logo

నిధులిస్తేనే.. సాంకేతిక విద్యాభివృద్ధి

జేఎన్‌టీయూలోని విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులు, వసతి గృహాలను సమకూర్చడం ఏటా సవాలుగా మారుతోంది. గతేడాది కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించారు.

Updated : 20 Jun 2024 04:47 IST

జేఎన్‌టీయూ కళాశాలకు స్థల కేటాయింపుతో సరి
నాలుగేళ్లుగా వసతుల కోసం మల్లగుల్లాలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల

జేఎన్‌టీయూలోని విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులు, వసతి గృహాలను సమకూర్చడం ఏటా సవాలుగా మారుతోంది. గతేడాది కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించారు. వాటికి నిధుల కేటాయింపులో జాప్యం కారణంగా పనులు ముందుకు సాగడంలేదు. జిల్లాకు 2021-22 విద్యాసంవత్సరంలో జేఎన్‌టీయూ కళాశాల మంజూరైంది. తాత్కాలికంగా అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలోని కొంత భాగంలో ఇంజినీరింగ్‌ తరగతులు జరుగుతున్నాయి. సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్, టెక్స్‌టైల్‌ విభాగాల్లో మూడేళ్లలో కలిపి 780 మంది విద్యార్థులున్నారు. వీరిలో 600 మంది వసతి గృహాల్లో ఉంటున్నారు. ఈ ఏడాది ప్రవేశాలకు ఈసెట్‌ వెబ్‌ ఆప్షన్లు గురువారం నుంచి మొదలవుతాయి. ఎంసెట్‌ ర్యాంకుల వారీగా ఈ నెలాఖరులో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నాలుగో సంవత్సరం విద్యార్థులకు అదనపు తరగతి గదులతోపాటు కొత్తగా చేరేవారికి వసతి గృహాలకు ఇప్పటి నుంచే అన్వేషణ ప్రారంభించారు.

బోధన.. భోజనం అక్కడే

కొత్త విద్యాసంవత్సరంలోకి అడుగు పెట్టేసరికి ప్రస్తుతం ఉన్న తరగతి గదులు సరిపోవడంలేదు. మౌలిక వసతుల కల్పనలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. నాలుగేళ్లుగా విశ్వవిద్యాలయం గ్రాంట్‌ నుంచి విడతల వారీగా డిగ్రీ కళాశాలలోనే అదనపు గదులు, కంప్యూటర్‌ ల్యాబ్, వంటగది, భోజనశాలకు ఫ్యాబ్రికెట్‌ షెడ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. అగ్రహారం, చిర్లవంచ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని ఎనిమిది ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని బాల, బాలికలకు వేర్వేరు వసతి గృహాలను సమకూర్చారు. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయితే మరో 150 ప్రవేశాలకు అవకాశం ఉంది. అదనంగా నాలుగు తరగతి గదులు అవసరం. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్‌ విభాగాలకు ల్యాబ్స్‌ కోసం కొండగట్టు జేఎన్‌టీయూకి పంపుతున్నారు. మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన 14 మంది టెక్స్‌టైల్‌ విద్యార్థులు ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాలలో తరగతులు ఇప్పిస్తున్నారు. నాలుగో సంవత్సరం కూడా అక్కడే తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నారు.

పనుల ప్రారంభానికి జాప్యం

తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో జేఎన్‌టీయూ కళాశాల భవన నిర్మాణానికి 20 ఎకరాల స్థలాన్ని గతేడాది ఆగస్టులో రెవెన్యూ శాఖ రిజిస్ట్రార్‌కు అందించింది. అంతకుముందు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ నిర్మాణ విభాగం అధికారులు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. కళాశాల నిర్మాణానికి తొలుత సిరిసిల్ల-కామారెడ్డి బాహ్యవలయ రహదారి సమీపంలోని పెద్దూరు వద్ద 50 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. కేటాయింపులు జరిగేలోపు ఆ స్థలాన్ని మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. చివరికి మండేపల్లిలోని స్థలాన్ని ఖరారు చేసి ఇచ్చారు.


నివేదికలు అందజేశాం

- వేణుగోపాల్, ప్రిన్సిపల్, జేఎన్‌టీయూ సిరిసిల్ల 

విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా మౌలిక వసతులు సమకూర్చడం, కళాశాలలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవలే జేఎన్‌టీయూ ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశాం. తాత్కాలిక అవసరాలకు సైతం నిధులు అవసరం ఉంది. ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలోపు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు సమకూర్చుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని