logo

వాయిద్య సంగీతం.. ఆసక్తితో ప్రావీణ్యం

నేటికాలంలో చాలామంది పిల్లలు, యువతీయువకులు నిత్యం చదువులో నిమగ్నమవుతున్నారు. ఏదో కొంత సమయం ఆటలకు కేటాయిస్తున్నారు.

Published : 23 Jun 2024 05:12 IST

కీబోర్డు, వయోలిన్, గిటార్, మృదంగంలో రాణింపు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం: నేటికాలంలో చాలామంది పిల్లలు, యువతీయువకులు నిత్యం చదువులో నిమగ్నమవుతున్నారు. ఏదో కొంత సమయం ఆటలకు కేటాయిస్తున్నారు. కొందరు మాత్రం వాటితోపాటు వాయిద్య సంగీతంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు కళా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఏ పాటకైనా అందమైన వాయిద్య సంగీతం తోడైతేనే మాధుర్యాన్ని పంచుతోంది. కొందరు గాత్రానికి ప్రాధాన్యమిస్తే మరికొందరు వాయిద్య సంగీతం నేర్చుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఈక్రమంలో సంగీతం నేర్చుకుంటున్న వారు తమ మనోభావాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.

కల సాకారం చేసుకోవాలని..

నాకు చిన్నతనం నుంచే సంగీతమంటే మక్కువ. చదువుకొనే సమయంలో నేర్చుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. జీవితంలో డాక్టర్‌గా స్థిరపడిన నేను, ఇప్పుడు చిన్ననాటి కలను నిజం చేసుకోవాలని చూస్తున్నా. వైద్యరంగంలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ నృత్యంలో, గాత్రంలో, వయోలిన్‌ వాయించడంలో శిక్షణ పొందుతున్నా. దేశంలోనే ప్రముఖ శైవ క్షేత్రమైన కాశీలో నృత్య ప్రదర్శనతోపాటు సంగీత కచేరి చేసి ప్రశంసలు అందుకున్నా. వారణాసిలోని సుబహ్‌..ఏ..బనారస్‌ అనే సంస్థ ప్రతినిధులతో సన్మానం అందుకున్నా. త్వరలో నేను చేసిన ఆల్బమ్‌ కూడా విడుదల కానుంది.

డాక్టర్‌ సాయి అక్షిత, కరీంనగర్‌

గిటారిస్ట్‌గా ఎదగాలనేది లక్ష్యం

నేను డిగ్రీ పూర్తి చేశాను. చిన్నతనం నుంచి సంగీతం ఆస్వాదించడమంటే చాలా ఇష్టం. ముఖ్యంగా గిటార్‌ ప్రత్యేక సంగీతం అంటే మక్కువ ఎక్కువ. ఫ్యూజన్‌ సంగీత సంస్థ రాజ్‌కుమార్‌ మోటుపల్లి దగ్గర గిటార్‌ శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుతం గిటార్‌లో ఇంటర్మీడియెట్‌ స్థాయికి చేరుకున్నా. త్వరలో పూర్తి స్థాయిలో శిక్షణ పొంది మంచి గిటారిస్ట్‌గా ఎదగాలన్నదే నా లక్ష్యం. నాన్న ఏఎస్సై జస్పాల్‌సింగ్‌ ప్రోత్సహిస్తున్నారు.

అమన్‌పాల్‌ సింగ్, కరీంనగర్‌

కళాశాల వేడుకల్లో వాయిస్తున్నా..

పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ సంగీత కళాశాలలో నాలుగేళ్లుగా మృదంగం శిక్షణ తీసుకుంటున్నా. కళాశాల మృదంగం అధ్యాపకులు రాజేశం శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నా. సంగీతంపై అభిరుచి ఉండటంతో మా అమ్మానాన్నలు ప్రోత్సహించి మృదంగం శిక్షణ ఇప్పిస్తున్నారు. కళాశాలలో జరిగే వేడుకలలో మృదంగం వాయిస్తున్నా. అందరూ మెచ్చుకొనే స్థాయికి ఎదగాలన్నదే నా అభిమతం. 

సత్యజిత్‌ నాగ ప్రజ్వల్, మంథని

పుణ్య క్షేత్రాల్లో కచేరీలు..

చిన్నతనం నుంచే నాకు సంగీతం అంటే ఇష్టం. టీవీలో వచ్చినప్పుడు శ్రద్ధగా వినేవాణ్ని. నాలో ఆసక్తి గమనించిన అమ్మానాన్న నిత్యశ్రీ, విజయరఘురామరాజు రెండేళ్లుగా కీబోర్డులో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆరో తరగతి చదువుతున్న నేను, ప్రస్తుతం కచేరీలో వాయించే స్థాయికి ఎదిగా. కీబోర్డుతోపాటు గాత్రంలో కూడా శిక్షణ పొందుతూ జిల్లా వ్యాప్తంగా ప్రముఖ పుణ్య క్షేత్రాలలో జరిగిన కచేరీలలో పాల్గొంటున్నా. 

వినీల్‌ కౌముదిరాజు, కరీంనగర్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని