logo

48,357 మంది రైతులు.. రూ.569.78 కోట్ల చెల్లింపులు

జిల్లాలో యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. రైతులు ఆశించిన దానికంటే దిగుబడులు ఈసారి తక్కువగా వచ్చాయి.

Published : 21 Jun 2024 05:30 IST

జిల్లాలో పూర్తయిన ధాన్యం కొనుగోళ్లు
న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం

తంగళ్లపల్లిలో కొనుగోలు చేసిన ధాన్యం 

జిల్లాలో యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. రైతులు ఆశించిన దానికంటే దిగుబడులు ఈసారి తక్కువగా వచ్చాయి. జిల్లాలో ప్రస్తుత యాసంగిలో అధికారులు 259 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వీటి ద్వారా కొనుగోళ్లు పూర్తి అయ్యేవరకు 2,61,756.700 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ సీజన్‌లో అధికారులు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులు ఆశించిన దానికంటే తక్కువ స్థాయిలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చింది. మరోవైపు అకాల వర్షాలకు కొంతమేర ఇబ్బందులు తలెత్తినా చివరకు కొనుగోళ్లు పూర్తిచేశారు.

గతేడాదే ఎక్కువ..

జిల్లాలో ధాన్యం సేకరణ కోసం అధికారులు ఐకేపీ, ప్యాక్స్, డీసీఎంఎస్, మెప్మా, ఏఎంసీల ద్వారా 259 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది యాసంగిలో జిల్లాలో 253 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుత యాసంగిలో అకాల వర్షాలు, వడగండ్ల వానతో పంటలు కొంత మేరకు దెబ్బతినగా, సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. ఇప్పటి వరకు జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలు ఎర్పాటు చేయగా, అకాల వర్షాలు తగ్గిన తర్వాత ఇప్పటి వరకు జిల్లాలో 2,61,756.700 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇప్పటి వరకు 48,842 మంది రైతుల నుంచి రూ.576.65 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 48,357 మంది రైతులకు సంబంధించి రూ.569.78 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 485 మంది రైతులకు రూ.6.87 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.

కేంద్రాల మూసివేత 

జిల్లాలో ఏర్పాటు చేసిన 259 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసేశాం. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశాం. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో జమ ప్రక్రియ ముగుస్తుంది. 

 జితేందర్‌రెడ్డి, డీఎస్‌వో, సిరిసిల్ల

జిల్లాలో సేకరణ వివరాలు

  •  ధాన్యం కొనుగోలు కేంద్రాలు : 259
  • విక్రయించిన రైతుల సంఖ్య : 48,842
  • సేకరించిన ధాన్యం : 2,61,756.700 మెట్రిక్‌ టన్నులు
  • సేకరించిన ధాన్యం విలువ : 576.65 కోట్లు   
  •  రైతుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులు :  రూ.569.78 కోట్లు  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని