logo

అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి

ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో అయిదేళ్లలో జిల్లా అభివృద్ధి కోసం పని చేయడం ఎంతో సంతృప్తి నిచ్చిందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు.

Published : 20 Jun 2024 03:15 IST

జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో అయిదేళ్లలో జిల్లా అభివృద్ధి కోసం పని చేయడం ఎంతో సంతృప్తి నిచ్చిందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. జగిత్యాల జడ్పీ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక మినీ పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ రాంబాబు, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌కుమార్, జడ్పీ సీఈలో రఘువరణ్, జిల్లా అధికారులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యుత్తు సిబ్బంది హరితహారంలో నాటిన చెట్లను నరికివేస్తున్నారని తీగలకు తాకుతున్న కొమ్మలను మాత్రమే కొట్టాలని సూచించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఆసుపత్రిలో మందులు అందుబాటులో లేవని, కేసీఆర్‌ కిట్టు అందటంలేదన్నారు. మెట్‌పల్లి ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గిందన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ వానాకాలం సాగు ప్రారంభమైనా రైతు భరోసా జమ కావటంలేదన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు నిలిచిపోయాయని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బిల్లులు వసూలు చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాయికల్‌ వైద్యశాలలో ప్రసవాలు తగ్గాయని, పారిశుద్ధ్యం లోపించిందన్నారు. 

సభ్యులకు ఘన సన్మానం

జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జులై 5న ముగియనుండగా బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం చివరిది కావటంతో జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌కుమార్, కల్వకుంట్ల సంజయ్‌కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డీసీఎంస్‌ ఛైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ ఉపాధ్యక్షుడు హరిచరణ్‌రావు జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంతను సన్మానించారు. అనంతరం జిల్లా అధికారులతోపాటు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.  

సమావేశంలో విద్యుత్తు శాఖపై ఎన్‌పీడీసీఎల్‌ ఎసీఈ సత్యనారాయణ మాట్లాడుతుండగానే సరఫరా నిలిచిపోయింది. దీంతో భారాస సభ్యులు కరెంట్‌ కోతకు ఇదే నిదర్శనమంటూ విమర్శిస్తూ మాట్లాడారు. అయితే ఒక నిమిషం 37 సెకన్లు సరఫరా నిలిచిపోగా దానికి కారణంగా ట్రాన్స్‌ఫార్మర్‌పై తొండ పడటంతో ట్రిప్పు అయినట్లు ఎస్‌ఈ వివరణ ఇచ్చారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని