logo

పర్యావరణ హితం.. ఆచరిస్తేనే ప్రయోజనం

రోజురోజుకు భూతాపం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

Published : 18 Jun 2024 06:30 IST

పాఠశాలల్లో ఎకో క్లబ్‌ల ఏర్పాటు 

నర్సరీని సందర్శిస్తున్న పాలకుర్తి మండలం కన్నాల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌:  రోజురోజుకు భూతాపం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అక్రమార్కుల గొడ్డలి వేటుకు అడవులు అంతరించిపోతున్నాయి. కొన్నేళ్లుగా హరితహారంలో లక్షలాది మొక్కలు నాటినా సంరక్షణ లేకపోవడంతో పెద్దగా ఫలితం కనిపించడం లేదు. తద్వారా ఉష్ణోగ్రతలు పెరిగి విపత్తులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ కోసం విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ‘పర్యావరణ (ఎకో) క్లబ్‌లను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఈనెల 15 నుంచి 24 వరకు రోజుకో అంశాన్ని పరిశీలించి పిల్లల్లో ఆలోచనలు పెంచాలని భావిస్తున్నారు. అయితే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల హడావుడిలో ఇదీ ఆచరణ సాధ్యం కావడం లేదు. 

ముప్పు తొలగించేందుకు.. 

జిల్లాలో 539 ప్రభుత్వ పాఠశాలలు, 10 కస్తూర్బాలు, 4 మైనార్టీ గురుకులాలు, 1 మినీ గురుకులం, 7 ఆదర్శ పాఠశాలలు, 7 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 48,409 మంది విద్యార్థులున్నారు. ప్రతి పాఠశాలలో ఎకో క్లబ్‌లను ఏర్పాటు చేశారు. వీరి ద్వారా మొక్కలు నాటడం, సంరక్షణ, మొక్కల చుట్టూ చెత్త, ముళ్ల పొదలను తొలగించడం, ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వంటి పనుల్లో భాగస్వాములవుతున్నారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఒక ఉపాధ్యాయుడు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. భావితరాలకు పర్యావరణ ముప్పు నుంచి కాపాడేందుకు పాఠశాల స్థాయిలోనే పిల్లల్లో పచ్చదనం, పర్యావరణహితంపై బీజం వేసేందుకు దీన్ని అందుబాటులోకి తెచ్చారు.

 వారం పాటు రోజుకో అంశం

ఈ నెల 15 నుంచి 24 వరకు రోజుకో అంశంపై చైతన్యం కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 16, 17 రెండు రోజుల పాటు ప్రభుత్వ సెలవులు తప్ప మిగిలిన ఏడు రోజుల్లో విద్యార్థులకు వివరించాలని నిర్ణయించారు. 15న ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకోవడం, 18 వైజ్ఞానిక ఆహారపు అలవాటు, 19న ఈ-వ్యర్థాలు తగ్గించడం, 20న చెత్త వినియోగాన్ని తగ్గించడం, 21 ఇంధన శక్తి ఆదా చేయడం, 22న నీటిని పొదుపు చేయడం, 24న ప్లాస్టిక్‌ నివారణ చర్యలపై అవగాహన కల్పించాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే పాఠశాలలకు విద్యార్థులకు వస్తున్నారు. హాజరు శాతం తక్కువగా నమోదవుతోంది. దీంతో విద్యాశాఖ చేపట్టిన బృహత్తర కార్యక్రమంపై ప్రచారం లోపిస్తోంది. 

పిల్లల్లో ఆలోచన పెంచేలా..

విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. జాతీయ హరిత దళం ఆధ్వర్యంలో పిల్లలను భాగస్వాములను చేస్తున్నాం. హరితహారం నర్సరీలు, మొక్కల పెంపకంపై చైతన్యం తీసుకొస్తున్నాô. రోజువారీగా అంశాలపై తప్పనిసరిగా చైతన్యం చేయాలని ఆదేశించాం.
- రవినందన్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని