logo

జీవన యోగం

 శారీరక శ్రమ తగ్గడం.. మానసిక ఒత్తిడి పెరగడం.. ఆధునిక యుగంలో ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు, పాశ్చాత్య ఆహారపు అలవాట్లతో వయసుతో సంబంధం లేకుండా ప్రజలు ఉబకాయం, రక్తపోటు, మధుమేహం, ఇతర రోగాలు బారిన పడుతున్నారు.

Published : 21 Jun 2024 05:11 IST

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఆసనం వేస్తున్న ఆమని

 శారీరక శ్రమ తగ్గడం.. మానసిక ఒత్తిడి పెరగడం.. ఆధునిక యుగంలో ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు, పాశ్చాత్య ఆహారపు అలవాట్లతో వయసుతో సంబంధం లేకుండా ప్రజలు ఉబకాయం, రక్తపోటు, మధుమేహం, ఇతర రోగాలు బారిన పడుతున్నారు. ఆరోగ్య సిద్ధి, క్రీడాకారులకు గుర్తింపు, యువత లక్ష్యసాధనకు యోగా ఎంతో ఉపయోగపడుతోంది. ప్రభుత్వం యోగాను క్రీడా కోటాలో చేర్చడంతో ఉన్నత చదువులు, ఉద్యోగాలు, మానసిక ఉల్లాసానికి యువత యోగా చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కథనం..

జాతీయ స్థాయిలో సత్తా

కోరుట్ల: గంగాధర మండలం పూడూర్‌ గ్రామానికి చెందిన జి.చైతన్య కోరుట్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(బాలుర)లో పదో తరగతి చదువుతున్నాడు. రెండేళ్లుగా యోగా సాధన చేస్తున్నాడు. కరీంనగర్, సిరిసిల్ల, నల్గొండ, కడ్తల్, సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. మూడుసార్లు రాష్ట్ర స్థాయిలో మొదటిస్థానంలో నిలిచి బంగారు, రెండుసార్లు ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. రాష్ట్ర స్థాయిలో మొదటిస్థానంలో నిలవడంతో గతేడాది గోవా, పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిత్యం వహించి చక్కటి ప్రతిభ కనబర్చి ప్రశంసాపత్రాలు అందుకున్నాడు.

2023లో పంజాబ్‌లో జాతీయ స్థాయి అవార్డు అందుకుంటున్న ఆమని

బంగారు పతకాలు

కోరుట్ల: మల్లాపూర్‌ మండలం చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన బోడ హన్షిత్‌ కోరుట్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల(బాలుర) పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. హన్షిత్‌ రెండేళ్లుగా పాఠశాలలో యోగాలో శిక్షణ తీసుకున్నాడు. సిరిసిల్ల, కరీంనగర్, నల్గోండ, కడ్తల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో రెండుసార్లు మొదటిస్థానంలో నిలవడంతో రెండు బంగారు పతకాలు, ద్వితీయ స్థానంలో నిలవడంతో రెండు రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. గతేడాది పంజాబ్‌లో స్కూల్‌ గేమ్స్‌లో పాల్గొని యోగాలో చక్కని ప్రదర్శన ఇవ్వడంతో ప్రశంసాపత్రం అందుకున్నాడు.

ఒక్క మాత్ర కూడా వేసుకోలే

జమ్మికుంట: జమ్మికుంటలోని అడ్తీవ్యాపారుల సంఘం భవనంలో 13 సంవత్సరాల కిందట యోగా కేంద్రాన్ని ప్రారంభించాను. నాటి నుంచి స్థానికులు పరిసర ప్రాంతాలకు చెందిన వారు యోగా నేర్చుకుంటున్నారు. అత్యధికులు 40 నుంచి 70 సంవత్సరాలు దాటిన పురుషులు, మహిళలు నిత్యం యోగా చేసేందుకు వస్తున్నారు. 72 సంవత్సరాల దాటినా ఇప్పటి దాకా ఒక్క మాత్ర వేసుకోలేదు. నిత్యం యోగాతో రక్త ప్రసరణ సరిగా జరగటంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం సాధ్యమవుతుంది. ధ్యానం, ఆసనాలు, సూర్య నమస్కారాలు, తదితరపై ఉచిత శిక్షణ ఇస్తున్నా.

మచ్చగిరి నరహరి, యోగా గురువు

నాలుగేళ్లుగా సాధన.. 

కరీంనగర్‌ క్రీడావిభాగం: కరోనా సమయంలో యోగా ప్రాముఖ్యత తెలిసింది. యోగాలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి యోగాపై అవగాహన కల్పించి సాధ్యమైనంత మందికి నేర్పించాలని కరీంనగర్‌ క్రీడా పాఠశాలలో చదువుతూ నాలుగేళ్లుగా యోగా సాధన చేస్తున్నాను. 2023 సెప్టెంబర్‌లో గోవాలో జరిగిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాను. 2023లో తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో 3వ స్థానం సాధించాను. జిల్లా స్థాయిలో జరిగిన యోగా పోటీల్లో నాలుగు సార్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాను..

 కె.మధులిక, ప్రాంతీయ క్రీడా పాఠశాల

40 ఏళ్లుగా...      

హుజూరాబాద్‌ గ్రామీణం: హుజూరాబాద్‌కు చెందిన 80 ఏళ్ల కొమురవెల్లి సదానందం 40 ఏళ్లుగా యోగా సాధన చేస్తున్నాడు. నిత్యం ఉదయం 5 నుంచి 6.30 గంటల వరకు సూర్య నమస్కారాలతో పాటు యోగాసనాలు సాధన చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరలేదంటున్నాడు. యోగా సాధనతోనే తాను ఆరోగ్యంగా ఉంటున్నానని చెబుతున్నాడు. పాఠశాలల్లో యోగా సాధనను అమలు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు.

యోగాసనాలు సాధన చేస్తున్న సదానందం

 సదానందం

పాఠశాల విద్యార్థులకు..

కమాన్‌పూర్‌: కమాన్‌పూర్‌ మండలం గుండారం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తడన్ల మల్లయ్య. సర్టిఫైడ్‌ టీచర్‌గా యోగాలో శిక్షణ పొందారు. మూడు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు సెలవు రోజు ఉదయం 5-7 గంటల వరకు పాఠశాలలో ఉన్నప్పుడు సాయంత్రం 4-6 వరకు విద్యార్థులకు యోగాసనాలు నేర్పిస్తున్నారు.  2022లో రాష్ట్ర స్థాయి 9వ యోగా ఛాంపియన్‌ షిప్‌లో సాహిత్‌ అనే విద్యార్థి వెండి పథకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికై పంజాబ్‌లోని ఫిరోజాపూర్‌లో పాల్గొన్నారు. 2019లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో జంగిలి లవేంద్ర బంగారు పతకాన్ని సాధించగా, దామెర మారుతి వెండి పతకాన్ని అందుకున్నారు.

ఆసియా పోటీలకు అర్హత

గోదావరిఖనికి చెందిన హసీనా ఆసియా దేశాల స్థాయి పోటీలకు అర్హత సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఏడుసార్లు ప్రథమ స్థానం, జాతీయ స్థాయిలో ఒకసారి, జాతీయ స్థాయి ఫెడరేషన్‌ పోటీల్లో మొదటి స్థానం దక్కించుకున్నారు.  ప్రతీరోజు క్రమం తప్పకుండా ఆసనాలు వేయడంతో పాటు శిక్షణ ఇస్తున్నారు.

హసీనా

పదేళ్ల అనుభవం..

గోదావరిఖని ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డి పదేళ్లుగా యోగా సాధన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకున్న ఆయన ప్రతిరోజు ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు. తనదైన ప్రతిభతో యోగాలో రాణిస్తున్నారు.

గోదావరిఖని

ఆన్‌లైన్‌ ద్వారా...

సుల్తానాబాద్‌: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలకేంద్రం మార్కండేయకాలనీకి చెందిన జాపతి రాజిరెడ్డి-సరోజన దంపతుల కూతురు ఆమని ఓవైపు పీజీ(జువాలజీ) పూర్తిచేసి మరోవైపు యోగాలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. ఎటువంటి శిక్షకులు లేకుండానే ఆన్‌లైన్‌లో చూస్తూ మూడేళ్లుగా స్వయంగా యోగాసనాలు చేస్తూ యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మూడుసార్లు బంగారు పతకాలు సాధించారు.

ఈనెల 27 నుంచి నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ యోగా పోటీల్లో పాల్గొననుంది. ఖేల్‌ యువరత్న పురస్కారం పొంది హైదరాబాద్‌లో సొంతగా యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.

శస్త్రచికిత్స లేకుండా ఉపశమనం

కరీంనగర్‌ క్రీడావిభాగం: 10 ఏళ్ల కిందట నాకు కడుపులో పేగులకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడటంతో వైద్యులను సంప్రదిస్తే శస్త్రచికిత్స అవసరమని సూచించారు. చాలా ఆందోళనలో ఉండగా నా కుమార్తె ప్రమీల సూచన మేరకు 10 ఏళ్లుగా యోగాసనాలు సాధన చేస్తున్నాను. యోగాసనాలు వేయడం ప్రారంభించిన కొన్ని రోజులకే పేగులకు సంబంధించిన సమస్య నుంచి ఉపశమనం లభించింది. నిత్యం ప్రాణాయామం, ధ్యానం, చిన్న చిన్న యోగాసనాలు చేస్తున్నాను.  

గోలకొండ లక్ష్మి భగత్‌నగర్‌


24 ఏళ్లుగా శిక్షణ

నీటిలో యోగాసనాలపై శిక్షణ ఇస్తున్న యోగా గురువు 

మెట్‌పల్లి పట్టణం: మెట్‌పల్లి పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన సైకాలాజిస్ట్‌ డాక్టర్‌ రాజారత్నాకర్‌కు చిన్నతనం నుంచే యోగాపై ఆసక్తి. బెంగళూర్‌లోని రుషి ప్రభాకర్‌ గురూజీ వద్ద యోగా శిక్షణ తీసుకున్నాడు. మెట్‌పల్లిలో సిద్ధ సమాధి యోగా(ఎస్‌ ఎస్‌ వై) కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నాడు. మెట్‌పల్లితో పాటు వివిధ ప్రాంతాలలో యోగాపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాడు. నీటిలోనే శవాసనం, తాడాసనం, సూర్య నమస్కార ఆసనం, పద్మాసనం, వృక్షాసనం, మకరాసనం, పవన ముక్తాసనం, ధనురాసనం ఇలా వివిధ రకాల ముద్రాసనాలు వేస్తున్నాడు. నీటిలో యోగాసనాలు వేస్తే రుగ్మతలు తొలగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని రాజారత్నాకర్‌ పేర్కొన్నారు. మెట్‌పల్లితో పాటు ఖానాపూర్, కథలాపూర్, ఆర్మూర్, కమ్మర్‌పల్లి, భీంగల్‌ తదితర ప్రాంతాల నుంచి నుంచి ప్రజలు, యువకులు, విద్యార్థులు, చిన్నారులు వచ్చి శిక్షణ పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు