logo

బాలికలకు వరం.. మినీ గురుకులం

గిరిజన ఆవాసాల్లో బాలికల అక్షరాస్యతను పెంచేందుకు 1999-2000 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గురుకులాలు ఏర్పాటయ్యాయి.

Published : 23 Jun 2024 04:51 IST

28 వరకు ప్రవేశాలకు అవకాశం

ధర్మారంలోని మినీ గిరిజన గురుకులం 

న్యూస్‌టుడే, ధర్మారం: గిరిజన ఆవాసాల్లో బాలికల అక్షరాస్యతను పెంచేందుకు 1999-2000 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గురుకులాలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని నాలుగు గిరిజన గురుకులాల్లో ధర్మారం పాఠశాల ఒకటి. మండలంలో మూడు పంచాయతీలతో పాటు కొత్తూరు, కొత్తపల్లి గ్రామాల్లో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉండటంతో మండలకేంద్రంలో మినీ గిరిజన గురుకులం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్కో తరగతికి 30 మంది చొప్పున అయిదు తరగతుల్లో 150 మంది చదువుకొనే వీలుంది. అయిదేళ్ల కిందటి వరకు ధర్మారంలోని పాతబస్టాండు ప్రాంతంలోని ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకొని నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం ఉన్న స్థానిక జక్కన్నపల్లిలోని సొంత భవనంలోకి మారింది.

పూర్తి స్థాయిలో వసతులు

ధర్మారం మండలకేంద్రంలోని జక్కన్నపల్లి వద్ద కరీంనగర్‌-రాయపట్నం రహదారి పక్కన గురుకులానికి సొంత భవనం ఉంది. విద్యార్థులకు సరిపడా స్నానాల గదులు, సామూహిక మరుగుదొడ్లు, ఆట స్థలం ఉన్నాయి. స్నానాలకు వేడి నీటి వసతి ఉంది. శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్నారు. అయిదుగురు ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎం, పీఈటీ ఉన్నారు. మెనూ ప్రకారం భోజనాలతో పాటు పడుకునేందుకు సరిపడా మంచాలున్నాయి. కంప్యూటరు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. పాఠశాల ఆవరణలో బాలికలు ఆడుకునేందుకు వీలుగా జారుడు బల్ల, తిరుగుడు కుర్చీలు, ఊయలలు తదితర ఆట పరికరాలున్నాయి.

సద్వినియోగం చేసుకోవాలి

చిన్నారులు అసౌకర్యానికి గురి కాకుండా అన్ని వసతులున్నాయి. ఈ విషయమై తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రవేశాలు పెంచుతున్నాం. కార్పొరేట్‌ తరహాలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నాం. ధర్మారంతో పాటు పరిసర మండలాల చిన్నారులనూ చేర్చుకుంటాం. ఈ నెల 28 వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి.

కవిత, ప్రధానోపాధ్యాయురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని