logo

కేటాయించని నిధులు.. పూర్తికాని పనులు

వాహనదారులకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల-కరీంనగర్‌ జిల్లాల ప్రధాన రహదారిలో కొదురుపాక నుంచి నర్సింగాపూర్‌ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టారు.

Published : 18 Jun 2024 06:40 IST

 వర్షాలకు కోతకు గురవుతున్న రహదారి అంచులు

కొదురుపాక వద్ద కోతకు గురైన మట్టి 
న్యూస్‌టుడే, బోయినపల్లి : వాహనదారులకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల-కరీంనగర్‌ జిల్లాల ప్రధాన రహదారిలో కొదురుపాక నుంచి నర్సింగాపూర్‌ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టారు. పలు చోట్ల రహదారి ఎత్తు బాగా పెరిగింది. మట్టి కొట్టుకుపోకుండా రాతి కట్టు (బండరాళ్లు పేర్చడం), రెయిలింగ్‌ పనులు చేపట్టాల్సి ఉన్నా విస్మరించారు. చిరు వర్షాలకే రహదారి అంచులు కోతకు గురవుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల- కరీంనగర్‌ ప్రధాన రహదారిలో వాహనదారులకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు కొదురుపాక చౌరస్తా నుంచి నర్సింగాపూర్‌ స్టేజి వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం గతంలోనే నిధులు విడుదల చేసింది. కొదురుపాక చౌరస్తా నుంచి వెంకట్రావుపల్లి శివారులోని మధ్యమానేరు ఎడమ కాలువ వరకు ఒక భాగం, అక్కడి నుంచి నర్సింగాపూర్‌ వరకు మరో భాగంగా పనులు చేపట్టారు. రహదారి నిర్మాణం కోసం రూ. 20.45 కోట్లు కేటాయించారు. కొదురుపాక నుంచి నర్సింగాపూర్‌ స్టేజి  వరకు పూర్తి చేశారు. వెంకట్రావుపల్లి శివారులోని మధ్యమానేరు ఎడమ కాలువ వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వెంకట్రావుపల్లి వద్ద డివైడర్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. రహదారి నిర్మాణంతో వాహనదారులకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడింది.

బండరాళ్లు పేర్చకపోవడంతో...

కొదురుపాక చౌరస్తా నుంచి నర్సింగాపూర్‌ వరకు చేపట్టిన నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో పలు చోట్ల రహదారి ఎత్తు అధికంగా ఉంది. రహదారి ఎత్తుగా ఉన్న చోట మట్టి కోతకు గురికాకుండా ఉండటానికి రాతి కట్టు (బండరాళ్లు పేర్చడం) చేపట్టాల్సి ఉంది. దీంతోపాటు వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు రెయిలింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇటీవల కురిసిన వర్షానికి మట్టి కోతకు గురైంది. అందులో విద్యుత్తు స్తంభాలు ఉన్నాయి. మట్టి కోతకు గురవడం వల్ల తారు రోడ్డు కూడా క్రమంగా కోతకు గురై కొట్టుకుపోయే అవకాశం ఉంది. వీటితోపాటు రహదారి డివైడర్‌ మధ్యలో లైటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. రాత్రి సమయంలో వాహనాల లైట్లు ఎదురెదురుగా పడకుండా ఉండటానికి మధ్యలో మొక్కలు నాటాల్సి ఉంది. మధ్యలో ఎర్ర మట్టి పోయలేదు. మిగతా పనుల పూర్తికి సుమారు రూ.80 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం.

ప్రమాదాలకు ఆస్కారం

నాలుగు వరుసల రహదారి ఎత్తుగా ఉన్న చోట బండరాళ్లు పేర్చకపోవడం వల్ల వర్షాలకు మట్టి కోతకు గురైంది. భారీ వర్షాలు పడితే మట్టి పూర్తిగా కోతకు గురై తారు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. త్వరగా బండరాళ్లు పేర్చడంతోపాటు రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలి. డివైడర్ల మధ్యలో లైటింగ్‌ ఏర్పాటు చేసి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలి.

- సతీశ్, కొదురుపాక


ప్రతిపాదనలు పంపిస్తాం

నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా మధ్యమానేరు ఎడమ కాలువ వద్ద సుమారు రూ.కోటితో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఓవైపు వంతెన నిర్మాణం పూర్తయి రెండోవైపు పనులు చేపడుతున్నారు. రహదారి ఎక్కడైతే ఎత్తుగా ఉందో అక్కడ మట్టి కోతకు గురికాకుండా ఉండేందుకు తెట్టె కట్టడానికి పరిశీలన చేశాం. అంచనాలు రూపొందుతున్నాయి. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేస్తాం.

- సతీశ్, ఏఈ, ఆర్‌అండ్‌బీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని