logo

అటవీ అనుమతులపైనే ఆశలు

బీర్‌పూర్‌ రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు అంచనా విలువ రెట్టింపు అయినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో నీటి నిలువ ప్రశ్నార్థకంగా మారింది.

Published : 18 Jun 2024 06:08 IST

పూర్తికాని రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ 

ప్రాజెక్టులో అసంపూర్తిగా తూము పనులు 
న్యూస్‌టుడే, సారంగాపూర్‌: బీర్‌పూర్‌ రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు అంచనా విలువ రెట్టింపు అయినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో నీటి నిలువ ప్రశ్నార్థకంగా మారింది. బీర్‌ఫూర్, ధర్మపురి మండలాల చివరి ఆయకట్టు వరకు నీరందించాలన్న ఉద్దేశంతో రోళ్లవాగు ప్రాజెక్టు అధునికీకరణ పనులు 2016లో రూ.60 కోట్లతో టెండర్‌ ప్రక్రియ ప్రారంభమవ్వగా 2017లో ప్రారంభించారు. ఈ ఏడాది జూన్‌ వరకు పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీరందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించినప్పటికీ అటవీ శాఖ అభ్యంతరంతో ఇప్పటికీ తూములకు షట్టర్లు బిగించకపోవడంతో వరద నీరు బయటకు వెళ్లిపోనుంది. దీనికి తోడు గుత్తేదారు గడువు ఈ నెల చివరి వరకు మాత్రమే ఉండడంతో పనులు నిలిచిపోయే అవకాశముంది. ఇప్పటికే నాలుగు మార్లు గడువు పొడిగిస్తూ పనులు అప్పగిస్తుండగా మరోసారి గడువు పెంచితేనే పనులు చేపట్టే అవకాశముంది. ప్రస్తుతం వర్షాలు ప్రారంభం కావడంతో పనులు నిలిచిపోయి అక్టోబరు వరకు ప్రారంభించే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెట్టింపైన అంచనా విలువ

ప్రాజెక్టు ఆధునికీకరణ చేపట్టే సమయంలో 0.25 టీఎంసీ నుంచి ఒక టీఎంసీ నీటిని నిలువ చేసేందుకు రూ.60 కోట్లతో ప్రారంభమైన పనులు ప్రస్తుతం రూ.153 కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ అటవీ అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టు మూడు తూములకు షట్టర్ల బిగించకపోవడంతో గతేడాది నుంచి వచ్చిన వరద నీరు వచ్చినట్లు వెళ్లిపోతోంది. దీంతో నీటి నిలువ సామర్థ్యం లేకపోవడమే కాకుండా ప్రాజెక్టు ఎగువన ఉన్న బుగ్గ చెరువు ప్రాంత రైతులకు నీరు వెళ్లడం కష్టంగా మారింది. గతేడాది తూములో బండరాళ్లు అడ్డుగా వేసి నీటిని అందించారు. గతంలో ప్రాజెక్టు నిలువ సామర్థ్యం 0.25 టీఎంసీ ఉన్నందున ఆ మేరకు నీటిని నింపుకునే అవకాశముందని దీని ఆధారంగా షట్టర్లు బిగిస్తారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంబంధిత అటవీ అధికారులకు వివరించారు. దీనికి అభ్యంతరం లేకపోవడంతో షట్టర్లు బిగించాల్సి ఉన్నప్పటికీ గుత్తేదారు పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం వర్షాలు ప్రారంభం కావడంతో మళ్లీ షట్టర్లు బిగించడం ఇబ్బందిగా మారనుంది.  

భూముల అప్పగింతలో జాప్యం 

ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న 864 ఎకరాల అటవీ భూమికి బదులుగా ఇతర ప్రాంతాల్లో రెవెన్యూ భూములను అప్పగించాల్సి ఉంది. రెవెన్యూ అధికారులు భూములను అప్పగించడంలో జాప్యం చేయడంతో అటవీ అధికారులు తరచూ పనులను అడ్డుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని పెగడపల్లి, నంచర్ల, ల్యాగలమర్రి తదితర ప్రాంతాల్లో రెవెన్యూ భూములు పరిశీలించినప్పటికీ స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. రెవెన్యూ శాఖ భూములు అప్పగించడం త్వరతగతిన పూర్తి చేసినప్పుడే ప్రాజెక్టులో టీఎంసీ సామర్థ్యం నిలువ చేసే అవకాశముంటుంది.  


 షట్టర్లు బిగించేలా చర్యలు
- చక్రునాయక్, ప్రాజెక్టు డీఈఈ

ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కేవలం ప్రాజెక్టు మూడు తూములకు షట్టర్లు బిగించాల్సి ఉంది. ఇందుకు పనులు పూర్తి చేసేలా గుత్తేదారుపై ఒత్తిడి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ శాఖ అనుమతి రాకపోవడంతో 0.25 సామర్థ్యం మేరకు నీటిని నిలువ చేసుకునేలా చూస్తున్నాం. అటవీ శాఖ అనుమతి రాగానే టీఎంసీ నిలువ చేసేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు