logo

ఆసనాలే శ్వాసగా ఆరోగ్యరక్షణ

ప్రస్తుత వైద్య విధానం వ్యాధి తీవ్రతను తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. శరీరంలోని హార్మోన్‌ల సమతుల్యతను కాపాడి, వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ఏ వ్యాధి విధానంలోనూ సాధ్యపడటం లేదు.

Updated : 21 Jun 2024 06:33 IST

నిత్య సాధనతో వ్యాధుల నుంచి ఉపశమనం
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
న్యూస్‌టుడే, పెద్దపల్లి

ప్రస్తుత వైద్య విధానం వ్యాధి తీవ్రతను తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. శరీరంలోని హార్మోన్‌ల సమతుల్యతను కాపాడి, వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ఏ వ్యాధి విధానంలోనూ సాధ్యపడటం లేదు. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వారికి యోగా వరంగా మారింది. మారిన జీవన విధానంలో పెరిగిన శారీరక, మానసిక ఒత్తిళ్లను అధిగమించి, వ్యక్తుల సమగ్ర ఆరోగ్యానికి యోగా రక్షణ కవచమవుతోంది.

యోగాసనాలు వేస్తున్న మహిళలు

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా యోగాకు ఆదరణ పెరుగుతోంది. శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిత్యం ఆసనాలు అలవాటుగా చేసుకొని వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతున్న పెద్దపల్లికి చెందిన పలువురు మహిళల అభిప్రాయాలివి..


కీళ్ల వాతం 75 శాతం తగ్గింది

ఆరు నెలల కిందట కీళ్ల వాతం రావడంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. పలు ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో యోగా గురించి తెలుసుకొని రెండు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నాను. మొదట్లో రెండంతస్తుల భవనం మెట్లు ఎక్కడానికి గంట సమయం పట్టేది. ప్రస్తుతం ఒక్క నిమిషంలో రెండు ఫ్లోర్‌లు ఎక్కగలుగుతున్నాను. ప్రాణాయామం, మర్మథెరపీ, ముద్రలు తదితర విదానాలతో రెండు నెలల వ్యవధిలో వ్యాధి 75 శాతం తగ్గిపోయింది.

పైడ మహేశ్వరి

అస్తమా నుంచి స్వస్థత

పదేళ్లుగా అస్తమాతో బాధ పడుతున్నా. ఇంట్లో అందరూ ఏసీలో పడుకుంటే నేను బయట నిద్రించాల్సి వచ్చేది. నిద్రలోనూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేదాన్ని. ఆరేళ్లుగా సమస్య తీవ్రం కావడంతో ఎటైనా వెళ్లాల్సి వస్తే ఇన్‌హీలర్‌తో పాటు నెబ్యులైజర్‌ కూడా వెంట తీసుకెళ్లాల్సి వచ్చేది. ఆస్పత్రుల్లో చూపించుకున్నా ప్రయోజనం లేకపోయింది. పైగా మందులతో సైడ్‌ ఎఫెక్ట్స్‌. మూడేళ్ల కిందట యోగా కేంద్రానికి వచ్చి, బ్రీతింగ్‌ థెరపీతో పాటు ఆసనాలు అలవాటుగా చేసుకోవడంతో అస్తమా సమస్య తగ్గింది.

నాళ్ల శ్రీలక్ష్మి

అవయవాల క్రియాశీలతకే ఆసనాలు

శరీరంలో అదుపు తప్పిన హార్మోన్లను నియంత్రణలోకి తేవడానికి యోగా థెరపీ ఉపయోగపడుతుంది. రసాయనిక చర్యలను సమతుల్యం చేయడానికి ఒక్కో గ్రంథిని ఒక్కో రకంగా క్రియాశీలం చేయాల్సి ఉంటుంది. ఈ విధానాన్నే యోగా థెరపీగా పిలుస్తారు. ఈ ప్రక్రియలన్నీ శ్వాస ఆధారంగా వివిధ ఆసనాల ద్వారా నిర్వహిస్తాం. వివిధ అవయవాలను శాస్త్రీయ విధానంలో క్రియాశీలం చేయడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత తొలగిపోతుంది. ఉదాహరణకు క్లోమ గ్రంథిని క్రియశీలం చేసి, ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయగలిగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. మర్మ థెరపీ, యోగా థెరపీ ద్వారా గ్రంథులు, అవయవాలను ప్రేరణలోకి తీసుకురావడం సుసాధ్యమే. ఇదే యోగా వైద్య విధానంలోని రహస్యం.

రాంప్రసాద్‌ గురూజీ, యోగా శిక్షకుడు

సయాటికా సమస్య పోయింది

పదేళ్ల క్రితం సయాటికా సమస్య మొదలైంది. ఎల్‌ 4, ఎల్‌ 5 ఎముకల మధ్య సమస్య ఉత్పన్నం కావడంతో నొప్పి వచ్చేది. సమస్య తగ్గించుకోవడానికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. రెండేళ్ల కిందట యోగా గురించి తెలుసుకొని, యోగా కేంద్రంలో చికిత్స పొందుతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయాయి. కంజీరా ఎక్కువగా వాయించినా భుజం నొప్పి వచ్చేది. ఆ సమస్య కూడా తొలగిపోయింది. గుండె సంబంధిత సమస్య కూడా తగ్గింది.

మంచాల మానస

మూడేళ్లలో 25 కిలోల బరువు తగ్గా..

మూడేళ్ల కిందటి వరకు స్థూలకాయం సమస్య వేధించేది. 90 కిలోల బరువుండేదాన్ని. దీంతో పాటు సైనసైటిస్‌ సమస్య బాధించేది. క్రమం తప్పకుండా ఆసనాలు వేయడంతో సైనస్‌ తగ్గడంతో పాటు బరువు అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం 65 కిలోల బరువున్నా. రెండేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో చేయి విరిగిపోవడంతో యోగా చేయగలనా? అనే సందేహం కలిగింది. వ్యాధులు తిరగబెడతాయేమోననే భయం వెంటాడింది. కానీ సులభమైన చిట్కాలతో తిరిగి పూర్తి స్థాయిలో సాధన చేయగలుగుతున్నా.

ఎ.వీణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు