logo

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం

బీర్‌పూర్‌ సహకార సంఘం పరిధిలోని తుంగూరు కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి గురువారం సాయంత్రంలోగా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ హతీరాం తెలిపారు.

Published : 20 Jun 2024 02:55 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: బీర్‌పూర్‌ సహకార సంఘం పరిధిలోని తుంగూరు కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి గురువారం సాయంత్రంలోగా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ హతీరాం తెలిపారు. ‘ధాన్యం డబ్బులకు రైతుల నిరీక్షణ’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తకు స్పందించారు. తుంగూరు కొనుగోలు కేంద్రంలో 379 మంది రైతుల నుంచి 1740 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, 327 మంది రైతుల ఖాతాల్లో వెంటనే సొమ్ము జమ చేశామన్నారు. 52 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మిల్లర్‌ ధ్రువీకరణ జాప్యం కావడం వల్ల ఆలస్యం జరిగిందని బుధవారం మిల్లర్‌ నుంచి ధ్రువీకరించుకున్నామన్నారు. జిల్లాలో యాసంగి సీజన్‌లో 419 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.27 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని 4.18 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని ధాన్యం మిల్లులకు 9 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లాలోని మిల్లులకు పంపించామన్నారు. ఇప్పటి వరకు 4.26 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన రూ. 940 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు హతీరాం పేర్కొన్నారు.


చెట్ల కొమ్మలు తరలింపు..  

మల్యాల : మల్యాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన విద్యుత్తు తీగల కింద చెట్ల కొమ్మలను సిబ్బంది నరికి అక్కడే వదిలేయడంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులతో ఈనెల 16న ‘చెట్ల కొమ్మలను తరలించరూ’ శీర్షికన ‘ఈనాడు’లో చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన గ్రామపంచాయతీ ఈవో శ్రీకాంత్‌ పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి రహదారి పక్కన చెట్లకొమ్మలను తరలించారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని