logo

నియంత్రికలపై పిడుగుపాటు

చిత్రంలోని రైతు పేరు రాజిరెడ్డి. మానకొండూర్‌ మండలం ఊటూరు గ్రామం.. ఒక ఎకరా వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పంట సాగు చేయాలనుకున్నారు.

Updated : 21 Jun 2024 06:06 IST

తరచూ కాలిపోతుండటంతో రైతుల ఇబ్బందులు
విద్యుత్తు సంస్థకు భారీ నష్టం
న్యూస్‌టుడే, భగత్‌నగర్‌

చిత్రంలోని రైతు పేరు రాజిరెడ్డి. మానకొండూర్‌ మండలం ఊటూరు గ్రామం.. ఒక ఎకరా వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పంట సాగు చేయాలనుకున్నారు. తన పొలానికి విద్యుత్తు సరఫరా చేసే నియంత్రిక కాలిపోవడంతో మొలక అలకని పరిస్థితి. ఇటీవల కురిసిన వానకు  పిడుగులు పడటంతో నియంత్రిక కాలిపోయింది. వ్యవసాయ పనులు మొదలుపెట్టలేకపోయారు. ఇది రాజిరెడ్డి సమస్యే కాదు. జిల్లా వ్యాప్తంగా రైతుల్లో సింహభాగం ఇదే పరిస్థితి. నారు మళ్లు ఎండిపోకుండా ట్రాక్టర్లలో నీటి తడిని అందిస్తున్నారు.

మరమ్మతుకు ఎక్కువ సమయం..

ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రుతుపవనాలు గాలితోపాటు భారీ పిడుగులను మొసుకొస్తున్నాయి. పిడుగుపాటుకు నియంత్రికలు కాలిపోతున్నాయి. వాటి స్థానంలో విద్యుత్తు అధికారులు కొత్తవి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నా.. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈదురుగాలులతో నియంత్రికలు, స్తంభాలు దెబ్బతింటున్నాయి. పిడుగుపాటుకు నియంత్రికలు కాలిపోకుండా లైటనింగ్‌ ఎరస్టర్స్‌  ఉన్నా.. అవీ కాలిపోతున్నాయి. విద్యుత్తు సంస్థకు నష్టం జరుగుతోంది. కాలిపోయిన వాటిని మరమ్మతు  చేయడానికి సమయం పట్టడంతో సకాలంలో అందివ్వలేని పరిస్థితి నెలకొంది.

కరీంనగర్‌ మరమ్మతు కేంద్రంలో నియంత్రికలు

గుత్తేదారుల నిర్లక్ష్యం..

జిల్లాలో తొమ్మిది నియంత్రికల మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. ఇందులో రెండు విద్యుత్తు సంస్థ ఆధ్వర్యంలో, మరో ఏడు కేంద్రాలు ప్రైవేటు గుత్తేదారుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. జిల్లాలో గుత్తేదారుల ఆధ్వర్యంలో నడిచే గంగాధరతోపాటు మరో రెండు కేంద్రాల్లో సరిగా మరమ్మతు చేయడంలేదని ఆరోపణలు ఉన్నాయి.

ఏడాది తేడాలో.. ఎంత నష్టమో..

గతేడాది జూన్‌లో 30 రోజులకు 315 నియంత్రికలు కాలిపోతే, ప్రస్తుతం 19వ తేదీ నాటికి 555 నియంత్రికలు కాలిపోయాయి. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. వీటిలో అధికంగా హైవోల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం(హెచ్‌వీడీఎస్‌) కింద ఏర్పాటు చేసిన 25 కేవీ నియంత్రికలు కాలిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసి సుమారు పదేళ్లకుపైగా గడవడంతో వాటి కంపెనీలు ఇచ్చిన గ్యారంటీ కాలపరిమితి ముగియడంతో సంస్థనే మరమ్మతు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వైపు పిడుగులు మరో వైపు గాలివానతో విద్యుత్తు సంస్థకు రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.

మూడు షిప్టుల్లో పని..

సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియంత్రికల మరమ్మతు కేంద్రాన్ని మూడు షిప్టుల్లో నిర్వహించి వేగంగా మరమ్మతు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం. గంగాధరలోని నియంత్రికల మరమ్మతు కేంద్ర గుత్తేదారుకు నోటీసు ఇచ్చాం. మిగతా చోట్ల వేగంగా పని చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

గంగాధర్, ఎస్‌ఈ, విద్యుత్తు సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని