logo

పదోన్నతుల్లో జాప్యం.. ఉపాధ్యాయుల్లో నైరాశ్యం

ఉపాధ్యాయుల పదోన్నతుల్లో నిరాశ.. బదిలీల్లో నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం శనివారంతో పూర్తి కావాల్సి ఉంది.

Updated : 23 Jun 2024 06:24 IST

విద్యార్థులు పెరిగిన చోట పోస్టుల కొరత 
బోధనపై తీవ్ర ప్రభావం

డీఈవోకు వినతిపత్రం అందిస్తున్న ఎల్‌పీ ఉపాధ్యాయులు 

ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో నిరాశ.. బదిలీల్లో నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం శనివారంతో పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మరిన్ని రోజులు ఆలస్యం అనివార్యం కానుంది. ఇది విద్యార్థుల చదువులపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023 అక్టోబరులో స్కూల్‌ అసిస్టెంట్లను పీజీహెచ్‌ఎంల పదోన్నతి జరిగింది. తర్వాత వీరి బదిలీలు జరుగుతుండగా న్యాయస్థానం తీర్పుతో నిలిచిపోయింది. తిరిగి ఈ నెల 8 నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది.

అయోమయం..!

జిల్లాలో లాంగ్వేజ్‌ పండిట్‌ (ఎల్‌పీ) పదోన్నతి, బదిలీలకు ఈ నెల 10న ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. దీనికి 220 మంది ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. హిందీలో 102 పోస్టులు ఉండగా 97 పోస్టులు స్కూల్‌ అసిస్టెంట్‌గా (ఎస్‌ఏ) అప్‌గ్రేడ్‌ అయ్యాయి. దీనికి అర్హులైన అందరూ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకున్నారు కానీ.. అంతర్గతంగా రోస్టర్‌ పద్ధతిని అమలు చేయడంతో 90 మంది ఎస్‌ఏలుగా పదోన్నతి పొందారు. మిగతా ఏడుగురు నిరాశలో ఉన్నారు. అలాగే తెలుగులో 105 మంజూరైన పోస్టులకు గాను 98 అప్‌గ్రేడ్‌ అయ్యాయి. వీటిలో 93 మంది ఎస్‌ఏలుగా పదోన్నతి పొందగా ఐదుగురికి కాలేదు. దీంతో వీరంతా శుక్రవారం డీఈవోను కలిశారు. అప్‌గ్రేడ్‌ అయిన వారంతా బదిలీల్లో భాగంగా పాఠశాలలకు వెళ్తున్నారు. పదోన్నతి పొందనివారు అదే పాఠశాలలో ఉండగా.. అక్కడికి పదోన్నతి పొందినవారు వచ్చి విధుల్లో చేరుతున్నారు. దీంతో వీరు ఎటువెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారు.
ః జిల్లాలో 928 ఎస్టీజీ పోస్టులకు ప్రస్తుతం 858 మంది పనిచేస్తున్నారు. స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియలో వెబ్‌ ఆప్షన్లు రెండు, మూడు చూపించారు. అందులో ఉపాధ్యాయులు మూడు చోట్ల ఆప్షన్‌ పెట్టుకున్నారు. కాగా అందులో ఒకచోటికి బదిలీ అయింది. మిగతా రెండు చోట్ల ఖాళీలు చూపుతోంది. ఈ ఖాళీలను ఎస్జీటీల బదిలీలకు ముందే భర్తీ చేయాలి. మరోవైపు ఎస్జీటీల బదిలీల కోసం విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారి నుంచి బదిలీ కోసం దరఖాస్తులు స్వీకరించారు. దీనిలో సీనియారిటీ జాబితాను విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణ, వెబ్‌ఆప్షన్ల ఎంపిక తర్వాత బదిలీ ఆర్డర్లు జారీ చేస్తారు.

  • ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో అంతర్గత రేషనలైజేషన్‌ విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే జిల్లాకు మంజూరైన పోస్టులకు పదోన్నతి కల్పించిన పోస్టులకు సరిపోవడంలేదు. దీని ప్రభావం రాబోయే రోజుల్లో జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు తగ్గుతాయి. దీనికి అనుగుణంగా విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలల్లో అదనపు పోస్టులను మంజూరు చేస్తున్నారా అంటే అదీలేదు. కేవలం సర్దుబాటుతోనే కాలం వెళ్లదీస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌ ఉన్నత పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం 310 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ఎనిమిది మంది సబ్జెక్టు టీచర్లు ఉన్నారు. రేషనలైజేషన్‌ నిబంధనల ప్రకారం ఆయా సబ్జెక్టులకు ఇంకా ముగ్గురు ఉపాధ్యాయులు అవసరం. జిల్లావ్యాప్తంగా చాలా పాఠశాలల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. మరోవైపు పదోన్నతులు, బదిలీల్లోనూ చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా పోయారు. ఇక్కడ తాత్కాలికంగా వాలంటీర్లను నియమిస్తారా? లేక ఉన్నవారిని సర్దుబాటు చేస్తారా అనేది స్పష్టత రాలేదు. ఈ పక్రియ ఆలస్యమైతే ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల బోధనపై ప్రభావం చూపనుంది.

ఆదేశాలు అందాలి

జిల్లాలో ఎల్‌పీ తెలుగు, హిందీ పదోన్నతుల్లో ఉపాధ్యాయులకు ఎదురైన సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బదిలీలతో ఖాళీ అయిన పాఠశాలల వివరాలు సేకరిస్తాం. ఎక్కువగా ఉన్న చోట సర్దుబాటు చేసేలా ప్రణాళికలు చేస్తాం.

రమేశ్‌కుమార్, జిల్లా విద్యాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని