logo

అత్యవసరమైతే పరుగులే!

అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం రక్తం ఎంత అవసరమో మనందరికీ తెలుసు. సకాలంలో రక్తం అందితే రోగి ప్రాణాలు కాపాడవచ్చు.

Published : 23 Jun 2024 05:04 IST

రక్త నిల్వ కేంద్రాలు లేక అవస్థలు

వినియోగంలో లేని పరికరాలు 

న్యూస్‌టుడే, మెట్‌పల్లి: అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం రక్తం ఎంత అవసరమో మనందరికీ తెలుసు. సకాలంలో రక్తం అందితే రోగి ప్రాణాలు కాపాడవచ్చు. సరైన సమయానికి రక్తమందక ప్రాణాలు కూడా పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఒక్కోసారి రక్తం కోసం బాధిత కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి సమయంలో ప్రాణాలు కాపాడేందుకు రక్త నిల్వ కేంద్రాలు దోహదపడతాయి. జిల్లాలో జగిత్యాలలో తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ రక్త కేంద్రాలు లేవు. ఎక్కువగా రోగుల తాకిడి ఉండే మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో కూడా రక్త నిల్వ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సి వస్తోంది.
మెట్‌పల్లి, కోరుట్ల ఆసుపత్రులకు వివిధ రకాల చికిత్స నిమిత్తం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. గర్భిణులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో ప్రసవాలు చాలానే జరుగుతాయి. మెట్‌పల్లిలో ఏటా సుమారు 2 వేల వరకు జరుగుతుండగా, కోరుట్లలో కూడా ఇంచుమించు ఎక్కువగానే జరుగుతాయి. వీరిలో రక్తహీనత ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో రక్తం అవసరముంటుంది. అలాగే ఈ రెండు పట్టణాల గుండా జాతీయ రహదారి ఉంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలతో పాటు చుట్టుపక్కల మండలాల్లో జరిగిన ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకొస్తుంటారు. ప్రమాదాల్లో గాయపడ్డ వారికి తీవ్ర రక్తస్రావం జరిగిన సమయంలో వెంటనే రక్తం ఎక్కించాల్సిన అవసరముంటుంది. అంతే కాకుండా క్యాన్సర్, తలసేమియా బాధితులకు రక్తం ఎక్కించాలి. అలాగే ఇతర శస్త్రచికిత్సల కోసం వచ్చే వారుంటారు. వారికి రక్తం అవసరం పడుతోంది. ఈ క్రమంలో రక్త నిల్వ కేంద్రాలు లేకపోవడంతో జిల్లా కేంద్రానికి వైద్యులు రిఫర్‌ చేస్తున్నారు. జగిత్యాల నుంచి అవసరమైన రక్తం తెప్పించి రోగులకు ఎక్కిస్తున్నారు. 

పరికరాలు వచ్చినా..

మెట్‌పల్లి ఆసుపత్రికి గతంలో రక్త నిల్వ కేంద్రం మంజూరైంది. రిఫ్రిజరేటర్, మైక్రోస్కోప్‌ తదితర పరికరాలు వచ్చినా సరిపడా గదులు లేక వినియోగించడం లేదు. ప్రస్తుతం కొత్త భవనం నిర్మాణంలో ఉండగా, అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగంలోకి తెస్తామని స్థానిక వైద్యులు చెబుతున్నారు. కోరుట్లలో వంద పడకల ఆసుపత్రి అయినప్పటికీ రక్త నిల్వ కేంద్రం మంజూరు కాలేదు. మెట్‌పల్లి, కోరుట్ల ఆసుపత్రుల్లో రక్త నిల్వ కేంద్రాలు ఉంటే జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు వ్యయ, ప్రయాసలు తప్పడంతో పాటు అన్ని గ్రూపుల రక్తం స్థానికంగా అందుబాటులో ఉండే అవకాశముంటుంది. దీనివల్ల అవసరమైన వారికి సకాలంలో రక్తం ఎక్కించవచ్చు. అలాగే ఈ ప్రాంతంలో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రక్తదానంలో ముందుంటున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తం నిల్వ ఉంచడం వల్ల స్థానికులకు ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని