logo

ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో నకిలీ యాప్‌లతో మోసం

ఆన్‌లైన్‌ చెల్లింపుల పేరుతో నకిలీ యాప్‌లతో మోసం చేస్తున్న ఉదంతం ఇది. బాధితుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణం గోపాల్‌నగర్‌లో ఇద్దరు యువకులు గురువారం ద్విచక్రవాహనంపై ఓ పాన్‌షాప్‌ వద్దకు వెళ్లారు.

Updated : 21 Jun 2024 05:28 IST

సీసీ ఫుటేజీలో బైక్‌పై అనుమానిత యువకులు

సిరిసిల్ల గ్రామీణం: ఆన్‌లైన్‌ చెల్లింపుల పేరుతో నకిలీ యాప్‌లతో మోసం చేస్తున్న ఉదంతం ఇది. బాధితుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణం గోపాల్‌నగర్‌లో ఇద్దరు యువకులు గురువారం ద్విచక్రవాహనంపై ఓ పాన్‌షాప్‌ వద్దకు వెళ్లారు. 10 సిగరెట్‌ ప్యాకెట్లు, ఇతర సామగ్రి తీసుకున్నారు. డబ్బుల చెల్లింపునకు దుకాణాదారుడి వద్ద ఆన్‌లైన్‌ చెల్లింపు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేశారు. అందులో వచ్చిన దుకాణాదారుడి పేరును, వెంటనే ఫేక్‌ యాప్‌లో టైప్‌ చేసి డబ్బులు పంపినట్లు చూపించి వెళ్లిపోయారు. ఈ నెల 16న మరో దుకాణం వద్ద ఇలానే చేశారు. డబ్బులు స్వీకరించినట్లు తెలిపే స్పీకర్లు లేని దుకాణాలను నిందితులు లక్ష్యంగా ఎంచుకొని మోసం చేస్తున్నారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. ద్విచక్రవాహనంపై తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు యువకులపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.


గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ పైనుంచి పడి..
కార్మికుడి దుర్మరణం

గసికంటి పోచయ్య

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌పై నుంచి కిందపడటంతో కార్మికుడు మృతి చెందిన ఘటన వేములవాడ గ్రామీణ మండలం నూకలమర్రిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గసికంటి పోచయ్య (65) గ్రామ పంచాయతీ మల్టీపర్పస్‌ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌పై వెళ్తుండగా మూలమలుపు వద్ద ట్రాక్టర్‌ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో ట్రాక్టర్‌పై కూర్చున్న పోచయ్య కిందపడ్డారు. తలకు తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోచయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ సిరిసిల్ల గ్రామ పంచాయతీ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డీపీవో వీరబుచ్చయ్య, డీఎల్పీవో నరేశ్, ఎండీవో శ్రీనివాస్, తహసీల్దారు సుజాత, ఎంపీవో రమేశ్‌లు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు పోచయ్య కుటుంబానికి తక్షణ సాయంగా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా రూ.50 వేలు మంజూరు చేయడంతో తహసీల్దారు బాధిత కుటుంబ సభ్యులకు సంబంధిత చెక్కును అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని