logo

డీడీఎన్‌ఎస్‌కు ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో కరీంనగర్‌లో 246, జగిత్యాలలో 203, రాజన్న సిరిసిల్లలో 254, పెద్దపల్లిలో 166 దేవాలయాలు ఉన్నాయి.

Published : 20 Jun 2024 03:08 IST

న్యూస్‌టుడే, జగిత్యాల విద్యానగర్‌

మ్మడి జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో కరీంనగర్‌లో 246, జగిత్యాలలో 203, రాజన్న సిరిసిల్లలో 254, పెద్దపల్లిలో 166 దేవాలయాలు ఉన్నాయి. వీటికి అదనంగా దూప, దీప నైవేద్యాల పథకం(డీడీఎన్‌ఎస్‌) కింద మరో 898 దేవాలయాల్లో అర్చనలు కొనసాగుతున్నాయి. పలు కారణాలతో చాలా దేవాలయాలు ఈ పథకానికి దూరంగా ఉన్నాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మరోసారి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆశిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిస్థితిపై కథనం.. 

దూప, దీప నైవేద్యం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. ఆలయం విధిగా దేవాదాయశాఖ చట్టం 43 ప్రకారం ఆమోదం పొందాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందే దేవాదాయశాఖలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ మేరకు మొదట్లో గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలకు మాత్రం అవకాశం ఉండగా ప్రజాప్రతినిధుల చొరవతో నగర, పట్టణ ప్రాంతాల్లో ఆలయాలను సైతం ఎంపిక చేసేందుకు వెసులుబాటు లభించింది. అయితే దరఖాస్తు చేసిన సంబంధిత ఆలయానికి ఎలాంటి ఆదాయ వనరులు ఉండరాదు. ఒక వేళ భూమి ఉన్నప్పటికీ 5 ఎకరాలకు మించరాదు. పథకం ప్రారంభించిన మొదట్లో అర్చకులకు నెలకు గౌరవ వేతనం కింద రూ.2 వేలు ఆ తరువాత రూ.6 వేలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రూ.10 వేలు అందిస్తున్నారు. 

సిబ్బంది కొరత.. పర్యవేక్షణ లోపం

డీడీఎన్‌ఎస్‌ పథకం కింద ఎంపికైన కొన్ని ఆలయాల్లో అర్చనలు సజావుగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. దేవాదాయశాఖలో సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ సాధ్యం కావడం లేదు. కేవలం రెండు పూటలా పూజలు నిర్వహించి విధులు ముగించుకొనే అవకాశం ఉండగా.. ఆ తరువాత సైతం ఆలయాల్లో అధిక సమయం వెచ్చించాలని కోరడంతో ఇబ్బందులు తప్పడం లేదని పలువురు అర్చకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డీడీఎన్‌ఎస్‌ కింద 2023లో రాష్ట్రవ్యాప్తంగా 475 దేవాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇదే విధంగా ఉమ్మడి జిల్లాలో నిబంధనల ప్రకారం అర్హత సాధించని ఆలయాలు ఉన్నాయి. దీనికి గతంలో ఎంపికైన మరికొన్ని ఆలయాలు సైతం వివిధ కారణాలతో అర్చనలు నిలిచిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పలు చిన్నా పెద్ద ఆలయాలు నిత్యం ఆర్చనకు నోచుకోకపోగా ఉపాధి లేని పేద అర్చకులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో మరోసారి ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది.


ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు

- చంద్రశేఖర్, సహాయక కమిషనర్‌ 

దూప, దీప నైవేద్యం పథకం నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తే ఆలయాల నిర్వహణ మరికొంత మెరుగు పడే అవకాశం ఉంది. ఆలయాల ఎంపిక విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని