logo

దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో?

కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తోంది.

Updated : 23 Jun 2024 06:23 IST

అర్హత ఉన్నా గృహజ్యోతి పథకానికి దూరం

న్యూస్‌టుడే, జగిత్యాల గ్రామీణం: కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తోంది. పథకం అమలవుతున్నా జిల్లాలో ఇంకా చాలా మంది అర్హులుగా ఉన్నప్పటికీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించకపోవటంతో పథకానికి లబ్ధి పొందలేకపోతున్నారు.  
జిల్లాలో గతేడాది డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 3,51,211 గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి మాత్రమే గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో 3,07,127 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రజా పాలనలో 1,91,598 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 200 యూనిట్ల లోపు వాడుకుంటేనే ఉచిత విద్యుత్తు వర్తిస్తుంది. 200 యూనిట్లు దాటితే బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులను నాలుగు నెలలకు ఒకసారి స్వీకరిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. మొదటి విడత దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఎన్నికల కోడ్‌ రావటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో ప్రజాపాలన కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిలో మార్పు చేర్పులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది. చాలా మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా దరఖాస్తులను తీసుకోవడంలేదు.

50 వేలకు పైగా...

జిల్లాలో మూడు లక్షలకు పైగా రేషన్‌ కార్డులున్నప్పటికీ 1,91,598 మంది మాత్రమే అర్హులుగా తేలగా కనీసం మరో 50 వేలకుపైగా దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. మరోసారి అవకాశం కల్పిస్తే 50 నుంచి 70 వేల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జిల్లాలో గత నెలలో 1,71,183 మంది 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించగా రూ.7,16,35,196 లబ్ధి చేకూరింది. మెట్‌పల్లి డివిజన్‌లో 1,42,095 విద్యుత్తు కనెక్షన్లకు 75,474 మంది గృహ జ్యోతి లబ్ధిదారులు ఉండగా 66,665 మంది రూ.2,87,84,157 లబ్ధిపొందారు. జగిత్యాల డివిజన్‌లో 2,09,116 విద్యుత్తు కనెక్షన్లు ఉండగా 1,16,124 లబ్ధిదారులకు 1,04,518 మందికి రూ.4,28,51,039 లబ్ధి చేకూరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని