logo

రూ.30 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం, ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి డి.శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Published : 20 Jun 2024 03:05 IST

బడిబాట ముగింపు సభలో మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం, ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి డి.శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బడిబాట ముగింపు సందర్భంగా బుధవారం మంథని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయ, గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గ్రూప్‌-2, 4 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. నిరుద్యోగుల ఉపాధి కల్పనకు టాటా కంపెనీ సౌజన్యంతో రాష్ట్రంలో రూ.2,234 కోట్లతో 65 ఐటీఐలను అడ్వాన్స్‌ లెర్నింగ్‌ సెంటర్లుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కాటారం ఐటీఐకి రూ.6 కోట్లు మంజూరయ్యాయన్నారు. కోకా కోలా కంపెనీ పరిశ్రమ ఏర్పాటుకు మంథని మండలం అడవిసోమన్‌పల్లి, సిరిపురంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారన్నారు. జిల్లాలోని 478 పాఠశాలల్లో రూ.30 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని, దీంతో బడిబాటలో 984 మంది విద్యార్థులు చేరారన్నారు. మంథనిలో నెల రోజుల్లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. మంథని, సెంటినరీకాలనీల సమీపంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపడతామన్నారు. మంథని, మంచిర్యాల సమీపంలో వారం రోజుల్లో వంతెన నిర్మాణాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో శంకుస్థాపన చేయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో న్యాక్‌ కింద కుట్టు శిక్షణ పొందిన మహిళలకు మంత్రి ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, జడ్పీ సీఈవో నరేశ్, డీఆర్‌డీవో రవీందర్, డీఈవో మాధవి, ఆర్‌డీవో హనుమానాయక్, ఎంపీపీ శంకర్, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రమాదేవి, వైస్‌ ఛైర్మన్‌ బానయ్య తదితరులు పాల్గొన్నారు. 

జోడో యాత్రతోనే ‘ఇండియా’కు అధిక సీట్లు

రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధిక స్థానాల్లో గెలుపొందిందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం మంథనిలో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కేకు కోశారు. పార్టీ నాయకులు ప్రసాద్, ప్రవీణ్, కొత్త శ్రీనివాస్, కొండ శంకర్, వి.శ్రీనివాస్, శివ, సత్యం, లింగయ్యయాదవ్, బానయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని