logo

దృశ్యశ్రవణ సేవలతోనే ప్రయోజనం

జగిత్యాల జిల్లాలో 71 ఏఈవో క్లస్టర్లలో రైతువేదికలు ఉండగా మల్యాల, సారంగాపూర్, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం రైతువేదికల్లోనే దృశ్యశ్రవణ(వీడియో కాన్ఫరెన్స్‌) సేవలను ప్రారంభించారు.

Published : 20 Jun 2024 02:57 IST

అన్ని రైతువేదికల్లో ఏర్పాటుకు చర్యలు అవసరం 
న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం

గిత్యాల జిల్లాలో 71 ఏఈవో క్లస్టర్లలో రైతువేదికలు ఉండగా మల్యాల, సారంగాపూర్, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం రైతువేదికల్లోనే దృశ్యశ్రవణ(వీడియో కాన్ఫరెన్స్‌) సేవలను ప్రారంభించారు. జిల్లాలో 385 గ్రామ పంచాయతీలుండగా 71 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించి ఒక్కో వేదిక పరిధికి రెండు మూడు నుంచి ఏడెనిమిది గ్రామాలవరకు చేర్చారు. అయితే కేవలం నాలుగు వేదికల్లోనే దృశ్యశ్రవణ సేవలను ప్రారంభించి ప్రభుత్వ పథకాలు, పంటలసాగు యాజమాన్యం, రాయితీలు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను రైతులకు చేరవేస్తున్నారు. దీంతో జిల్లాలోని మిగిలిన రైతువేదికల పరిధి రైతులు సాగు సలహాలకు దూరమవుతుండగా అన్ని వేదికలకు దృశ్యశ్రవణ సేవలను విస్తరించాల్సి ఉంది.

బహుళ వినియోగం..

రైతులకు సాంకేతిక సలహాలతో పాటు పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, విత్తనాల సరఫరా, భూసార పరీక్షలు తదితర బహుళ వినియోగ నేపథ్యంగా నిర్మించిన రైతువేదికలు చాలాచోట్ల గ్రామాలకు దూరంగా నిర్మించటంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రతి రైతు వేదికకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) బాధ్యులుగా ఉండగా దాదాపు 60 శాతానికిపైగా మహిళలే ఏఈవోలుగా ఉండగా వీరు ఒక్కరు వెళ్లి విధులు నిర్వర్తించేందుకు జంకుతున్నారు. కనీసం వేదికకొక అటెండర్‌ కూడా లేకపోవటంతో ఏఈవోనే తాళం తీసుకుని, ఊడ్చి శుభ్రంచేసుకుని పనులు చేసుకుందామన్నా నిర్మానుష్య ప్రాంతంలోని వేదికల్లో భయంభయంగా గడుపుతున్నారు. ఒక్కో రైతు వేదికకు నెలనెలా రూ.9 వేల చొప్పున నిర్వహణ ఖర్చులు ఇవ్వాల్సి ఉంది. గతంలో రూ.95 వేల ఖర్చుతో ఒక్కో మినీ భూసార పరీక్ష ల్యాబ్‌ పరికరాలు తేగా వీటిద్వారా వేదికల్లో భూసార పరీక్షలను చేపట్టాల్సి ఉంది. రైతు వేదికల్లోనే విత్తనాలు, రసాయన ఎరువులను నిల్వచేసి ఏఈవోల ద్వారా రైతులకు విక్రయించటం అనువుగా ఉంటుంది. రెవెన్యూ సేవలకు కూడా వేదికలను వినియోగించుకునే వీలుంది. రాయితీ విత్తనాలను, యంత్రపరికరాలను కూడా వేదికలద్వారానే పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను అమల్లోకి తేవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి రైతు వేదికకొక సహాయకుడిని నియమించటం, మౌలిక వసతులను కల్పిస్తే రైతులకు వారివారి గ్రామాల్లోనే సేవలందుతాయి.


ప్రతి మండలానికి..

-వాణి, జిల్లా వ్యవసాయాధికారిణి, జగిత్యాల 

జిల్లాలోని మండలానికొక రైతువేదికలో దృశ్యశ్రవణాన్ని ఏర్పాటు చేసి రైతులకు సేవలను విస్తరిస్తాం. ఇతరత్రా సేవలను రైతువేదికల ద్వారానే చేపట్టేలా ప్రభుత్వం విస్తరణ కార్యకలాపాలను అమలు చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని