logo

ఆస్పత్రుల్లో భద్రత ప్రశ్నార్థకం!

రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో నిబంధనలు పట్టించుకోవడం లేదు.. అనారోగ్యమని ఆస్పత్రుల మెట్లు ఎక్కేవారి భద్రత ప్రశ్నార్థకమవుతోంది..

Updated : 23 Jun 2024 06:01 IST

నిబంధనలపై పట్టింపు కరవు

ఈనాడు, కరీంనగర్‌ న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో నిబంధనలు పట్టించుకోవడం లేదు.. అనారోగ్యమని ఆస్పత్రుల మెట్లు ఎక్కేవారి భద్రత ప్రశ్నార్థకమవుతోంది.. గత నెలలో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లాలో భద్రతా లోపాల్ని సవరించుకోవడం లేదు. శనివారం సాయంత్రం  ఓ ప్రైవేటు ఆసుపత్రిలో షార్ట్‌సర్క్యూట్‌ అయి మంటలు రేగిన ఘటన మరోసారి భద్రతను ప్రశ్నార్థకం చేసింది.. 
నాలుగు జిల్లాల పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లోని వసతుల తీరుపై గతేడాది అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,186 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నట్లు అప్పట్లో గుర్తించారు. దాదాపు 80 శాతం ఆస్పత్రుల్లో ఏదో ఒక లోపముందని గుర్తించిన అధికారులు 20 శాతం దవాఖానాలకు తాఖీదులు అందించారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ ఆ ఆస్పత్రుల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. 

నిర్వహణ  మొక్కుబడిగానే..

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉపకరణాల ఏర్పాటు, నిర్వహణ విషయంలో చాలా యాజమాన్యాలు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాయి. భవనం అనుమతుల నుంచి అడుగడుగునా నిబంధనల అతిక్రమణలే ఉంటున్నాయి.  పర్యవేక్షణ అధికారుల్ని మచ్చిక చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా వైద్యారోగ్యశాఖతోపాటు పుర, నగరపాలక సంస్థలు, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్తు శాఖ ఇలా పలు శాఖల నిరంతర పర్యవేక్షణ ఆస్పత్రులపై ఉండాలి. అగ్నిమాపక శాఖ వారు ప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉన్నాయా.. పని చేస్తున్నాయా పరిశీలించాలి. విద్యుత్తు శాఖ అధికారులు విద్యుత్తు ఉపకరణాలు నాణ్యమైనవే వాడుతున్నారా.. వారు అనుమతి తీసుకున్న కెపాసిటీ మేరకే వినియోగిస్తున్నారా.. వైరింగ్‌ ఎలా ఉంది తదితర విషయాలు పరిశీలించాలి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు, జనరేటర్, విద్యుత్తు ఉపకరణాలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశముంటుంది. ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదా క్రమం తప్పకుండా ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా పట్టించుకోకపోవడం ప్రమాదాలకు కారణమవుతుందన్న ఆరోపణలున్నాయి. పైగా ఆస్పత్రిలో ఏ ఉపకరణాల్ని వాడుతున్నారనే విషయంలో లెక్కాపత్రం లేదని వైద్యఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి చెప్పడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే ఆస్పత్రులపై దృష్టి పెట్టి భద్రత విషయంలో చర్యలు తీసుకుంటేనే ప్రమాదాలు మున్ముందు జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్నను సంప్రదించగా ప్రతి ఆసుపత్రిలో భద్రత ప్రమాణాలు పాటించడం యాజమాన్యాల బాధ్యత అన్నారు. తాము పలుమార్లు అవగాహన కల్పించామని, తనిఖీలు చేశామని.. నిబంధనల మేరకు లేని వాటికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. మరోసారి అన్ని ఆస్పత్రులపై దృష్టి సారించి సూచనలు ఇస్తామన్నారు.


ప్రైవేటు దవాఖానాలో చెలరేగిన మంటలు

అప్రమత్తమైన సిబ్బంది.. తప్పిన ప్రాణాపాయం

రోగులను మరో ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది 

కరీంనగర్‌ నేరవార్తలు, పట్టణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌లో శనివారం సాయంత్రం గాయత్రి ఆసుపత్రిలోని ఒక గదిలో మంటలు చెలరేగడంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి రెండో అంతస్తులో చికిత్స పొందేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏసీ గది నుంచి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో గదిలో రోగులు లేరు. మంటలతో వ్యాపించిన పొగలను గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. పక్క గదుల్లో చికిత్స పొందుతున్న అయిదుగురు రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు వ్యాపించకుండా విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, అదనపు డీఎఫ్‌వో ప్రభాకర్, కరీంనగర్‌ అగ్నిమాపక కేంద్ర అధికారి పరమేశ్వర్‌ ఆసుపత్రి యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు. షార్ట్‌సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారి వెంకన్న తెలిపారు. నిబంధనల ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు వైద్యులు రంజిత్‌కుమార్, మేఘనరావు తెలిపారు.

కాలిపోయిన ఏసీ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని