logo

రాలని చినుకు.. సాగని ఎవుసం

వానాకాలం సీజను జూన్‌ 1 నుంచి మొదలైనా ఉమ్మడి జిల్లాలో వర్షాభావంతో సాగుపనులు ఇప్పటికీ ఆశించినట్లుగా ముందుకుసాగక కర్షకులు కలవరపడుతున్నారు

Published : 18 Jun 2024 06:17 IST

దుక్కిదున్నుతున్న రైతు 

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు  : వానాకాలం సీజను జూన్‌ 1 నుంచి మొదలైనా ఉమ్మడి జిల్లాలో వర్షాభావంతో సాగుపనులు ఇప్పటికీ ఆశించినట్లుగా ముందుకుసాగక కర్షకులు కలవరపడుతున్నారు. ఈ సీజన్‌లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ శాస్త్రవేత్తలు అంచనా వేసినా కురవాల్సిన వర్షపాతం కన్నా కరీంనగర్‌ జిల్లాలో 40, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 39, జగిత్యాల జిల్లాలో 35, పెద్దపల్లి జిల్లాలో 48 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలోని 7 శాతం మండలాలు మినహా 93 శాతం మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. గత యాసంగిలో ఆయకట్టుకు ముందుగానే ప్రాజెక్టుల నీటిని నిలిపివేయటం, ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి ఎత్తిపోతలు లేకపోవటం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భూగర్భ జలమట్టం సగటున 4.9 మీటర్లనుంచి 13.2 మీటర్లవరకు పడిపోయి మరోవైపు పంటలసాగుకు ప్రతిబంధకంగా మారింది.
రైతులు ఏప్రిల్, మే మాసాల్లోనే దుక్కులు చేసుకుని ఎరువులు, పూడికమట్టి పొలాల్లోకి తొలుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో జూన్‌ మొదటి వారం నుంచే పసుపు, మక్కలను విత్తుకోవటం, పత్తివిత్తనాలు నాటడం, జనుము, జీలుగ, పెసర, సోయాబీన్‌ వంటి పంటల విత్తనాలను విత్తుకోవటాన్ని రైతులు ఆరంభించినా వర్షాల్లేక వేసిన విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేకపోవటం, ఎండల తీవ్రత మళ్లీ పెరగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బావులు, బోర్లలో నీటిలభ్యత ఉన్న రైతులు వరినార్లను పోస్తుండగా మరో పక్షం రోజులు వర్షంలేకుంటే ప్రధానపొలాన్ని దున్నటం కష్టసాధ్యమని పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం వరి ప్రధాన పంటకాగా స్వర్ణవంటి దీర్ఘకాలిక రకాల వరినార్లకు అదను దాటనుంది. ఉమ్మడి జిల్లాలో అన్నిపంటలసాగు 12 లక్షల ఎకరాలు దాటనుందని అంచనా వేయగా ఇందులో వరి, పత్తి, మక్క, పసుపు ప్రధాన పంటలుగా ఉండనున్నాయి. ఇప్పటివరకు భారీవర్షం నమోదుగాకపోవటంతో భూగర్భ జలమట్టం పెరగకపోగా నేలలోని వేడిమి తగ్గక విత్తనాల మొలకశాతం గణనీయంగా తగ్గనుంది. నాలుగు జిల్లాల్లో ఇప్పటివరకు సాగు విస్తీర్ణం కనీసం 7 శాతానికి కూడా చేరలేకపోవటం ప్రతికూలతను వెల్లడిస్తుండగా ముసురువర్షం కురిస్తేనే వాతావరణం చల్లబడి, భూగర్భ జలమట్టం పెరిగి పైర్లసాగుకు దోహదపడనుంది. మరోవైపు శ్రీరాంసాగర్, మధ్యమానేరు, దిగువమానేరు, ఎల్లంపల్లి తదితర అన్నిప్రాజెక్టుల్లోనూ నీటినిల్వలు కనిష్ఠస్థాయికి చేరి వరద రాకుంటే పంటలకు ఏమాత్రం విడుదల చేయలేని పరిస్థితిలో వరుణుడి కరుణపైనే పైర్లసాగు విస్తీర్ణం ఆధారపడి ఉంది.


70-80 మిల్లీమీటర్లు కురిస్తేనే..
- డాక్టర్‌ జి.శ్రీనివాస్, సహ పరిశోధన సంచాలకులు, పొలాస పరిశోధనస్థానం

పంటల అదను దాటలేదు కాబట్టి రైతులు ఆందోళన చెందవద్దు. తడిపొడి దుక్కులో విత్తనాలువేసి నష్టపోవద్దు. ఆరుతడి పంటలను కనీసం 70-80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదై వాతావరణం చల్లబడిన తరువాతనే విత్తుకోవాలి. సోయాబీన్, మక్క, పసుపు, పత్తి, కంది, పెసర, మినుమువంటివాటిని పంటల రకాలు, కాలపరిమితిని బట్టి జులై నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. నీటివసతిగల రైతులు వరినార్లు ప్రస్తుతం పోసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని