిల్లా నుంచి కొందరు ప్యాక్స్‌ల అధ్యక్షులకు కరీంనగర్‌ డీసీసీబీలో సభ్యులుగా అవకాశం ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 15 బ్యాంకు శాఖలు పనిచేస్తుండగా జగిత్యాలలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి రైతులు, సహకార సంఘాలకు సేవలను మరింతగా దరిచేర్చాలన్న నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తేవాలి. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేసిన అనంతరం కొన్ని మాసాల్లో ప్యాక్స్‌లకు ఎన్నికలు జరిగిన అనంతరం డీసీసీబీలను కొత్త జిల్లాల వారీగా ఏర్పాటు చేసినట్లయితే జిల్లాకు చెందిన ప్యాక్స్‌ల అధ్యక్షులతోనే డీసీసీబీ కార్యవర్గం ఏర్పాటవుతుంది. ప్రస్తుతం కరీంనగర్‌ డీసీసీబీ పరిధిలో జగిత్యాలలో బ్యాంకు ఉండగా దాని ఆవరణలోనే పాత భవనం కూడా ఉంది. ప్రస్తుతం డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటుచేసే వీలుంది, తదుపరి డీసీసీబీ ఏర్పాటుకు కూడా అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం రైతులకు పంట రుణాలు, టర్ము రుణాలు, దీర్ఘకాలిక, వ్యాపార రుణాలను ఇస్తుండగా చాలావాటికి కరీంనగర్‌లోని కేంద్ర కార్యాలయం నుంచి అనుమతి పొందాల్సివచ్చేది. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుతో సేవలన్నీ ఇక్కడే లభిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం అయిదేళ్లలో 2 లక్షల నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామానికో ప్యాక్స్‌ ఉండాలని తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలోనూ ప్యాక్స్‌ల సంఖ్య పెరగనుంది. ప్యాక్స్‌ల ద్వారా 25 రకాల సేవలను అందించాలని కేంద్రం నిర్ణయించింది. జిల్లాలో ఇప్పటికే 51 ప్యాక్స్‌లుండగా 385 గ్రామపంచాయతీల్లో కనీసం మరో 50 గ్రామాల్లో నూతనంగా ప్యాక్స్‌లను ఏర్పాటుచేసే వీలుండటం కర్షకులకు కలిసిరానుంది. డీసీసీబీ పరిధిలో ఖాతాదారులు, సేవలు పెరిగినట్లయితే నాబార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు కూడా రైతులు, సహకార సంఘాలకు సుళువుగా అందుతాయి. అన్నిసంఘాల పరిధిలో ధాన్యం, మక్కలను కొనుగోలు చేస్తుండగా జగిత్యాల, రాయికల్‌ తదితర సంఘాలు కేంద్ర ఎరువుల సంస్థ క్రిభ్‌కోలో రూ.50 లక్షల చొప్పున వాటాధనం చెల్లించి సాలీనా రూ.10 లక్షల డెవిడెండ్‌ను పొందుతున్నాయి. చాలాసంఘాలు రుణాల మంజూరీ, బ్యాంకింగ్‌ కౌంటర్లు, లాకర్లు, పెట్రోలు పంపులను నిర్వహిస్తుండగా విత్తనశుద్ధి ప్లాంట్లు, రైస్‌మిల్లుల ఏర్పాటుకు కృషి చేస్తున్నాయి. నాబార్డు ద్వారా పలుసంఘాలకు రూ.20 లక్షల చొప్పున నిధులను అందించగా గోదాములను నిర్మించారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, ప్యాక్స్‌ కేంద్రాల సంఖ్యపెంపు, రైతులందరినీ సభ్యులుగా చేర్పించటం దీర్ఘకాలికంగా ఉపయుక్తంగా ఉండనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని