logo

పెరిగిన వాహనాలు తగ్గిన బిల్లులు

రామగుండం నగరపాలికలో అక్రమ డీజిల్‌ వినియోగంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కొంతకాలం కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు నగరపాలిక ఆధ్వర్యంలో ఉచితంగా డీజిల్‌ పోయించుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

Published : 23 Jun 2024 04:56 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: రామగుండం నగరపాలికలో అక్రమ డీజిల్‌ వినియోగంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కొంతకాలం కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు నగరపాలిక ఆధ్వర్యంలో ఉచితంగా డీజిల్‌ పోయించుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అధికారులు చర్యలు చేపట్టడంతో ఉచితంగా ప్రజాప్రతినిధుల, నాయకుల వాహనాల్లో ఇంధనం పోయడం నిలిపివేశారు. దీంతో ఇంధన బిల్లుల్లో వ్యత్యాసం వచ్చింది. గతంలో నగరపాలిక ఆధ్వర్యంలో తక్కువ వాహనాలను వినియోగించినప్పటికీ డీజిల్, పెట్రోల్‌ వినియోగం మాత్రం అత్యధికంగా ఉండగా.. తాజాగా ఎక్కువ వాహనాలను వినియోగిస్తుండగా ఇంధనాల వినియోగం తగ్గడమే దీనికి నిదర్శనం. అయినా కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు తమ వాహనాల్లో డీజిల్‌ పోయించాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నారు. పైగా వీటి బిల్లుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులు విచారణ జరిపి బిల్లులు గతంలో కంటే తగ్గడంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

రూ. లక్షల్లో వ్యత్యాసం

2023 మార్చిలో నగరపాలికలో 69 వాహనాలకు 11,340 లీటర్ల డీజిల్, 7,555 లీటర్ల పెట్రోలు వినియోగించగా.. రూ.19.54 లక్షల బిల్లు వచ్చింది. అదే నెల 2024లో 78 వాహనాల్లో 8,442 లీటర్ల డీజిల్, 6,505 లీటర్ల పెట్రోల్‌ పోయగా.. రూ.15.30 లక్షల బిల్లులు చెల్లించారు. గతంలో కంటే వాహనాల వినియోగం పెరిగి డీజిల్, పెట్రోల్‌ వినియోగం తగ్గి సుమారు రూ.4 లక్షలు బిల్లులు తక్కువగా రావడం గమనార్హం. 2023లో సెప్టెంబరు 79 వాహనాలకు గాను 10,290 లీటర్ల డీజిల్, 7,420 లీటర్ల పెట్రోల్‌ వినియోగంతో బిల్లు రూ.18.34 లక్షలు కాగా, అక్టోబరులో 78 వాహనాలకు 10,020 లీటర్ల డీజిల్, 7,610 లీటర్ల పెట్రోల్‌ వినియోగంతో రూ.18.30 లక్షల బిల్లులు చెల్లించారు. తాజాగా మే 2024లో 78 వాహనాల్లో 7,979 లీటర్ల డీజిల్, 7,050 పెట్రోల్‌ వినియోగంతో రూ.15.29 లక్షల బిల్లు వచ్చింది. ఈ గణాంకాలు పరిశీలిస్తే గతంలోకంటే వాహనాల వినియోగం పెరిగినా.. డీజిల్, పెట్రోల్‌ వినియోగంతో పాటు బిల్లులు తగ్గాయి. ఇటీవల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్‌ డీజిల్, పెట్రోల్‌ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో బిల్లులు తగ్గినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రజాప్రతినిధులు నగరపాలిక వాహనాలకు డీజిల్, పెట్రోల్‌ పోయిస్తున్న ఉద్యోగితో గొడవకు దిగడం జరిగింది. గత కొన్నేళ్లుగా తమ సొంత వాహనాల్లో నగరపాలిక ఆధ్వర్యంలో ఉచితంగా డీజిల్‌ పోయించుకునే వారిమని.. ఇప్పుడు అదే ఆనవాయితీని కొనసాగించాలని బెదిరిస్తున్న సంఘటనలున్నాయి. గతంలో కొన్ని వినియోగంలో లేని వాహనాలకు సైతం డీజిల్‌ పోయించినట్లుగా రికార్డుల్లో నమోదు కావడం గమనార్హం. లిట్టర్‌ ఫిక్కర్, ఫాగింగ్‌ వాహనాలు డీజిల్‌ దుర్వినియోగానికి వేదికలుగా మారాయనే ఆరోపణలున్నాయి.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

గతంలో కొందరు నాయకులకు నగరపాలిక ఆధ్వర్యంలో డీజిల్‌ పోయించేవారు. ప్రస్తుతం నిలిపివేసి కేవలం నగరపాలిక వాహనాలకు మాత్రమే డీజిల్, పెట్రోల్‌ పోయిస్తుండడంతో బిల్లులు తగ్గాయి. దీంతో ఆయా వర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. వారి సొంత వాహనాల్లో డీజిల్‌ పోయకపోవడంతోనే డీజిల్‌ వినియోగంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. నగరపాలిక వాహనాలను జియో ట్యాగింగ్‌ ద్వారా నిరంతరంగా పర్యవేక్షిస్తున్నాం. అవసరమైతేనే డీజిల్, పెట్రోల్‌ పోయిస్తున్నాం. డీజిల్, పెట్రోల్‌ వినియోగంలో అక్రమాలకు పాల్పడితే సంబంధీకులపై కఠిన చర్యలు తప్పవు.

సీహెచ్‌.శ్రీకాంత్, రామగుండం నగరపాలక కమిషనర్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు