logo

ప్రత్యేక పాలన తప్పదా?

ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసింది. దాన్ని పొడిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. జులై 4న జిల్లా, మండల పరిషత్‌ ఛైర్మన్ల పదవీకాలం ముగియనుంది.

Published : 21 Jun 2024 05:49 IST

 జులై 4తో ముగియనున్న జిల్లా, మండల పరిషత్‌ అధ్యక్షుల పదవీకాలం
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయం

ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసింది. దాన్ని పొడిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. జులై 4న జిల్లా, మండల పరిషత్‌ ఛైర్మన్ల పదవీకాలం ముగియనుంది. వారిని కొనసాగిస్తారా? లేక ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారా? అనే విషయంపై చర్చ జరుగుతోంది.

వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు..

బీసీ జనగణన చేపట్టి ఆ తర్వాత గ్రామ పంచాయతీ, ప్రాదేశిక రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు చేపట్టాలని ఒక వైపు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదిలా ఉండగా గత ఎన్నికలు జరిగినప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లు పదేళ్లపాటు కొనసాగాలని అప్పటి ప్రభుత్వ చట్టం రూపొందించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విషయంలో ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరముంది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుస క్రమంలో రానున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

హస్తం పట్టు కోసం..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల జడ్పీ ఛైర్‌పర్సన్లుగా ముగ్గురు, ఛైర్మన్‌గా ఒకరు భారాస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జడ్పీటీసీ సభ్యులు కూడా ఆ పార్టీ పక్షాన ఎక్కువ మంది కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల క్రమంలో కొన్ని జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్‌ అధ్యక్షులు కొందరు భారాస వీడి కాంగ్రెస్‌లో చేరారు. కరీంనగర్‌ గ్రామీణం జడ్పీటీసీ సభ్యురాలు పురుమల్ల లలిత భర్త శ్రీనివాస్‌ భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరి.. కరీంనగర్‌ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇలా భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు ఉన్నారు. కొందరు ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి హస్తగతం చేసుకుంది. ప్రస్తుతం వీరి పదవీకాలం 15 రోజులు మాత్రమే మిగిలింది. తమ పదవులకు కొనసాగిస్తారనే ఆశ కొందరిలో ఉంది. కానీ కాంగ్రెస్‌ నేతలు ప్రజాప్రతినిధులు మాత్రం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్నట్లు సమాచారం. అధికారులను తమకు అనుగుణంగా మలచుకొని స్థానిక సంస్థలలో పాగా వేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని అక్టోబరు వరకు వేచి చూసే ధోరణిలో ఉండే అవకాశముంది. మరో వైపు ముఖ్యమంత్రి కూడా జిల్లాల పర్యటన చేపట్టి పార్టీని పటిష్ఠం చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి సమీక్షలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని