logo

దోమలను ఎదుర్కొనేందుకు సిద్ధమేనా?

‘ఖాళీ ప్లాట్లలోని చెత్త నిల్వలను యజమానులు తొలగించాలి. లేదంటే బల్దియా ఆ పని చేస్తుందని, యజమానులు ఖర్చును భరించాల్సి ఉంటుంది.’

Published : 18 Jun 2024 06:15 IST

 ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం
వర్షాలు పడితే మురుగునీటి నిల్వ


‘ఖాళీ ప్లాట్లలోని చెత్త నిల్వలను యజమానులు తొలగించాలి. లేదంటే బల్దియా ఆ పని చేస్తుందని, యజమానులు ఖర్చును భరించాల్సి ఉంటుంది.’
- ఇటీవల జీహెచ్‌ఎంసీ నిర్వహించిన సమీక్షలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్న మాటలివి.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌: జిల్లాలోనూ ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు చెత్తాచెదారంతో అధ్వానంగా తయారయ్యాయి. ఒక్క వర్షం పడితే చాలు అవి కుంటలుగా మారుతాయి. మురుగునీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారే ప్రమాదం ఏర్పడనుంది.  వ్యాధులు ముసురుకునే అవకాశం ఉండగా ఆ స్థల యజమానులు మాత్రం పట్టనట్లుగా ఉంటున్నారు. పురపాలికలు, నగరపాలికలు మాత్రం ఫిర్యాదులు వచ్చిన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నారు. అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలపై ‘న్యూస్‌టుడే’ కథనం..
జిల్లాలోని కరీంనగర్‌ నగరపాలక సంస్థతోపాటు జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి పురపాలికల పరిధిలో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇప్పటికే చెత్తా చెదారంతో నిండి పోగా వాటిని ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాల్సిన యజమానులు పట్టించుకోవడం లేదు. పైగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చి బల్దియా కార్మికులతో చెత్తను  శుభ్రం చేయిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు సైతం రాజకీయ ఒత్తిళ్లతో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

ఆదర్శనగర్‌లో చెత్తా చెదారంతో నిండిన ఖాళీ స్థలం 

నగరంలో మూడు వేలకు పైగా..

నగరంలో మూడు వేలకు పైగా ఖాళీ స్థలాలు ఉండగా అవన్నీ దుర్గంధభరితంగా ఉన్నాయి. అలకాపురికాలనీ, ఆదర్శనగర్, సుభాష్‌నగర్, కిసాన్‌నగర్, హౌసింగ్‌బోర్డుకాలనీ, ఖాన్‌పుర, దుర్గమ్మగడ్డ, హుస్సేనీపుర, అశోక్‌నగర్, లక్ష్మీనగర్, గాయత్రీనగర్, పోచమ్మవాడ, వావిలాలపల్లి, బ్యాంకుకాలనీ, కుర్మవాడ, సంతోష్‌నగర్, భగత్‌నగర్, కట్టరాంపూర్, కోతిరాంపూర్, గణేశ్‌నగర్‌ బైపాసు, తిరుమల్‌నగర్, విద్యానగర్, రాంనగర్, సప్తగిరికాలనీ, కొత్తయాస్వాడ, రేకుర్తి, హనుమాన్‌నగర్, రాంచంద్రాపూర్, వాసుదేవకాలనీ, టీఎన్‌జీవోఎస్‌ కాలనీ, అగ్రికల్చర్‌ కాలనీ, ఆర్టీసీ వర్క్‌షాప్‌ ప్రాంతాల్లో వర్షాలకు నీరు నిలుస్తోంది. చిన్నపాటి చెరువులను తలపిస్తాయి.

హెచ్చరిక బోర్డులకే పరిమితం..

 ః ఖాళీ స్థలాలు శుభ్రం చేసుకోవాలని ఆయా  స్థలాల ఎదుట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా స్థల యజమానులు  మాత్రం పట్టించుకోవడం లేదు. వారం రోజుల్లో శుభ్రం చేసి తెలపాలని, లేదంటే రూ.10 వేల జరిమానా వేస్తామని గతంలో బోర్డులు పాతినా పెడచెవిన పెట్టారు. ఇప్పటి వరకు నగరపాలక సంస్థ నయాపైసా జరిమానా విధించకపోవడంతో, స్థల యజమానులు కూడా పట్టింపులేని ధోరణిలో ఉన్నారు.

  • తెలంగాణ పురపాలిక చట్టం-2019 సెక్షన్‌ 161(1)ప్రకారం చర్యలు తీసుకునే వీలున్నా అధికారులు కదలడం లేదు. ఈ స్థలాలు విక్రయిస్తే రెట్టింపు లాభం వస్తుండగా కనీసం శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన మాత్రం చేయడం లేదు. 
  • హైదరాబాద్‌ తరహాలో ఇక్కడ కూడా మంత్రి హెచ్చరిస్తే తప్ప అవి శుభ్రం చేసుకునేలా కనిపించడం లేదు. పైగా వర్షాలకు నీరు నిల్వ ఉండటంతో డెంగీ, మలేరియా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.
  • పురపాలికలు, నగరపాలికలు, గ్రామ పంచాయతీల్లో సీజన్‌ ప్రారంభంలో బ్లీచింగ్‌ చల్లి చేతులు దులుపుకొంటారు. నీరు నిల్వ ఉన్న చోట వైద్యారోగ్య శాఖ సరఫరా చేసి గంబూసియా చేపలు వదులుతారు.
  • ఫాగింగ్‌ యంత్రాలు ఉన్నా ఒక్కో కాలనీకి 15 రోజులకు ఒకసారి మాత్రమే వస్తాయి.

మార్పు వస్తేనే..

దోమల కారణంగా పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు జ్వరాల బారినపడతారు. ఒక్కోసారి ఇంటిల్లిపాదీ జ్వరబాధితులుగా ఉంటుంటారు. ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం, మురుగుకుంటలు, వర్షంనీరు నిల్వ ఉండటం.. ఇవన్నీ దోమల ఆవాసాలు.. ఎవరి ఇళ్లు వారే అని కాకుండా.. కాలనీవాసులు సమష్టి నిర్ణయం తీసుకొని ఖాళీ స్థలాలు శుభ్రం చేయిస్తే.. వాటి పెరుగుదల తగ్గుతుంది. అందరిలో చైతన్యం వస్తేనే వాటి నివారణ సాధ్యమవుతుంది. 


నోటీసులు జారీ చేస్తాం

ఖాళీ స్థలాలు అపరిశుభ్రంగా ఉన్నట్లయితే గుర్తించి నోటీసులు జారీ చేసేలా ఆదేశాలిస్తాం. స్థల యజమానులు వాటిని  శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షం నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- బి.శ్రీనివాస్, కమిషనర్, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని