logo

రెండు నెలల కిందట అదృశ్యమై.. బావిలో శవమై

మానకొండూర్‌ గ్రామానికి చెందిన అనంతోజు సాయికిరణ్‌ (29) అనే యువకుడు కుమురంభీం జిల్లా దహెగాం మండలంలోని ఓ పాడుబడిన బావిలో శవమై తేలాడు. మానకొండూర్‌ సీఐ రాజ్‌కుమార్, దహెగాం ఎస్సై కందూరి రాజు కథనం మేరకు..

Published : 23 Jun 2024 05:06 IST

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మానకొండూర్‌ యువకుడి హత్య

సాయికిరణ్‌  

దహెగాం, న్యూస్‌టుడే : మానకొండూర్‌ గ్రామానికి చెందిన అనంతోజు సాయికిరణ్‌ (29) అనే యువకుడు కుమురంభీం జిల్లా దహెగాం మండలంలోని ఓ పాడుబడిన బావిలో శవమై తేలాడు. మానకొండూర్‌ సీఐ రాజ్‌కుమార్, దహెగాం ఎస్సై కందూరి రాజు కథనం మేరకు.. సాయికిరణ్‌ ఏప్రిల్‌ 18న తాను సిద్దిపేటకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో మే 2న భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో సాయికిరణ్‌ గతంలో సిద్దిపేట జిల్లా కొండాపూర్‌లోని ఓ కోళ్లఫారంలో పనిచేసేవాడని తెలిసింది. ఆ దిశగా విచారించగా కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం బారెగూడ గ్రామానికి చెందిన బట్టె శ్రీనివాస్, అతడి భార్య సునీత అదే ఫారంలో పనిచేసే వారని, వారితో సాయికిరణ్‌ సన్నిహితంగా ఉండేవారని తేలింది. ఈ మేరకు బట్టె శ్రీనివాస్‌ని అదుపులోకి తీసుకుని విచారించారు. సాయికిరణ్‌ ఏప్రిల్‌ 19న సునీత తల్లిగారి ఇంటికి దహెగాంకి వచ్చాడు. రాత్రి సమయంలో అతడ్ని సునీతతోపాటు ఆమె భర్త శ్రీనివాస్, తండ్రి, మేనమామ నలుగురు కలిసి కర్రలతో కొట్టి చంపి దహెగాంలోని ఓ పాడుబడిన బావిలో పడేశారని విచారణలో వెల్లడైంది. బావిలో సాయికిరణ్‌ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించగా వెలికితీశారు. పూర్తి విచారణ అనంతరం హత్యకు గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

మానకొండూర్‌లో విషాదం 

మానకొండూర్‌ : ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాంలో సాయికిరణ్‌ హత్యకు గురి కావడంతో మానకొండూర్‌లో విషాదం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన అనంతోజు భాగ్యలక్ష్మి, సత్యనారాయణ దంపతులకు సాయికిరణ్‌ ఏకైక సంతానం. సత్యనారాయణ స్థానికంగా వడ్రంగి పని చేస్తున్నాడు. యువకుడు స్థానిక కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసుకొని కొన్ని రోజులు ఆటో నడిపించాడు. అదే గ్రామానికి చెందిన అనూషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు ఆదర్శ, కూతురు ఆరాధన. కొద్ది రోజుల క్రితం మద్యం దుకాణంలో తనపై దాడి చేయడంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సాయికిరణ్‌ హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు   కన్నీరుమున్నీరయ్యారు.


అప్పుల బాధతో నేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: అప్పుల బాధతో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్‌నగర్‌కు చెందిన కుడిక్యాల నాగరాజు (47) సాంచలు నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఆరు నెలలుగా సరిగా పని లేకపోవడంతో కుటుంబ పోషణకు, కుమారుడి ఫీజుల కోసం రూ.4 లక్షల వరకు అప్పులు చేశారు. అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు.. శుక్రవారం యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. నాగరాజుకు భార్య లావణ్య, కుమారులు లోకేష్, విగ్నేష్‌లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి పట్టణ సీఐ సదన్‌కుమార్‌ పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని