logo

అనుమతుల్లేకుండానే ఆసుపత్రుల నిర్వహణ

రోగులు, వారి సంబంధీకులకు అవసరమైన మౌలిక వసతులు కనిపించవు.. ప్రభుత్వ అనుమతులుండవు.. నిబంధనలు పాటించరు.. రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా, ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతాయి.. ఇదీ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల పరిస్థితి.

Updated : 21 Jun 2024 06:07 IST

బినామీ పేర్లతో ప్రైవేటులో ప్రభుత్వ వైద్యుల సేవలు
ఈనాడు, పెద్దపల్లి

గోదావరిఖనిలోని స్కానింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు (పాతచిత్రం) 

రోగులు, వారి సంబంధీకులకు అవసరమైన మౌలిక వసతులు కనిపించవు.. ప్రభుత్వ అనుమతులుండవు.. నిబంధనలు పాటించరు.. రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా, ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతాయి.. ఇదీ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల పరిస్థితి.

వైద్యారోగ్య శాఖ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు వచ్చాకే సేవలు ప్రారంభించాల్సి ఉండగా వైద్యులు కనీసం దరఖాస్తు కూడా చేయకముందే స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో దర్జాగా ప్రైవేటు ఆసుపత్రులు ప్రారంభిస్తున్నారు. కొందరు అనుమతి కోసం వైద్యారోగ్యశాఖలో దరఖాస్తులు చేసినా అనుమతులు రాకముందే రోగులకు చికిత్స మొదలుపెడుతున్నారు. జిల్లాలోని రామగుండం, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లో ఇప్పటికే వైద్య సేవలందిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు లేవని స్వయంగా వైద్య శాఖ ఉన్నతాధికారులే చెబుతుండటం గమనార్హం. ప్రభుత్వ వైద్యులు నిర్ణీత వేళల్లో సర్కారు దవాఖానాల్లో అందుబాటులో ఉండాలి. అయితే బినామీ పేర్లపై అనుమతులకు దరఖాస్తు చేసుకొని సొంత ఆస్పత్రులు ప్రారంభించి ఎక్కువ సమయం అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మౌలిక వసతులు కరవు

జిల్లావ్యాప్తంగా 50 శాతం ప్రైవేటు ఆస్పత్రుల్లో అగ్నిమాపక పరికరాలు, కాలుష్య నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఇటీవల జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పలు ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహనకు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. చాలా చోట్ల అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ఉన్నా కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్తవి అమర్చకపోవడం, నిర్వహణ లోపం చూసి విస్తుపోయారు. నిబంధనల మేరకు పెద్ద ఆసుపత్రులకు పార్కింగ్, విశాలమైన భవనం, సిబ్బంది విద్యార్హతలు.. ఇలా ప్రతి అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులుండాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఇరుకు గదుల్లో నిర్వహిస్తూ, ఏ వ్యాధికి ఎంత రుసుము వసూలు చేస్తున్నారు? అనే విషయాలపై సూచికలు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఒక వైద్యుడి పేరుతో అనుమతి ఉంటే, మరో వైద్యుడు సేవలందిస్తుంటారు. కనీస మౌలిక వసతుల్లేని ఆసుపత్రులు కూడా కార్పొరేట్‌ స్థాయి రుసుములు వసూలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ వైద్యులు సర్కారు దవాఖానకు వచ్చిన రోగులను మెరుగైన చికిత్సల పేరిట తమ ఆసుపత్రికి ‘రిఫర్‌’ చేస్తూ ఆర్‌ఎంపీ, పీఎంపీలతో కమీషన్ల దందాకు తెర తీస్తున్నారు.

నోటీసులకే పరిమితం

  •  గతేడాది జనవరి 20న గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని ఓ ఆస్పత్రి పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా ఎంఆర్‌ఐ స్కానింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వైద్యారోగ్య శాఖ అధికారులు వెళ్లి తనిఖీలు చేశారు. అనుమతులు లేకపోవడంతో కేంద్రాన్ని సీజ్‌ చేశారు.
  •  పెద్దపల్లి కూనారం క్రాస్‌ రోడ్డులోని ఓ ఆసుపత్రిని కొన్ని నెలల కిందట అధికారులు తనిఖీలు చేసి అనుమతులు లేకపోవడంతో నోటీసులు ఇచ్చి మూసేశారు. ఇప్పుడా ఆస్పత్రిలోనే వేరే పేరుతో మరో దవాఖానా ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రికి మాత్రం అన్ని రకాల అనుమతులు ‘అందజేసినట్లు’ అధికారులు చెబుతుండటం గమనార్హం.
  •  గతేడాది మంథని పురపాలిక పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా పిల్లలకు అనధికారికంగా వైద్యం నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రిపై స్థానికులు కొందరు జిల్లా వైద్యఆరోగ్య శాఖకు ఫిర్యాదులు చేశారు.
  •  జిల్లాలో 135 వరకు ప్రైవేటు ఆసుపత్రులుండగా 30 దవాఖానాలకు ప్రభుత్వ అనుమతులు లేవని గుర్తించారు. నిర్వాహకులకు పలుమార్లు నోటీసులు పంపించారు. కొందరు స్పందించి ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకుంటుండగా మరికొందరు పట్టించుకోకుండా వైద్యం నిర్వహిస్తున్నారు.
  •  ఈ విషయమై ‘ఈనాడు’ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ప్రమోద్‌కుమార్‌తో మాట్లాడగా అన్ని అనుమతులుంటేనే ఆసుపత్రి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగా జిల్లాలో 4 ఆసుపత్రుల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. త్వరలో అన్ని ఆసుపత్రులను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని