logo

ఉపాధ్యాయుల ఉత్కంఠకు తెర

కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు ఎట్టకేలకు తెరపడింది.

Published : 20 Jun 2024 02:53 IST

పదోన్నతుల ద్వారా బదిలీలు పూర్తి
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం

కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు ఎట్టకేలకు తెరపడింది. నాలుగైదు రోజులుగా దీనికి సంబంధించిన ఉత్తర్వుల కోసం పడిగాపులు గాసిన ఉపాధ్యాయులకు ఎట్టకేలకు అవి బుధవారం ఉదయం అందాయి. జిల్లా విద్యాశాఖ పదోన్నతులు కల్పిస్తూ వారు ఎంపిక చేసుకున్న పాఠశాలలను ఎంపిక చేస్తూ నియామకాల ఉత్తర్వులను జారీ చేయడంతో ఉపాధ్యాయుల్లో సంతోషం నెలకొంది. దీంతో చాలా ఏళ్ల అనంతరం పదోన్నతులు పొందామనే సంతోషంతో ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల నుంచి రిలీవ్‌ అయి వెంటనే వారికి బదిలీ అయిన బడుల్లో విధుల్లో చేరారు. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా, పలు కారణాలతో చేజారిన వారిలో నిరాశ నెలకొంది. పదోన్నతుల్లో కొందరు ఉపాధ్యాయులు రెండు, మూడు కేటగిరిల్లో కల్పించడం వంటివి తప్పులు దొర్లడంతో అర్హులైన కొందరు  ఉపాధ్యాయులకు నష్టం జరిగినట్లయింది. 

482 మందికి లబ్ధి

జిల్లాలో అర్హులైన ఉపాధ్యాయులకు సీనియారిటీ జాబితాల ఆధారంగా 482 మందికి పదోన్నతులు పొందారు. ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యం పరిధిలో పదోన్నతులు పొంది బదిలీపై వారికి కేటాయించిన బడుల్లో చేరారు. అయితే జిల్లాలో మొత్తం స్కూల్‌ అసిస్టెంట్‌ వివిధ సబ్జెక్టుల్లో 548 పోస్టులకు పదోన్నతులు కల్పించే అవకాశముంది. పలు సబ్జెక్టుల్లో అర్హత లేని కారణంగా పదోన్నతుల పోస్టులు మిగిలిపోయాయి. మిగిలిన సబ్జెక్టుల్లో ఎక్కువ మంది అర్హులైన వారున్నా పోస్టులు లేక వారికి నిరాశే మిగిలింది.

నెరవేరిన పండిట్‌లు, పీఈటీల కల

దశాబ్దానికి పైగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న జిల్లాలోని భాషా పండితులు, పీఈటీల కల నెరవేరింది. వారితో నియామకమైన ఇతర కేటగిరీల ఉపాధ్యాయులు ఇప్పటికే రెండుసార్లు పదోన్నతులు పొందినా వీరికి మాత్రం నిరాశే ఎదురైంది. ప్రస్తుత బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌లో వీరి పోస్టులను ఉన్నతీకరించడంతో పండిట్‌లు, పీఈటీలకు పదోన్నతులు లభ్యమయ్యాయి. చాలా ఏళ్ల అనంతరం స్కూల్‌ అసిస్టెంట్‌ భాష పండితులుగా మొత్తం 260 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ డైరెక్టర్లుగా 63 మంది పదోన్నతులు పొందగా, వారు వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరారు. తోటి ఉపాధ్యాయులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. 


పొరపాట్లు..

జిల్లాలో విద్యాశాఖ వెలువరించిన పదోన్నతుల జాబితాల్లో పలు పొరపాట్లు చోటు చేసుకున్నాయి. ఒకే ఉపాధ్యాయుడికి రెండేసి కేటగిరీల్లో పదోన్నతులు కల్పించారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంల పదోన్నతుల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతుల్లో పలు కేటగిరీల్లో చాలా మందికి ఇలా రెండు, మూడు పోస్టుల్లో పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా పదోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. ఈ విషయం జిల్లా విద్యాశాఖ దృష్టికి కూడా వెళ్లింది. పొరపాట్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇలా మిగిలిన పోస్టుల్లో సీనియారిటీ జాబితా ఆధారంగా మిగిలిన వారికి పదోన్నతులు కల్పించేలా ఆలోచిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని