logo

పెరిగిన ప్రయోజనాలు అందేనా!

సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత కార్మికులకు పెరిగిన వేతన సవరణకు సంబంధించిన ప్రయోజనాలు అందలేదు. 2023 మే 20న పదకొండో వేతన సవరణ ఒప్పందం కుదిరింది.

Published : 21 Jun 2024 05:40 IST

విశ్రాంత కార్మికుల నిరీక్షణ
న్యూస్‌టుడే, గోదావరిఖని

సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత కార్మికులకు పెరిగిన వేతన సవరణకు సంబంధించిన ప్రయోజనాలు అందలేదు. 2023 మే 20న పదకొండో వేతన సవరణ ఒప్పందం కుదిరింది. 2021 జులై 1 నుంచి మొదలు కావాల్సిన పదకొండో వేతన సవరణ 22 నెలలు ఆలస్యంగా జరిగింది. కనీస వేతనం 19 శాతానికి పెంచుతూ ఒప్పందం చేసుకున్న కార్మిక సంఘాలు కొత్త వేతనాలను 2023 జూన్‌ నెల నుంచి కార్మికులకు అందజేస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు బకాయిలు మాత్రమే చెల్లించారు. పెరిగిన వేతనాల ప్రకారం పెరిగే సీఎంపీఎఫ్‌తో పాటు పింఛను పంపిణీ చేయడం లేదు. 2023 జూన్‌ నుంచి కొత్త వేతనాలను అమలు చేస్తున్న యాజమాన్యం కార్మికులకు పెరిగిన వేతనాల ప్రకారం బకాయిలు కూడా చెల్లించింది. విశ్రాంత కార్మికులకు పెరిగిన వేతనాల ప్రకారం సీఎంపీఎఫ్, పింఛను పంపిణీ చేయకపోవడంతో వాటి కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. పదకొండో వేతన ఒప్పందం జరిగి ఏడాది గడచినా ఇప్పటి వరకు పింఛను, సీఎంపీఎఫ్‌ బకాయిలు చెల్లించడం లేదని వాపోతున్నారు. దీనిపై జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఒత్తిడి తేవాలని కోరుతున్నారు.

1500 మందికి పైగా...

సింగరేణి వ్యాప్తంగా 1500 మందికి పైగా విశ్రాంత కార్మికులకు పెరిగిన వేతనాల ప్రకారం పింఛను, సీఎంపీఎఫ్‌ డబ్బులు రావాల్సి ఉంది. 2021 జులై 1 నుంచి అమలు కావాల్సిన పదకొండో వేతన సవరణ 22 నెలలు ఆలస్యంగా జరిగింది. 2023 మే 20న ఒప్పందం కుదరడంతో అప్పటి వరకు సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు పెరిగిన వేతనాల ప్రకారం పింఛనులో కొంత పెరుగుదల ఉంటుంది. దీంతో పాటు సీఎంపీఎఫ్‌ నిల్వలో సైతం మార్పు ఉంటుంది. వేతన సవరణకు ముందే ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు, ఉద్యోగులకు సవరించిన మేరకు పింఛనులో పెరుగుదల ఉంటుంది. సీఎంపీఎఫ్‌ నిల్వలో కొంత పెరుగుదల ఉండే అవకాశం ఉన్నా వాటిని చెల్లించేందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

వచ్చే నెలలో సవరించే అవకాశం

పెరిగిన వేతనాల ప్రకారం పింఛను, సీఎంపీఎఫ్‌ బకాయిలను వచ్చే నెల వరకు సవరించే అవకాశం ఉంది. ఫారం వి పూరించి పంపించాలి. ఆ ప్రక్రియ మొదలైంది. పదకొండో వేతన సవరణకు సంబంధించి పెరిగిన జీతభత్యాల ప్రకారం పింఛనులో కొంత మార్పు ఉంటుంది. ప్రస్తుతం పదో వేతన సవరణ ప్రకారం విశ్రాంత కార్మికులకు పింఛను చెల్లిస్తున్నారు. కొత్త వేతనాల ప్రకారం సవరించడం ద్వారా కొంత వరకు పింఛను పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ వచ్చే నెల వరకు పూర్తవుతుంది. 

వి.సీతారామయ్య, ఏఐటీయూసీ నాయకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని