logo

రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుపై అధ్యయనం

ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడంలో కీలకమైంది స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ. దీని ద్వారా రాబడులు పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది

Published : 18 Jun 2024 06:37 IST

పంచాయతీలు, పురపాలికల వారీగా వివరాల సేకరణ

అభ్యంతరాల స్వీకరణ తర్వాతే నిర్ణయం

సిరిసిల్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం 


ఈనాడు డిజిటల్, సిరిసిల్ల : ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడంలో కీలకమైంది స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ. దీని ద్వారా రాబడులు పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల ఫీజు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సబ్‌ రిజిస్ట్రార్ల వద్ద ఉన్న మార్కెట్‌ విలువ ఆధారంగా ఆయా మండల కేంద్రాలు, పంచాయతీలు, పురపాలికల్లో వాస్తవంగా ఎంత ధర పలుకుతుందనే విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇంటి మార్కెట్‌ ధరలు ఎలా ఉన్నాయి, ఇంటి నంబర్లతో సహా వివరాలు సేకరిస్తున్నారు. వీటన్నింటిపై మంగళవారం ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్‌లో సబ్‌ రిజిస్ట్రార్లు అందరికీ జోనల్‌ స్థాయి సమీక్ష సమావేశం జరుగుతుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల పైన ప్రభుత్వానికి పంపాల్సిన వివరాలు, అలాగే ధరల నిర్ణయంపై అభ్యంతరాల స్వీకరణపైన చర్చించనున్నారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక ఆగస్టు 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయి.

ఇదీ పరిస్థితి

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ద్వారా సంవత్సరానికి సుమారు రూ.50 కోట్ల మేరకు ఆదాయం వస్తోంది. పెరగనున్న ఛార్జీలతో రాబడి కూడా పెరుగుతుంది. 2021 వరకు మార్కెట్‌ విలువపై రిజిస్ట్రేషన్‌ ఫీజు 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. వ్యవసాయ భూములకు ఎకరానికి కనీస ధర రూ.75 వేలు, ఖాళీ స్థలాలకు చదరపు గజం చొప్పున, నివాసాలకు చదరపు అడుగు చొప్పున కనీస ధర నిర్ణయించి మార్కెట్‌ విలువ పెంచారు. ప్రస్తుతం సిరిసిల్ల, వేములవాడ పురపాలికల పరిధిలో ప్లాట్లు చదరపు గజం కనిష్ఠంగా రూ.1,780 నుంచి రూ.2,500 వరకు ఉంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో గజం రూ.800 నుంచి రూ.3,000 వరకు ఉంది.
సిరిసిల్ల రెండో బాహ్యవలయ రహదారి చంద్రంపేట, రగుడు ప్రాంతంలో చదరపు గజం మార్కెట్‌ విలువ రూ.2 వేలు ఉంది. ఇక్కడ వంద గజాలు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే రూ.2లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. కాగా బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం చదరపు గజం 20 వేలు. అంటే వంద గజాలకు రూ.20 లక్షల వరకు పలుకుతుంది. ఇలా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ మార్కెట్‌ విలువ, స్థానికంగా జరుగుతున్న క్రయ, విక్రయాల ధరలపైనాపూర్తిగా అధ్యయనం చేయనున్నారు. పురపాలికల్లోని స్థిరాస్తి ప్రభావం గ్రామాల్లోని వ్యవసాయ భూములకు పాకింది. దాంతో తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మండలాల్లో రియల్‌ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది.

వ్యవసాయ భూముల విక్రయాలపై దృష్టి

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నెలకు సగటున వెయ్యి నుంచి 1,300 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ జరుగుతాయి. వీటి ద్వారా సుమారు రూ.4.50 కోట్ల ఆదాయం వస్తోంది. అలాగే ఒక్కో తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీనిలో వీర్నపల్లి, రుద్రంగి మండలాల్లో తక్కువగా ఉంటాయి. ఎల్లారెడ్డిపేట, వేములవాడ, సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో ఎక్కువ. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో లేఅవుట్లు లేకుండానే గుంట, రెండు గుంటల చొప్పున వ్యవసాయ భూములను విక్రయిస్తున్నారు. దీనివల్ల చాలా ఏళ్లుగా ప్రభుత్వానికి రాబడి పడిపోతుందన్న అభిప్రాయం ఉంది. భవిష్యత్తులో నివాస స్థలంగా మార్చుకోవాలనుకునేవారు వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు విక్రయదారులు లేఅవుట్‌ లేకుండా, వ్యవసాయేతర భూమిగా మార్పిడి పన్ను (నాలా) చెల్లించకుండా విక్రయిస్తున్నారు. ఇలాంటి లావాదేవీల నుంచి రాబడి పెంచుకోవాలన్న ఆలోచనలో రిజిస్ట్రేషన్‌ శాఖ ఉంది. కాగా ప్రభుత్వం సేకరించే వివరాల్లో ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌ విలువ ఎంత? ప్రస్తుత ప్రభుత్వ విలువ ఎంత? అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని