logo

యథేచ్ఛగా మట్టి రవాణా

ఓ సామాన్య రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఎత్తుగా ఉన్న భూమిని తవ్వుకొని చదును చేసుకునేందుకు అనేక కారణాలు చెప్పి అడ్డుకునే పలుశాఖల అధికారులు ప్రభుత్వ, పరంపోగు భూముల్లో, చెరువుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

Published : 18 Jun 2024 06:34 IST

నీరుకుళ్ల శివారులో మట్టి తవ్వకాలు   

న్యూస్‌టుడే, సుల్తానాబాద్‌: ఓ సామాన్య రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఎత్తుగా ఉన్న భూమిని తవ్వుకొని చదును చేసుకునేందుకు అనేక కారణాలు చెప్పి అడ్డుకునే పలుశాఖల అధికారులు ప్రభుత్వ, పరంపోగు భూముల్లో, చెరువుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ల శివారులోని పరంపోగు భూముల్లో, రేగడి మద్దికుంట గ్రామ చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతూ అక్రమార్కులు రూ.లక్షల్లో దండుకుంటున్నారు. అయినా సంబంధితశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

  నీలగిరి వనంలో..

సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ల శివారు పరంపోగు భూములను గతంలో ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించింది. ఆ భూముల్లో వారు నీలగిరి చెట్లు పెంచుకొని కొంత ఆదాయం పొందుతున్నారు. ఆ భూములు కాస్తా ఎత్తుగా ఉండి నీరు పారక.. సాగు వినియోగానికి దోహదపడటం లేదు. దీన్ని అదనుగా చేసుకున్న మట్టి అక్రమ రవాణాదారులు ఆ భూముల్లో రాత్రిబంవళ్లు మట్టిని తరలిస్తూ దండుకుంటున్నారు. సెలవు, పండగ దినాలు, రాత్రి సమయాల్లో అధికారులు అందుబాటులోలేని సమయం చూసి మరీ తవ్వకాలు చేపడుతూ మట్టిని తరలిస్తున్నారు.

   రేగడి మద్దికుంటలో..

రేగడి మద్దికుంట గ్రామ చెరువులో మట్టి తవ్వకాల అనుమతుల పేరున గుత్తేదారుడు అధికలోతుగా, గోతులుగా మట్టిని తవ్వుకొని సుద్దాల నుంచి రేగడి మద్దికుంటకు కొత్తగా నిర్మిస్తున్న రహదారి నిర్మాణానికి వాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. తమ గ్రామ అవసరాలకు మట్టి పోయకుండా మట్టిని తరలించుకుపోతున్నారని పేర్కొంటూ ఇటీవలే గ్రామస్థులు మట్టి టిప్పర్లను కూడా అడ్డుకోవడం గమనార్హం. ప్రభుత్వ, పరంపోగు, చెరువు, కుంటల్లో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవాల్సిన పలుశాఖల అధికారులు తమ పరిధి కాదంటే తమది కాదని చేతులు దులుపుకొంటున్నారని, దీంతో అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు సమన్వయంతో మట్టి అక్రమ దందాను అడ్డుకోవాలని కోరుతున్నారు. 


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా చేపడితే పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటాం. మట్టి తవ్వకాలకు సంబంధితశాఖ అధికారుల నుంచి తప్పక అనుమతులు తీసుకోవాలి. 
    - మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని