logo

అసంఘటిత రంగ కార్మికులే అధికం

కార్మికుల నేర చరిత్ర తెలుసుకోవడం ద్వారా కొంతవరకు నేరాల నియంత్రణ సాధ్యమే అయినా ఉమ్మడి జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులే అధికంగా ఉండటంతో సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 20 Jun 2024 03:24 IST

వలస కూలీల వివరాల ఆరా సాధ్యమేనా!
న్యూస్‌టుడే, పెద్దపల్లి

‘వలస కూలీలను పనిలో పెట్టుకొనే యాజమాన్యాలు వారి నడవడిక, నేర చరిత్ర గురించి స్వయంగా విచారణ నిర్వహించిన తర్వాతే ఉపాధి కల్పించాలి.’ 

-ఇటీవల సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి ఘటన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు.

కార్మికుల నేర చరిత్ర తెలుసుకోవడం ద్వారా కొంతవరకు నేరాల నియంత్రణ సాధ్యమే అయినా ఉమ్మడి జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులే అధికంగా ఉండటంతో సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వలస కూలీల గణాంకాలు కార్మిక శాఖ వద్ద అందుబాటులో ఉండటం లేదు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పనులు, భవన నిర్మాణ కూలీలు, పరిశ్రమల్లో పని చేసే సాంకేతిక నిపుణుల వరకు వివిధ రంగాల్లో 50 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో ఇటుకబట్టీల్లోనే పెద్దసంఖ్యలో కూలీలున్నట్లు అనధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

మారిన పరిస్థితులు

40 ఏళ్ల కిందట ఉమ్మడి జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలసలు ఎక్కువగా ఉండేవి. సాగునీటి వసతి అందుబాటులోకి రావడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవడంతో క్రమంగా తగ్గిపోయాయి. అదే సమయంలో పదేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొందే కార్మికుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడి పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగంలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఇటుక బట్టీలు, బియ్యం మిల్లులు, గ్రానైట్‌ పరిశ్రమల్లోనే 80 శాతం మంది వలస కూలీలున్నారు.


స్పష్టమైన కార్యాచరణతోనే..

చిత్తశుద్ధి ఉంటే వలస కూలీల గణాంకాల సేకరణ, వారి నియంత్రణ పెద్ద సమస్యేమీ కాదు. కానీ ఏదైనా ఘటన జరిగినపుడే అధికారులు హడావుడి చేస్తూ మిగతా సమయాల్లో వదిలేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సీజన్‌ల వారీగా.. ఏడాది పొడవునా ఏయే రంగాల్లో వలస కూలీలు పని చేస్తున్నారో సంబంధిత శాఖల ద్వారా వివరాలు సేకరించడం సులభమవుతుంది. ఇటుక బట్టీలు, బియ్యం మిల్లులు, ఇతర పరిశ్రమల్లో పని చేసే కార్మికుల వివరాల కోసం యాజమాన్యాలు ఏటా పనులు ప్రారంభించే సమయంలోనే అధికారులు కూలీల వివరాలు సేకరించాలి. నిర్మాణ రంగ కార్మికులు, ఇతర రంగాల కూలీలు, వారిని నియమించుకున్న యజమానులను గుర్తించాలి. వారి ద్వారా వివరాలు సేకరించి, గుర్తింపు కార్డులు జారీ చేయాలి. కార్మిక శాఖ గుర్తింపు కార్డు జారీ చేసిన వారినే పనిలో పెట్టుకోవాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలి. దీంతో వలస కార్మికుల పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి. తద్వారా వారి నేర చరిత్రను కూడా ఆరా తీసే అవకాశం ఉంటుంది. కాట్నపల్లి ఘటనలో పోలీసులు వేగంగా స్పందించడంతో నిందితుడిని పట్టుకోగలిగారు. లేదంటే నిందితుడి ఆచూకీ కూడా దొరికేది కాదు. ఈ ఘటనకు పాల్పడిన బిహార్‌ కూలీ వద్ద మధ్యప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తి ఆధార్‌ కార్డు లభించింది. సీసీ కెమెరా ఫుటేజీ కూడా నిందితుడిని గుర్తించేంతగా స్పష్టత లేదు. 


అనుమతి లేనివే అధికం

  • ఉమ్మడి జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమలైన బియ్యం మిల్లులు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించిన ఇటుక బట్టీలకు పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు లేవు. పెద్దపల్లి జిల్లాలోని 150 బియ్యం మిల్లుల్లో కేవలం మూడింటికి మాత్రమే అనుమతి ఉండటం గమనార్హం. 
  • ఇక భవన నిర్మాణ కార్మికులు మినహా ఇతర అసంఘటిత రంగాల కార్మికులను గుర్తించే కనీస కార్యాచరణ కూడా కార్మిక శాఖ చేపట్టడం లేదు. వలస కార్మికుల సంక్షేమాన్ని కూడా ఆ శాఖ విస్మరించింది. 
  • గతంలో ఇటుక బట్టీలు, బియ్యం మిల్లులకే పరిమితమైన వలస కూలీలు కొన్నేళ్లుగా వ్యవసాయ పనులకూ వస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాళ్లలో పని చేస్తున్నారు.
  • నైపుణ్యం కలిగిన కార్మికులు భవన నిర్మాణం, ఇంటీరియర్‌ డిజైనింగ్, మగ్గం వర్క్, బంగారు అభరణాల తయారీ వంటి పనులు చేస్తున్నారు. 
  • గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, డెయిరీలతో పాటు మిల్లుల్లో ఆపరేటర్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్ల డ్రైవర్లుగానూ పని చేస్తున్నారు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని