logo

హరితానికి సిద్ధం.. సంరక్షణతోనే ఫలితం

జిల్లాలో హరితహారం కింద పెంచడానికి మొక్కలను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏడాది 16.64 లక్షల మొక్కలు పెంచాలని నిర్ణయించారు.

Updated : 20 Jun 2024 04:47 IST

పదో విడత లక్ష్యం 16.64 లక్షలు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

జిల్లాలో హరితహారం కింద పెంచడానికి మొక్కలను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏడాది 16.64 లక్షల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, కేశోరామ్‌ పరిశ్రమలకు లక్ష్యాలు కేటాయించారు. అయితే ఏటా మొక్కలు నాటడంలో ఉత్సాహం చూపుతుండగా సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా లక్షల మొక్కలు ఎండిపోతుండగా రూ.కోట్ల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నాటిన ప్రతి మొక్కనూ బతికించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గ్రామీణ, పురపాలికల్లో వేర్వేరు నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెల మొదటి వారంలో మొక్కలు నాటాలని భావిస్తున్నారు.

నీడనిచ్చే, పూల మొక్కలకు ప్రాధాన్యం

జిల్లాలో నాటడానికి మొక్కల కొరత లేకుండా ఊరికో నర్సరీ ఏర్పాటు చేశారు. వాటిలో టేకు, ఈత, వెదురు, మలబార్, ఇప్ప, మద్ది, వెలగ, మర్రి, వేప, రేల, బాదం, రావి, చింత, తులసి, నిమ్మ, జామ, సీతాఫలం, కర్జూర, మందార, సన్నజాజి, మల్లె తదితర రకాల విత్తనాలతో పాటు ప్రకృతిలో లభించే వాటికి ప్రాధాన్యమిచ్చారు. ప్రతి నర్సరీకి కంచె(ఫెన్సింగ్‌) ఏర్పాటు చేశారు. వేసవిలో నీటిని సమకూర్చేందుకు బోర్లు లేని చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. గత అనుభవాల దృష్ట్యా విత్తన దశ నుంచే నర్సరీలపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ పెంచారు. తరచూ సమీక్షలు నిర్వహిస్తూ లోపాలను సరిదిద్దడంతో గతంతో పోలిస్తే ఈసారి నర్సరీల్లో మొక్కల ఎదుగుదల కొంత మెరుగ్గా ఉంది.

గ్రామీణాభివృద్ధి శాఖకే అధిక లక్ష్యం

జిల్లాలో ఈ ఏడాది 16.64 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో ప్రధానంగా గ్రామీణాభివృద్ధి శాఖకు 8 లక్షలు, అటవీ శాఖకు 60 వేలు, రామగుండం నగరపాలకసంస్థకు 80 వేలు, పురపాలక సంఘాల్లో పెద్దపల్లికి 50 వేలు, సుల్తానాబాద్‌కు 30 వేలు, మంథనికి 30 వేలు, సింగరేణి 5 లక్షలు, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ 10 వేలు, ఎన్టీపీసీ 20 వేలు, కేశోరామ్‌ 5 వేలు, మిగతా లక్ష్యాన్ని మరో 28 శాఖలకు విధించారు. కూలీలతో గుంతల తవ్వకం పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నాటిన ప్రతి మొక్కకూ ముళ్ల కంచెతో పాటు విధిగా నీటి తడులు అందించేలా ఆయా శాఖలు బాధ్యత తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హరితహారం కింద వెచ్చిస్తున్న రూ.కోట్ల ప్రజాధనం వృథా కాకుండా దిద్దుబాటు చర్యలు చేపడితే ప్రయోజనం కలుగుతుంది.


ప్రభుత్వ అనుమతి రాగానే నాటుతాం

-శివయ్య, అటవీ శాఖ జిల్లా అధికారి 

జిల్లాలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కల ఎదుగుదల బాగానే ఉంది. లక్ష్యాలకు సరిపడా అందుబాటులో ఉన్నాయి. మొక్కలు నాటడంతో సరిపెట్టకుండా సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఆదేశించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని