logo

నేటితో బడి బస్సుల తనిఖీ పూర్తి

విద్యార్థులను పాఠశాలలకు చేరవేసే బస్సుల తనిఖీలు నేటితో ముగియనున్నాయి. వేసవి సెలవులు ముగిసి నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12న ప్రారంభమైంది.

Published : 20 Jun 2024 03:04 IST

న్యూస్‌టుడే, సిరిసిల్ల కలెక్టరేట్‌

విద్యార్థులను పాఠశాలలకు చేరవేసే బస్సుల తనిఖీలు నేటితో ముగియనున్నాయి. వేసవి సెలవులు ముగిసి నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12న ప్రారంభమైంది. విద్యార్థులను పాఠశాలలకు తరలించే బస్సుల ఫిట్‌నెస్‌ గడువు మే 15తో ముగిసింది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు బస్సుల మరమ్మతులు పూర్తి చేసి సామర్థ్య పరీక్షలకు తీసుకురావాలని ఆర్టీఏ అధికారులు సమాచారం అందించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు బస్సులను ఆర్టీఏ కార్యాలయానికి తీసుకువచ్చి పరీక్షలను నిర్వహించుకొని సర్టిఫికెట్లు పొందారు. ఇతర వాహనాల ఫిట్‌నెస్‌ గడువు ఏ నెలలో ఏ తేదీన తీసుకున్నారో వచ్చే సంవత్సరంలో అదే తేదీతో ముగుస్తుంది. కానీ విద్యాసంస్థలకు నడిచే వాహనాలకు మాత్రం ఏ నెలలో ఏ తేదీన తీసుకున్నా వచ్చే సంవత్సరం మే 15 తోనే ముగుస్తుంది. 

ధ్రువపత్రం అందజేత

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులను తరలించడానికి మొత్తం 150 బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 126 బస్సులను ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు మరమ్మతులు చేయించి ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొని రాగా అధికారులు బస్సులో ప్రథమ చికిత్స పెట్టె, ఫైర్‌ ఎగ్జాస్టర్, వాహన కండిషన్, టైర్లు, సీట్లు, ఫుట్‌బోర్డు, లైట్లు, రేడియం, ఇంజిన్‌ కండిషన్, బ్రేకుల కండిషన్‌ ఇవన్నీ తనిఖీ చేసి వాటికి సర్టిఫికేట్‌ను అందజేశారు. జిల్లాలో ఆయా విద్యాసంస్థలకు చెందిన 13 బస్సుల కాల పరిమితి 15 సంవత్సరాలు ముగియడంతో వాటిని స్క్రాప్‌ కింద అమ్మివేశారని డీటీవో లక్ష్మణ్‌ తెలిపారు. మరో 6 బస్సులు నూతనంగా కొనుగోలు చేసినవి, మిగిలిన 5 వాహనాల యాజమాన్యాలకు సమాచారం అందించామని, గురువారంతో అన్ని బస్సుల తనిఖీలు పూర్తికానున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. 

స్క్రాప్‌ కింద విక్రయించాలంటే

జిల్లాలో 15 సంవత్సరాలు పూర్తయిన వాహనాలను స్క్రాప్‌ కింద అమ్మడానికి ఆ వాహనాల యజమానులు ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి అధికారుల సమక్షంలో ఆ వాహనాలను వెల్డింగ్‌ మిషన్‌తో కట్‌ చేసి స్క్రాప్‌ చేస్తారు. బస్సుకు ఉండే చాసిస్‌ నంబర్‌ను కట్‌ చేసి ఆర్టీవో కార్యాలయంలో అందజేయాలి. ఆ తర్వాత ఆ బస్సుకు సంబంధించి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నుంచి తొలగిస్తారు. వాహనాలను ఇతర జిల్లాలకు అమ్మినపుడు తప్పని సరిగా ఆర్టీవో కార్యాలయం నుంచి ఎన్‌వోసీ సర్టిఫికేట్‌ తీసుకొని అమ్మివేయాలని అధికారులు సూచిస్తున్నారు. 


సామర్థ్య పరీక్షలకు తీసుకురాకపోతే సీజ్‌ 

- లక్ష్మణ్, జిల్లా రవాణాశాఖ అధికారి 

జిల్లాలో ఇప్పటి వరకు 126 బస్సుల తనిఖీలు పూర్తి చేశాం. 13 బస్సులు స్క్రాప్‌ కింద తీసివేయగా, మరో 6 బస్సులు నూతనంగా కొనుగోలు చేశారు. బస్సుల యజమానులు మరమ్మతులు చేయించుకొని ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన తర్వాత అన్నీ పరిశీలించాకే సర్టిఫికేట్‌ను అందజేశాం. సామర్థ్య పరీక్షలకు తీసుకురాని పాఠశాలల యాజమాన్యాలకు సమాచారం అందించాం. వారు బస్సులను తీసుకొని రాకపోతే మేమే పాఠశాలకు వెళ్లి బస్సులను సీజ్‌ చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని