logo

ఉద్యోగ సాధనకు వారధి!

కరీంనగర్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవాలనే సంకల్పంతో వచ్చే వారికి జిల్లా యంత్రాంగం వెన్నుదన్నుగా నిలుస్తోంది.

Published : 18 Jun 2024 06:26 IST

నిరుద్యోగులకు అండగా కరీంనగర్‌ జిల్లా గ్రంథాలయం 

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతులు 

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం: కరీంనగర్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవాలనే సంకల్పంతో వచ్చే వారికి జిల్లా యంత్రాంగం వెన్నుదన్నుగా నిలుస్తోంది. నిత్యం వందలాది మంది ఇక్కడే చదువుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో చదువుతూ లక్ష్యం దిశగా అడుగులేస్తున్నారు. పక్కనే పోలీసుస్టేషన్‌ ఉండటంతో అమ్మాయిలు కూడా అర్ధరాత్రి వరకు చదువుకుంటున్నారు. ఇక్కడే చదివి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు పొంది, ఉద్యోగాలు సాధించి, ఇంకా ఉన్నత స్థాయి జాబ్‌ సాధిస్తామని భరోసాతో ఉన్న వారు మనోభావాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.

24 గంటల సేవలు.. ప్రత్యేకం..

తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా 24 గంటలపాటు చదువుకునే సదుపాయమున్న ఏకైక గ్రంథాలయమిది. ఏ సమయంలోనైనా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. రూ.150 చెల్లించి కార్డు తీసుకుంటే ఏ పుస్తకమైనా తీసుకోవచ్చు. కంప్యూటర్‌ ల్యాబ్‌ ఉండటంతో అవసరమైన సమాచారం గూగుల్‌లో పొందవచ్చు. దీని పక్కనే రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ ఉండటం.. ఆవరణ చుట్టూ సీసీ కెమెరాలు, తాగడానికి శుద్ధిజలం, ఏసీ గదులు, కూలర్లు, మధ్యాహ్నం ఉచిత భోజనం సదుపాయాలున్నాయి. గదుల్లో ఆరేడు వందల మంది ఉన్నా ఎవరికి వారే నిశబ్దంగా చదువుకోవడం.. క్రమశిక్షణ పాటించడం.. లక్ష్యం సాధన కోసమే అన్నట్లు ఉంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ గ్రంథాలయం సహకారంతో జిల్లాలో ఎంతోమంది ఎస్సై, కానిస్టేబుళ్లు, జూనియర్‌ లెక్చరర్, టీజీటీ, పీజీటీ  ఉద్యోగాలు సాధించారు. ఇటీవల విడుదలైన గ్రూప్‌-4 ఫలితాల్లో 15 మంది అర్హత సాధించారు. జిల్లా పాలనాధికారులు, అదనపు పాలనాధికారులు, వారధి సొసైటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్‌ వారి సహకారంతో మాక్‌ టెస్ట్‌లు నిర్వహించారు.

 కానిస్టేబుల్, గ్రూప్‌-4 సాధించా..

2022 డిసెంబరులో ఎస్సై నోటిఫికేషన్‌ వచ్చింది. 2023 ఏప్రిల్‌లో ఇక్కడకు చదువుకునేందుకు వచ్చా. కార్డు తీసుకొని కావాల్సిన పుస్తకం తీసుకొని చదివా. నలుగురం కలిసి ఒక గది అద్దెకు తీసుకున్నాం. ఉదయం 6 గంటలకే ఇక్కడకు వచ్చేవాళ్లం. 8 గంటల నుంచి 9 గంటల మధ్య గదికి వెళ్లి స్నానం, టిఫిన్‌ చేసి వచ్చేవాళ్లం. ఒంటి గంట వరకు ఇక్కడే చదివేవాళ్లం. మధ్యాహ్నం ఉచిత భోజనమున్నా.. కొన్ని సార్లు గదికి వెళ్లి కలిసి వండుకునేవాళ్లం. మధ్యాహ్నం 3 గంటలకు అర్ధరాత్రి తర్వాత ఒంటిగంట వరకు ఇక్కడే ఉండి చదువుకునే వాళ్లం. ప్రజ్ఞా సంస్థ సహకారంతో అధికారులు నిర్వహించిన ఎస్సై మెయిన్స్‌ మాక్‌ టెస్ట్‌లు చాలా ఉపయోగపడ్డాయి. ఈ పరీక్షలు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గ్రంథాలయ అధికారులు సైతం ఏదైన పుస్తకం కావాలంటే వెంటనే తెప్పించేవాళ్లు. కానిస్టేబుల్‌కు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్నా. గ్రూప్‌-4 కూడా వచ్చింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అయ్యింది.

- మహమ్మద్‌ అజీజ్, వెలిచాల, రామడుగు


 నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యా.. 

24 గంటలపాటు గ్రంథాలయం తెరిచి ఉండటంతో మా లాంటి నిరుద్యోగులకు లాభం జరిగింది. ఏదైన పుస్తకం లేకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఒకటి రెండ్రోజుల్లోనే తెప్పించేవాళ్లు. మన ఇళ్లల్లో కూడా ఇలాంటి వసతులు ఉండవు. ఇక్కడి ప్రశాంత వాతావరణమే ఉద్యోగాలు సాధించేందుకు దోహదపడింది. నేను ఇప్పటి వరకు టీజీటీ, పీజీటీ, గురుకుల జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు సాధించా.. ఇటీవల గ్రూప్‌-4లో కూడా ఎంపికయ్యాను. టీజీపీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టు పరీక్ష రాశాను. త్వరలో ఫలితాలు వస్తాయని ఎదురుచూస్తున్నా. అది కూడా వస్తుందని భావిస్తున్నా. ఆ ఫలితం వచ్చే వరకు ప్రస్తుతం గ్రంథాలయంలో డిగ్రీ లెక్చరర్‌ పరీక్ష కోసం సిద్ధమవుతున్నా. - సోమకూర రాజశేఖర్‌రావు, కరీంనగర్‌

కోచింగ్‌ సెంటర్‌ కంటే బెటర్‌..

మాది మహబూబాబాద్‌ జిల్లా. అక్కడ ఇంత మంచి గ్రంథాలయం లేదు. జీవనోపాధి నిమిత్తం మా అత్తమామలు, తల్లిదండ్రులు ఇక్కడికి వలస వచ్చారు. ఏదైనా ఉద్యోగం సాధించాలని రోజూ ఇక్కడకు వచ్చి చదువుతున్నా. 2021 నుంచి చదువుతున్నా. గ్రూప్‌-4 పరీక్ష కూడా రాశాను. దీని కోసం మూడు నెలలు కోచింగ్‌ వెళ్లినా నచ్చక మళ్లీ గ్రంథాలయంలోనే ఉండి చదువుతున్నా. ఉదయం పిల్లలను చూసుకొని పది గంటలకు ఇక్కడి వచ్చి సాయంత్రం వరకు ఉండేదాన్ని. పరీక్ష మరో నెల ఉందనగా, పిల్లలతో చదువులకు ఆటంకం కల్గకుండా వసతిగృహంలో ఉన్నాను. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారంతో గ్రూప్‌-4 సాధించాను.

- చామంతి


ప్రశాంత వాతావరణం..

గత రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన వేసినప్పటి నుంచి గ్రంథాలయానికి వస్తున్నా. మా సొంతూరు మంచిర్యాల. అత్తమామల ఊరు కరీంనగర్‌ కావడంతో ఈ గ్రంథాలయానికి వస్తున్నా. ప్రశాంత వాతావరణం ఉండటంతో ఎన్ని గంటలు కూర్చున్నా విసుగురావడం లేదు. చదువుకునే వాతావరణం ఉంటుంది. డీఎస్సీకి ఆలస్యమవుతుందని గ్రూప్స్‌కు చదివాను. టెట్‌ 126 మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. డీఎస్సీ పరీక్ష కోసం సిద్ధమవుతున్నా.

- ప్రవళిక, మంచిర్యాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని