logo

అంగన్‌వాడీ కేంద్రాల్లో సంస్కరణలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో మార్పు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు  చేపడుతోంది.

Published : 20 Jun 2024 03:20 IST

ఏకరూప దుస్తులు.. కొత్త పుస్తకాలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ మంకమ్మతోట

అంగన్‌వాడీ కేంద్రాల్లో మార్పు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు  చేపడుతోంది. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేలా అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. కొన్ని రోజుల కిందట సరళ భాషలో విద్యా బోధనకు నూతన పుస్తకాలను ముద్రించారు. వాటి బోధనకు హైదరాబాద్‌లో కొంతమంది ఎంపిక చేసిన అంగన్‌వాడీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ పొందిన వారు మిగిలిన వారికి శిక్షణ ఇచ్చే పనిలో ఉన్నారు. తాజాగా పూర్వ ప్రాథమిక విద్యకు కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఏకరూప దుస్తులు అందించేందుకు అవసరమైన వస్త్రాలు సైతం ఇటీవల జిల్లా సంక్షేమ కార్యాలయానికి చేరాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన బోధన

జిల్లాలో 777 అంగన్‌వాడీ కేంద్రాల్లో వాటి పరిధిలో మూడు నుంచి ఆరేళ్లలోపు కేంద్రాలకు వచ్చే వారిలో 20,507 మంది చిన్నారులున్నారు. ముందుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు ఏకరూప దుస్తులు అందించనున్నారు. వాటిని కుట్టే బాధ్యతను జిల్లా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పని చేస్తున్న మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున అంగన్‌వాడీ బాలలకు అప్పగిస్తారు. సరళ పదాలతో అంగన్‌వాడీ పిల్లలకు ప్రత్యేక సిలబస్‌తో రూపొందించిన పాఠ్య పుస్తకాలు సైతం జిల్లాకు చేరాయి. వీటిని త్వరలోనే అప్పగించనున్నారు. పూర్వ ప్రాథమిక విద్య కరదీపిక, ప్రియదర్శిని-1 పేరుతో వెలువడిన పుస్తకాలతో రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా బోధన ఉండేలా చర్యలు చేపడుతున్నారు.


బలోపేతానికి చర్యలు

- ఎం.సరస్వతి, జిల్లా సంక్షేమ అధికారి 

అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్ఠం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. టీచర్లకు నూతన పుస్తకాల పంపిణీతోపాటు పిల్లలకు ఏకరూప దుస్తులను కుట్టించి పంపిణీ చేస్తాం. కేంద్రాలకు వచ్చే బాలలకు నాణ్యమైన బోధన, పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని