logo

సరిగమ పదనిసల సయ్యాట!

భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆహ్లాదపరిచే కళ సంగీతం. సృష్టిలో దాని స్థానం అద్వితీయం. ప్రపంచంలో మానవుల సర్వసామాన్య భాష ఇది. తోలుబొమ్మలాట నుంచి సినిమా రంగం వరకు సంగీతానికి ప్రాధాన్యత తగ్గలేదు.

Published : 21 Jun 2024 05:19 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం

భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆహ్లాదపరిచే కళ సంగీతం. సృష్టిలో దాని స్థానం అద్వితీయం. ప్రపంచంలో మానవుల సర్వసామాన్య భాష ఇది. తోలుబొమ్మలాట నుంచి సినిమా రంగం వరకు సంగీతానికి ప్రాధాన్యత తగ్గలేదు. అది సంప్రదాయ సంగీతమైన.. ఆధునిక సంగీతమైన దానికి చోటు ఉండాల్సిందే. సంగీతంతో కొంతమంది ఉపాధి పొందుతున్నారు.. మరికొందరు దీనిని జీవితంలో భాగం చేసుకున్నారు. సంగీత మాధుర్యాన్ని సొంతం చేసుకొని ఎందరో కళాకారులు తోటివారికి ఆనందం పంచుతున్నారు. నేడు ప్రపంచ సంగీతం దినోత్సవం సందర్భంగా మన జిల్లాలోని సంగీత ప్రియులపై న్యూస్‌టుడే కథనం.


న్యాయవాది కావాలనుకుని గాయకురాలిగా..

కరీంనగర్‌లోని మంకమ్మతోటకు చెందిన హన్మయ్య-మంజుల దంపతుల కూతురు నారెళ్ల శ్రీనిధి. చిన్నతనంలో లాయర్‌ కావాలనుకని.. స్కూల్‌లో పాటలు పడటంతో సంగీతంపై ఆసక్తి పెంచుకుంది. 2015లో బతుకమ్మ పాటల పోటీల్లో మొదటి బహుమతి, 2018లో రాష్ట్ర స్థాయి కళోత్సవాల్లో మూడో స్థానంలో నిలిచింది. బోల్‌ బేబీ బోల్‌ సెలక్షన్స్‌లో బాగా పాడి గ్రీన్‌ బ్యాండ్‌ అందుకుంది. కానీ పిలుపు రాలేదు. కజిన్‌ మానస క్లాస్‌మేట్‌ వెంకటేష్‌తో ‘ఓ సందమామ నా మేనబావ జాడలేడాయె..ఎదురురాడాయె’ పాట పాడి యూట్యూబ్‌లో విడుదల చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం ‘అద్దాల సీరగట్టి అందాల రైక తొడిగి సెంద్రవంక బొట్టుపెట్టి’  ‘సిలకపచ్చ సీరగట్టి ఓ సిన్నదాన సిన్నంగవోత ఉంటే సక్కాని భామ’ జానపద పాటలు ఆమెకు బ్రేక్‌ ఇచ్చాయి. 70 పాటలు పాడగా.. మరో పది పాటలు విడుదల కావాల్సి ఉన్నవి. ఆమె పాడిన పాటల్లో ‘సెలయేళ్లు పారుతుంటే ఓ పిల్ల.. ఎదగూళ్లూగుతుండే లోలోన’ బాగా వైరల్‌ అయ్యింది. కర్ణాటక సంగీతంలో డిప్లొమా పూర్తి చేసి సింగర్‌గా స్థిరపడాలన్నదే నా జీవిత లక్ష్యంగా పేర్కొంది శ్రీనిధి.


 ఆరో తరగతిలోనే ప్రపంచ అవార్డు..

రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి బహుమతి అందుకుంటున్న అభినవ్‌

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీకి చెందిన నూకల వినోదిత-గిరిబాబు దంపతుల కూతూరు శ్రేయాన్సీ. తండ్రి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వీరు మద్రాస్‌లో ఉంటున్నారు. శ్రేయాన్సీ అక్కడే ఆరో తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచే గాయత్రీ, సీతారాజన్‌ దగ్గర సంగీత శిక్షణ తీసుకుంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకుంది. ఇటీవల ముంబాయిలో జరిగిన ప్రపంచ స్థాయిలో పోటీలో మొదటి బహుమతి కింద సూపర్‌ స్టార్‌ అవార్డును ప్రముఖ సంగీత విధ్వంసులు ఉన్నికృష్ణన్, సోను నిగమ్, సంగీత దర్శకుడు లూయిజ్‌ బాంక్‌ చేతుల మీదుగా అందుకుంది.


అయిదు ఆల్బమ్స్‌లో పాటలు..

ఉన్నీకృష్ణన్, సోను నిగమ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న శ్రేయాన్సీ

అక్కినపెల్లి అభిరాం కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ ఈ-టెక్నో స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. కుమారుడి అభిరుచి గమనించిన తల్లిదండ్రులు శివజ్యోతి, నాగరాజులు కేబీ.శర్మ వద్ద గాత్ర సంగీతం నేర్పిస్తున్నారు. శర్మతో కలిసి అభిరాం సంగీత కచేరిలకు వెళ్తున్నాడు. ఇప్పటి వరకు 5 ఆల్బమ్స్‌లో పాటలు పాడాడు. ఇటీవల హనుమకొండలో తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎన్రోల్‌మెంట్‌ ప్రొటెక్షన్, ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ వారు రాష్ట్ర స్థాయిలో పాటల పోటీలు నిర్వహించారు. ఇందులో అభిరామ్‌ మొదటి బహుమతి సాధించి జిల్లాకు పేరు తీసుకొచ్చారు.


నాన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని..

తండ్రి గాయకుడు.. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండటంతో ఆ వారసత్వమే కరీంనగర్‌కు చెందిన శ్రీకృతి పుణికిపుచ్చుకుంది. చిన్నతనంలో భగవద్గీత గీతాలను వింటూ ఆలపించడం తల్లిదండ్రులు శ్రీనివాసరావు, దీపలు గమనించారు. మూడేళ్ల వయస్సు నుంచే అన్నమయ్య కీర్తనలు నేర్పించారు. దీంతో 2015 వరంగల్‌లో సరిగమ పదనిస కార్యక్రమంలో మూడో స్థానంలో, 2017 జెమినీ బోల్‌ బేబీ బోల్‌లో విజేతగా నిలిచింది. అప్పటి నుంచి హైదరాబాద్‌కు చెందిన వైజర్స్‌ బాలసుబ్రహ్మణ్యం దగ్గర ఆన్‌లైన్‌ సంగీతం నేర్చుకుంటుంది. ప్రస్తుతం ఈటీవీలో నిర్వహిస్తున్న మహాసంగ్రామ పాడుతా తీయగాకు కార్యక్రమంలో మూడు ఎపిసోడ్‌లు పూర్తి చేసి ముందుకు సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని