logo

అయ్యో పాపం.. అందరిదీ నిర్లక్ష్యం!

పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో సెప్టిక్‌ట్యాంకులో పడి బాలుడు జాన్‌వెస్లీ మృతి చెందిన ఘటన నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది.

Published : 11 Jul 2024 03:07 IST

బాలుడి మృతి ఘటనపై పరస్పర ఫిర్యాదులు

ప్రమాదానికి కారణమైన తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌

న్యూస్‌టుడే, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో సెప్టిక్‌ట్యాంకులో పడి బాలుడు జాన్‌వెస్లీ మృతి చెందిన ఘటన నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఈ ప్రమాదానికి ఆసుపత్రి శానిటరీ సూపర్‌వైజర్‌ అలకపల్లి సంపత్‌ కారణమని మృతుడి తండ్రి శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ ప్రక్రియ పరిశీలన వరకే తన బాధ్యత అని, సెప్టిక్‌ట్యాంక్‌ మ్యాన్‌హోల్‌కు మూత లేదని, గతంలోనూ ఇదే పరిస్థితి ఉందని సంపత్‌ పేర్కొన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కావాలనే తనను ఈ కేసులో ఇరికించారంటూ బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సెప్టిక్‌ట్యాంక్‌కు మూత పెట్టడం సివిల్‌ వర్క్‌ కిందకు వస్తుందని, దానికి తమ విధులకు సంబంధం లేదని, ఆస్పత్రిలోని ఆధిపత్య రాజకీయాలతోనే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని అందులో శానిటరీ సూపర్‌వైజర్‌ సంపత్‌ పేర్కొన్నారు.

 ఘటన తర్వాత ఇలా.. (ఈ జాగ్రత్త ముందే ఉంటే ఓ ప్రాణం నిలిచేది)

ఎన్నెన్నో సందేహాలు

  • తప్పు ఎవరిదైనా ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమే బాలుడి ప్రాణం తీసింది. కొన్నేళ్లుగా సెప్టిక్‌ట్యాంక్‌ మ్యాన్‌హోల్‌కు మూత లేదని చెబుతున్న సూపర్‌వైజర్‌ ఈ విషయాన్ని అధికారులు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదన్న దానికి జవాబు లేదు.
  • బాలుడిని సెప్టిక్‌ట్యాంక్‌ నుంచి తీసేంత వరకు కనిపించని మూత ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ జరపాల్సి ఉంది.
  • ఘటన సమయంలో సెప్టిక్‌ ట్యాంకుకు చెందిన మూడు మ్యాన్‌హోళ్లలో రెండింటికి మూత ఉండగా, ఒకటి లేకుండా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత మాత్రం అప్పటికప్పుడు వచ్చి పడింది.
  • కొన ఊపిరితో ఉన్న బాలుడు జాన్‌వెస్లీని కరీంనగర్‌కు ఆస్పత్రి అంబులెన్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు అంబులెన్స్‌లో ఇద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకెళ్లారు.
  • అంబులెన్స్‌లో రోగి వెంట వైద్యులు వెళ్లడం మంచిదే అయినా ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్‌లో, అది లేకుంటే 108 వాహనంలో తీసుకెళ్లాల్సి ఉండగా ప్రైవేటు వాహనంలో తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
  • పెద్దపల్లి ఆస్పత్రిలో బాలుడికి చికిత్స అందించే క్రమంలోనూ ఆస్పత్రి వర్గాలు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. మీడియాను కూడా అనుమతించకుండా పోలీసుల పర్యవేక్షణలో వైద్య సేవలందించారు. ఇలా.. పలు అంశాలు జవాబు లేని ప్రశ్నలుగా మిగిలాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని